Naatu Naatu Song : చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్.. ‘‘నాటు నాటు’’కు ఆస్కార్ , నెరవేరిన దశాబ్ధాల కల
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మనకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ‘ఆస్కార్’ కోరి వరించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’కు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ లభించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుంది. దీంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోయింది.
ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్:
ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల్లో పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఇక.. ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 భాషల సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ అవార్డుల కమిటీ తుది జాబితాకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లగాన్ తర్వాత ఓ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇకపోతే.. డాక్కుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.
1200 వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్:
ఇదిలావుండగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments