Orey Bujjiga Review
నేటి తరం యువ హీరోల్లో రాజ్‌తరుణ్ సక్సెస్ ట్రాక్ బాగోలేదు. కెరీర్ ప్రారంభంలో చేసిన ‘ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, ఆడోరకం ఈడోరకం’ సినిమాలు తప్ప ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. రాజ్‌తరుణ్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. మరోవైపు డైరెక్టర్ కొండా విజయ్‌కుమార్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత చేసిన ‘ఒకలైలా కోసం’ హిట్ కాలేదు. తర్వాత కొండా విజయ్ కుమార్ సినిమాలేవీ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు, హీరో రాజ్‌తరుణ్‌తో చేసిన సినిమా ‘ఒరేయ్.. బుజ్జిగా’. ఇద్దరికీ సక్సెస్ కావాల్సిన తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారికి సక్సెస్‌ను అందించిందా? థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఆహాలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
శ్రీనివాస్(రాజ్‌తరుణ్) తన జూనియర్ సృజన(హెబ్బాపటేల్)ను ప్రేమిస్తాడు. ఆమె ప్రేమించకున్నా, తన ప్రేమను ఆమె ఒప్పుకుంటుందనే నమ్మకం ఉంటాడు. అయితే తండ్రి కొన్ని కారణాలతో శ్రీనివాస్‌కు పెళ్లి ఖరారు చేస్తాడు. మరోవైపు అదే ఊర్లులో ఉండే కృష్ణవేణి లైఫ్‌లో ఏదైనా సాధించాలనుకునే వ్యక్తి. తన బావతో పెళ్లి కుదిర్చిన పెళ్లిని తప్పించుకోవడానికి ఇంటి నుండి పారిపోతుంది. ఇద్దరూ ఒకే ట్రెయిన్ ఎక్కుతారు. అది తెలిసిన రెండు కుటుంబాలవాళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా ఇద్దరూ కలిసి లేచిపోయారని అనుకుంటారు. రెండు కుటుంబాలవాళ్లు గొడవలు పడుతుంటారు. ట్రెయిన్‌లోనే శ్రీనివాస్, కృష్ణవేణి మధ్య పరిచయం పెరుగుతుంది. పరిచయంలో కృష్ణవేణి తన పేరుని స్వాతి అని మార్చి చెబుతుంది. కృష్ణవేణి తల్లి చాముండేశ్వరి తనతోనే ఆమె కూతురు వచ్చేసిందని భావించి తన తండ్రిపై ప్రతీకారం తీర్చుకుంటుందని శ్రీనివాస్‌కు తెలుస్తుంది. దాంతో కృష్ణవేణిని ఎలాగైనా పట్టించి నాన్న సమస్యను తీర్చాలనుకుంటాడు శ్రీనివాస్ అలియాస్ బుజ్జిగాడు. తను బుజ్జిగాడుతో లేచిపోయానని ఊర్లో అనుకుంటున్నారని తెలిసి కృష్ణవేణి కూడా బుజ్జిగాడుపై కోపం పెంచుకుంటుంది. కృష్ణవేణినే తను వెతుకున్న అమ్మాయని శ్రీనివాస్‌కి, శ్రీనివాసే తను ద్వేషించే బుజ్జిగాడని కృష్ణవేణికి తెలియదు. ఇద్దరూ హైదరాబాద్‌లో స్నేహితుల్లా పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయం ప్రేమగా మారే తరుణంలో బుజ్జిగాడు అనుకోండా ఓ తప్పు చేస్తాడు. ఆ తప్పేంటి? దాన్ని ఎలా సరిదిద్దుకున్నాడు? శ్రీనివాస్, కృష్ణవేణిలకు అసలు నిజం తెలుస్తుందా? వారి ప్రేమ ఏమవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
ఒరేయ్ బుజ్జిగా.. కన్‌ఫ్యూజింగ్ కామెడీ ట్రాక్‌తో రన్ అయ్యే సినిమా అని ప్రారంభంలోనే తెలిసిపోతుంది. ఓ చిన్న పుకారుతో అసలు సినిమా కథలోకి డైరెక్ట్‌గా వెళ్లిపోతాం. సినిమా ఏంటో ఎలా రన్ అవుతుందనే విషయం పదిహేను, ఇరవై నిమిషాల్లోనే అర్థమైపోతుంది. ఇలాంటి కన్ఫ్యూజింగ్ కామెడీతో సినిమా చేసే సమయంలో కామెడీ ట్రాక్ ఆసక్తికరంగా ఉండాలి. కానీ డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ పాత స్టైల్లోనే సినిమా తెరకెక్కించడంలో ఆగిపోయారా? అని సినిమా చూస్తే అనిపిస్తుంది. సినిమా చూసే క్రమంలో చాలా లాజిక్ లేని సన్నివేశాలు కొట్టొచ్చినట్లు ప్రేక్షకుడికి కనపడతాయి. ఏదో సినిమా కదా అనే భావనతో చూసినా ఓ పట్టాన మింగుడుపడని సన్నివేశాలవి. నవ్వేంత కామెడీ సినిమాలో వెతికినా కనపడదు. చాలా సీన్స్ రొటీన్‌గానే అనిపిస్తాయి. గుర్తు పెట్టుకునే సన్నివేశాలు కూడా లేవు. రొట్టుకామెడీగానే అనిపిస్తుంది తప్ప.. కొత్తదనం కనపడదు. ఇక సెకండాఫ్ ఫస్టాఫ్‌ను మించేలా ఉంటుంది. కన్‌ప్యూజింగ్‌ను పెంచే క్రమంలో దర్శకుడు కన్‌ఫ్యూజింగ్ అయినట్లు, ఏదోదో చేసేసినట్లు అనిపిస్తుంది. అసలు తిప్పిన చోటే కథను తిప్పుతున్నాడేంట్రా బాబూ.. ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనుకునేలా సినిమా రన్ అవుతుంది. కన్‌ప్యూజన్‌ను మరింత క్రిటికల్ చేశారేమో అనిపించేంతగా ఉంది. ఇక రాజ్‌తరుణ్ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేసినా, తన ఖాతాలో మరో ప్లాప్ పడినట్లే. ఇక మాళవికా నాయర్ ఎట్రాక్టింగ్ హీరోయిన్ అయితే కాదు.. ఇక హెబ్బా పటేల్ పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఇక వాణీవిశ్వనాథ్, పోసాని, అజయ్ ఘోష్, నరేష్ ఇలా అందరూ వారి పాత్రల్లో చక్కగానే నటించారు. నటీనటుల పరంగా ఇబ్బంది లేదు కానీ.. కథ, కథనంలోనే అసలు సమస్య అని చక్కగా తెలుస్తుంది. అనూప్ సంగీతం అందించిన పాటల్లో ఈ మాయ పేరేమిటో.. సాంగ్ వినడానికి బాగానే ఉంది కానీ.. చూడటానికి మాత్రం కాదు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. కెమెరాపనితనం ఉన్న లొకేషన్స్‌ను గొప్పగా చూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. సినిమాను పక్కాగా చుట్టేద్దాం అనే రీతిలో చేసినట్లుంది.
చివరగా.. ఒరేయ్ బుజ్జిగా.. కన్‌ఫ్యూజింగ్
- Read in English