అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఉత్తర్వులు
- IndiaGlitz, [Friday,September 11 2020]
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం ఈ నెల 5న అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దారితీసింది. తొలుత ఘటనను పెద్దగా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో చాలా సీరియస్‌గా తీసుకుంది. నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువెత్తిన నిరసనలతో చేసేదిలేక చివరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటన వెనుక శక్తులు ఎవరున్నారో నిగ్గుతేల్చే బాధ్యతను ఆ సంస్థకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు గురువారం రాత్రి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఏపీ పోలీసు శాఖ విచారణ చేపట్టినప్పటికీ పురోగతి మాత్రం కనిపించలేదు. మరోవైపు ఘటనపై రాష్ట్రం నలువైపుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగింది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన దివ్యరథం ఈ నెల 5న అర్థరాత్రి సమయంలో అగ్నికి ఆహుతైంది.
స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా రథోత్సవం నిర్వహిస్తుంటారు. అలాంటి రథం అగ్నికి ఆహుతవడంతో భక్తులు దీనిని అరిష్టంగా భావించారు. ఈ రథం తగలబడానికి కారకులెవరో మాత్రం తెలియకపోవడం.. మరోవైపు జనసేన, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ వంటి పలు హిందూ సంస్థల ఆందోళనల నడుమ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజాల నిగ్గు తేల్చేందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని హోమంత్రి సుచరిత తెలిపారు.