Modi:మోడీ ప్రభుత్వంపై 'ఇండియా' కూటమి అవిశ్వాస తీర్మానం .. బీఆర్ఎస్, ఎంఐఎం మద్ధతు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాకాండపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన నాటి నుంచి విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. కేంద్రం ఈ విషయంలో దిగి రాకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఎంఐఎం కూడా అవిశ్వాస తీర్మానానికి మద్ధతిచ్చింది.
చర్చకు సిద్ధమన్న కేంద్రం:
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. ఎలాంటి పరిస్ధితులు వచ్చినా కేంద్రం చర్చించేందుకు సిద్ధంగా వుందని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్ హింసపై చర్చ జగాలని తామూ కోరుకుంటున్నామని.. అందుకు తాము ఒప్పుకుంటున్నా వాళ్లు (విపక్షాలు) మాత్రం రూల్స్ గురించి గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సాగు సజావుగా సాగకుండా చేయడానికే ఇలా చేస్తున్నారంటూ మేఘ్వాల్ పేర్కొన్నారు.
వ్యూహం ప్రకారం విపక్షాలు:
అయితే కేంద్రంపై విపక్షాలు ఓ వ్యూహం ప్రకారం వెళ్తున్నాయని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ప్రధాని మోడీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలపై గళమెత్తేందుకు అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సభలో ఎన్డీయేదే బలం :
ఇక లోక్‌సభలో బలాబలాల విషయానికి వస్తే.. ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల బలం వుండగా, విపక్ష ‘‘ఇండియా’’కు 140 మంది సభ్యులున్నారు. ఏ కూటమిలో లేకుండా మరో 60 మంది వున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమే. గతంలో 2018లోనూ మోడీ ప్రభుత్వంపై యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేవలం మణిపూర్ అంశంలో చర్చలు కోసమే విపక్షాలు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments