చిన్మయికి ఓపెన్ థ్రెట్
- IndiaGlitz, [Monday,April 15 2019]
సింగర్ చిన్మయి.. నిన్నటి వరకు మెలోడీ సాంగ్స్ కి కేరాఫ్. ఇప్పుడు వాటితో పాటు మీ టూ ఉద్యమంలో ధైర్యంగా పాల్గొన్న సౌత్ ఇండియన్ సెలబ్రిటీలకు కేరాఫ్. తమకు జరిగిన అన్యాయాన్ని గురించి అమ్మాయిలు నోరు విప్పి చెప్పడమే అరుదు. అలాంటిది 15 ఏళ్ల క్రితం ప్రముఖ గీత రచయిత వైరముత్తు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విధానాన్ని బైట పెట్టారు చిన్మయి.
అప్పటి నుంచి ఆమెకు తమిళనాడులో పలు రకాలుగా వ్యతిరేకత వినిపిస్తూ ఉంది. డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమెను బహిష్కరించారు. తాజాగా తమిళ నిర్మాత కె.రాజన్ చిన్మయి పేరు ప్రస్తావించకుండానే ఆమె గురించి చిలవలుపలవలుగా మాట్లాడారు. 15 క్రితం జరిగినదాన్ని ఇప్పుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
ఎవరూ తేలిగ్గా పైకి రారని, వైరముత్తు ఆ స్థాయికి రావడానికి ఎన్నో మెట్లు దాటుకునే వచ్చారని, అంతటి గొప్ప వ్యక్తులను ఇలాంటి చిన్న విషయాలకు రోడ్ల మీదకు లాగడం తప్పని, తన దగ్గర ఉన్న 50 మంది మహిళలను పంపిస్తే వాళ్లు చిన్మయిని ఛిద్రం చేసేస్తారని, చిదిమేస్తారనీ ఆయన బాహాటంగానే చెప్పారు.
ఆ వీడియో చిన్మయి షేర్ చేస్తూ చిదిమేస్తాననిఅంటున్నారు. భయపడాలా? అని కామెంట్ పెట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా, బహిరంగంగా బయటకు వచ్చి నలుగురు ముందు వినిపించిన అమ్మాయికి వీలైతే సపోర్ట్ చేయాలిగానీ, ఇలా భయపెట్టడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు వ్యవహారమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.