రమ్యకృష్ణ కి మాత్రమే సాధ్యమైంది

  • IndiaGlitz, [Saturday,December 23 2017]

న‌టిగా ర‌మ్య‌కృష్ణ ఏమిటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానాయిక‌గానూ, విల‌న్‌గానూ, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ త‌న స‌త్తా చాటింది ర‌మ్య‌. అలాంటి ర‌మ్య‌కి తెలుగు సినిమాకి సంబంధించి ఓ అరుదైన‌, అపురూప‌మైన అవ‌కాశం ద‌క్కింది. ఇంత‌కీ అదేమిటంటే.. రెండు ఫ్యామిలీకి చెందిన మూడు త‌రాల న‌టుల‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం. ఆ రెండు కుటుంబాలు మ‌రేవో కాదు.. నంద‌మూరి, అక్కినేని కుటుంబాలు. నంద‌మూరి కుటుంబం విష‌యం తీసుకుంటే.. మ‌హాన‌టుడు ఎన్టీఆర్‌తో మేజ‌ర్ చంద్ర‌కాంత్ చేసింది ర‌మ్య‌. ఆ త‌రువాత రెండో త‌రంలో బాల‌కృష్ణ‌తో బంగారుబుల్లోడు, వంశానికొక్క‌డు, దేవుడు, వంశోద్ధార‌కుడు సినిమాలు చేసింది.

అలాగే హ‌రికృష్ణ‌తో టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ కోసం క‌లిసి న‌టించింది. మూడో త‌రంలోని హీరో అయిన జూ.ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సింహాద్రి (స్పెష‌ల్ సాంగ్‌), నా అల్లుడు సినిమాలు చేసింది. అలా నంద‌మూరి కుటుంబానికి మూడు త‌రాల న‌టుల‌తో సంద‌డి చేసిన ర‌మ్య‌.. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వ‌ర‌రావుతో సూత్ర‌ధారులు, ఇద్ద‌రూ ఇద్ద‌రే సినిమాలు చేస్తే.. రెండోత‌రంకి చెందిన నాగార్జున‌తో సంకీర్త‌న‌, ఇద్ద‌రూ ఇద్ద‌రే, హ‌లో బ్ర‌ద‌ర్‌, అల్ల‌రి అల్లుడు (ప్ర‌త్యేక గీతం), ఘ‌రానా బుల్లోడు, అన్న‌మయ్య‌, చంద్ర‌లేఖ‌, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు చేసింది. ఇక మూడో త‌రంలో అఖిల్‌తో తాజాగా హ‌లో చేసింది. ఇందులో అమ్మ‌గా న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌కి మంచి పేరు వ‌చ్చింది. మొత్తానికి అటు నంద‌మూరి, ఇటు అక్కినేని క‌థానాయ‌కుల‌తో ర‌మ్య‌కృష్ణ క‌లిసి న‌టించి.. ఏ క‌థానాయిక‌కి ద‌క్క‌ని అరుదైన అవ‌కాశం సొంతం చేసుకున్న‌ట్ల‌య్యింది