MP Magunta: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Sreenivasulu Reddy) ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని.. తమ కుటుంబం గత 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నామని తెలిపారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలకు పోటీ చేశామన్నారు. తమకు రాజకీయ జీవితం ఇచ్చింది ఒంగోలు అని.. తమకు దేశవ్యాప్తంగా నివాసాలు ఎక్కడ ఉన్నా తమ జీవితం మాత్రం ఒంగోలులోనే అని మాగుంట వెల్లడించారు.
మాగుంట కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందన్నారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేస్తున్నామని.. ఇంతకాలం తమకు అండగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.
కాగా ఒంగోలు ఎంపీగా మాగుంటను బరిలో నిలిపేందుకు సీఎం జగన్ నిరాకరించారు. ఆయన స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మరో రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాగుంట.. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఒంగోలు ఎంపీగా గెలిచారు.
ఇదిలా ఉంటే మాగుంటతో కలిపి ఇప్పటివరకు ఆరుగురు సిట్టింగ్ ఎంపీలు వైసీపీని వీడారు. ఇందులో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరిలో బాలశౌరి జనసేనలో చేరగా.. శ్రీకృష్ణదేవరాయలు, రఘురామ, మాగుంట, వేమిరెడ్డి టీడీపీలో చేరనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments