మళ్లీ సంగీత దర్శకుడుతోనే..

  • IndiaGlitz, [Saturday,September 23 2017]

18 ఏళ్ల క్రితం విడుద‌లై మ్యూజిక‌ల్ హిట్ అయిన‌ శీను (వెంక‌టేష్ హీరో) చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు శ‌శి. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన సొల్లామ‌లే (దీనికీ శ‌శినే ద‌ర్శ‌కుడు) చిత్రానికి రీమేక్‌గా శీను రూపొందింది. శీను త‌రువాత తెలుగు సినిమాల‌కి దూర‌మైన శ‌శి.. గ‌తేడాది బిచ్చ‌గాడుతో మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాడు.

సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ త‌మిళ అనువాద చిత్రం త‌రువాత.. చిన్న గ్యాప్ తీసుకున్న శ‌శి ప్ర‌స్తుతం కొత్త చిత్రం స్క్రిప్ట్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు. సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆంటోని హీరోగా త‌న గ‌త చిత్రం బిచ్చ‌గాడుని తీసిన శ‌శి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా సంగీత ద‌ర్శ‌కుడుతోనే చేయనుండ‌డం విశేషం. ఇంత‌కీ ఆ సంగీత ద‌ర్శ‌కుడెవ‌రంటే.. డార్లింగ్ చిత్రంతో తెలుగువారికి సుప‌రిచితుడైన జి.వి.ప్ర‌కాష్‌. ఎ.ఆర్‌.రెహ‌మాన్ మేన‌ల్లుడైన ప్ర‌కాష్‌.. సంగీత ద‌ర్శ‌క‌త్వం చేయ‌డంతో పాటు త‌మిళంలో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు.

కాగా, శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో జి.వి.ప్ర‌కాష్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ కూడా మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. రెట్టై కొంబు (రెండు కొమ్ములు అని అర్థం) అనే పేరుతో అక్టోబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుందీ చిత్రం. బిచ్చ‌గాడుకి ఆ చిత్రంలో హీరోగా న‌టించిన‌ విజ‌య్ ఆంటోనినే సంగీత‌మందిస్తే.. రెట్టై కొంబుకి కూడా హీరోగా న‌టిస్తున్న జి.వి.ప్ర‌కాష్‌నే సంగీత‌మందించ‌నుండ‌డం విశేషం.