KCR: మరోసారి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న గులాబీ బాస్.. అక్కడి నుంచే ప్రచారం షురూ
- IndiaGlitz, [Wednesday,October 11 2023]
గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్లు ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఆయన ఏ పని చేయాలన్నా ముహుర్త బలాన్ని నమ్ముతుంటారు. అలాగే వాస్తు శాస్త్రం కూడా ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఇప్పుడు ఎన్నికల సమరంలో కూడా సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారు. గత రెండు పర్యాయాలు ఎక్కడ నుంచే అయితే ఎన్నికల శంఖారావం మోగించారో ఇప్పుడు కూడా అక్కడి నుంచే ఎన్నికత యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల పోరుకు రెడీ అవుతున్నారు.
మూడోసారి కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం..
అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో జరగనున్న బహిరం సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. అక్కడి నుంచే ఎందుకంటే 2014, 2018 ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్ నుంచే మొదలుపెట్టారు. ఆ రెండు ఎన్నికల్లో కేసీఆర్ విజయం దుందుభి మోగించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్.. తనకు అచ్చొచ్చిన ప్రాంతం నుంచే ప్రచార బరిలో దిగనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా రూపొందించింది. అదే సభలో పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
17 రోజల పాటు 41 నియోజకవర్గాల్లో..
అక్టోబర్ 15న ప్రారంభం కానున్న కేసీఆర్ ప్రచారం 17 రోజల పాటు 41 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభల్లో ప్రసంగించేలా కార్యాచరణ రెడీ చేశారు. అలాగే నవంబర్ 9న ఆయన పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు గానూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్లు కూడా వేయనున్నారు. ముందుగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత గజ్వేల్‌లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు.
కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్..
అక్టోబర్ 15 - హుస్నాబాద్
అక్టోబర్ 16 - జనగాం, భువనగిరి
అక్టోబర్ 17 - సిరిసిల్ల, సిద్దిపేట
అక్టోబర్ 18 - జడ్చర్ల, మేడ్చల్
అక్టోబర్ 26 - అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు
అక్టోబర్ 27 - పాలేరు, స్టేషన్ ఘన్పూర్
అక్టోబర్ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్ 30 - జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్
అక్టోబర్ 31 - హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్ 01 - సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్ 02 - నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
నవంబర్ 03 - భైంసా, ఆర్మూర్, కోరుట్ల
నవంబర్ 05 - కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్ 06 - గద్వాల్, మఖ్తల్, నారాయణపేట
నవంబర్ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్ 08 - సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
నవంబర్ 09- కామారెడ్డి