Corona:దేశంలో మరోసారి కరోనా కలకలం.. కేంద్రం కీలక ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి చేసిన ప్రాణవిలయం తలుచుకుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. మూడేన్నరేళ్ల క్రితం బయటపడ్డ ఈ వైరస్ ఎన్నో లక్షల మందిని బలి తీసుకుంది. మన దేశంలో కూడా ఈ మహమ్మరి బారినపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించారు. ఇప్పుడిప్పుడే ఆ రాకాసి వైరస్ నుంచి జనం కోలుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. కానీ తాజా పరిణామాలు మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మళ్లీ దేశంలో భారీగా కరోనా కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది.
శనివారం ఒక్కరోజే 148 కొత్త కేసులు నమోదుకాగా.. గత 24 గంటల్లో 166 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం కేరళ రాష్ట్రంలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం చలికాలం కావడంతో ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రజలంతా తగు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచిస్తోంది. మరోవైపు సిమ్లాలోని ఓ ఆసుపత్రిలో మహిళ కరోనా కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. చలికాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
ఇక భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 4.44 కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. అందులో 5,33,306 మంది వైరస్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం పంపిణీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments