ఒత్తిడి లేకపోతే పనులు పూర్తికావు - ఓంకార్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, సమంత, శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బేనర్స్‌పై ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజుగారి గది-2'. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఓంకార్ ఇంటర్వ్యూ...
నాగార్జునను దృష్టిలో పెట్టుకునే కథను తయారు చేసుకున్నారా?
- లేదండీ..కథ తయారు చేసుకునేటప్పుడు నాగార్జునగారిని దృష్టిలో పెట్టుకోలేదు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలయికలో గతంలో క్షణం, ఘాజీ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సంస్థలు ఇప్పుడు చేయబోయేది హ్యాట్రిక్ మూవీ హిట్ కావాలని కథ రెడీ చేశాను. ఈ సంస్థలతో పాటు మా ఓక్ సంస్థ చేసే సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాను. అంతా సిద్ధమైన తర్వాత నిరంజన్‌రెడ్డిగారు ఈ కథను నాగార్జునగారు చేస్తే బావుంటుందని అన్నారు. నాగార్జునగారు చేస్తే రేంజ్ మారిపోతుందని తెలుసు. సరేనని నాగార్జునగారి అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లి ఆయన్ను కలిశాం. ఆయన ఐదు నిమిషాల కథ వినగానే సినిమా చేస్తానని చెప్పేశారు.
నాగార్జున పాత్ర ఎలా ఉండబోతోంది?
-మెంటిలిజం అనేది సైన్స్. నాగార్జునగారు సినిమాలో రుద్ర అనే మెంటలిస్ట్ క్యారెక్టర్‌లో కనపడతారు. ఇలాంటి ఓ క్యారెక్టర్‌ని బి, సి సెంటర్ ఆడియెన్స్‌కు కూడా కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే, నాగార్జునగారికి భవిష్యత్‌లో కూడా జరగబోయే విషయాలు కూడా తెలుస్తాయనేలా క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం.
అసలు ఈ సినిమా ఎలా ప్రారంభమైంది?
- 'రాజుగారి గది' సినిమా సక్సెస్ అయిన తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను. త్వర త్వరగా ఏదో సినిమా చేసేయాలని కాకుండా..కాస్త సమయం తీసుకుని రెండు కథలను తయారు చేసుకున్నాను. అందులో ఒకటి ఫ్యామిలీ సబ్జెక్ట్ కాగా, మరొకటి 'రాజుగారి గది 2'. కొత్తగా వేరే సినిమా చేస్తే బావుంటుంది..వెంటనే హారర్ మూవీ చేస్తే నీపై ముద్ర పడిపోతుందని స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్పారు. అదే సమయంలో వెంకటేష్‌గారికి 'రాజుగారి గది 2' సబ్జెక్ట్ చెప్పాను. అయితే కాన్సెప్ట్ ఇప్పుడు రాబోయే సినిమాది కాదు. ఆయనతో కొన్ని రోజుల పాటు ట్రావెల్ చేశాను. ఆయన అప్పటికే 'గురు' సినిమా కమిట్ అయ్యారు. కాబట్టి కొంత సమయం పడుతుందని చెప్పారు. సరేనని నేను పివిపిగారిని కలిశాను. పివిపిగారు నార్మల్ సబ్జెక్ట్‌తో ఎప్పుడైనా సినిమా చేసుకోవచ్చు, ముందుగా 'రాజుగారి గది 2' సినిమా చేద్దామని అన్నారు.
వెంకటేష్‌గారికి 'రాజుగారిగది 2' కథ చెప్పానని పివిపిగారికి చెప్పాను. ఆప్పుడాయన ఆ సబ్జెక్ట్‌తో కాకుండా మరో సబ్జెక్ట్‌తో చేద్దామని ఆయన చెప్పారు. నేను వెంకటేష్‌గారికి కాల్ చేసి అసలు విషయం చెప్పాను. ఆయన పర్లేదు నువ్వు సినిమా చెసేయ్ మనం రాజుగారి గది 3 లేదా 4 చేద్దామని అన్నారు. సరేనని నేను సబ్జెక్ట్ తయారు చేయాలనుకుంటున్న తరుణంలో పివిపిగారు నాకు 'ప్రేతమ్' ట్రైలర్‌ను పంపి, ఈ కాన్సెప్ట్ నచ్చితే...ఈ సబ్జెక్ట్‌తో సినిమా చేద్దామని అన్నారు. చూసిన తర్వాత `కథ సోల్ బావుంది కానీ..మీ బేనర్‌స్థాయికి, రాజుగారి గది ఫేజ్‌కు ప్రేతమ్‌ను రీమేక్ చేస్తే బాగోదు. సోల్‌ను మాత్రమే తీసుకుని కథను మొత్తం మార్చేసి కొత్త కథతో సినిమా చేస్తాను, మీకు ఇష్టమైతే రైట్స్ తీసుకోండి సార్' అని నేను పివిపిగారితో అన్నాను.
సమంత పాత్ర గురించి చెప్పండి?
- మలయాళం సినిమాలో ఆత్మ పాత్ర పెద్దగా ఉండదు. ఆ పాత్రలకు మలయాళంలో డైలాగ్స్ కూడా ఉండవు. కానీ తెలుగులో అలా ఉండకూడదు. నాగార్జునగారికి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. హారర్ కామెడీతోపాటు కాస్తా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడిస్తే, బావుంటుందనిపించి చేశాం. అలాగే ముందు ఆత్మ పాత్రను సమంతతో చేయించాలని అనుకోలేదు. సమంతగారితో చేయిద్దామని నిరంజన్‌గారే అన్నారు. 'రాజుగారిగది 2' ..ఆత్మ క్యారెక్టర్‌లో సమంతగారు అద్భుతంగా నటించారు. ఈ సినిమా సమంతగారి కెరీర్‌లో టాప్‌మోస్ట్ పెర్ఫామెన్స్ మూవీ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మామ కోడలు వారి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటారు. అలాగే నాగార్జునగారు, సమంతగారు కలిసి ఓ హారర్ సినిమా చేయడమిదే తొలిసారి. కథ రాసుకున్న తర్వాత ముందు నాగార్జునగారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఓ నెల తర్వాత సమంతగారు వచ్చారు. సమంతగారికి నాగార్జునగారు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలుసు. కానీ, నాగార్జునగారికి సమంత ఆత్మ పాత్రలో చేయబోతుందని ముందుగా తెలియదు.
నాగార్జునగారు ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యారా?
- లేదండి..ఆయన కోచ్‌లా మా యూనిట్‌కు సలహాలినిచ్చారే తప్ప ఇన్‌వాల్వ్ కాలేదు. నా కథ విని నచ్చడంతో నాగార్జునగారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అది ముందు నాకు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్. కథ రెడీ చేసే వరకే నాగార్జునగారు ఇలా చేద్దాం..అలా చేద్దామని అంటారు. కథ రెడీ అయిన తర్వాత డైరెక్టర్ ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్లిపోతారు. షూటింగ్ ప్రారంభమైయ్యాక నేను కొత్త డైరెక్టర్‌నైనా.. ఎక్కడా ఇన్‌వాల్వ్ కాలేదు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్నిసార్లు అడిగినా, నీకేం తెలుసు అనే దోరణిని ప్రదర్శించకుండా సపోర్ట్ చేశారు.
నాగార్జున..ఓ ఇంటర్వ్యూలో సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన సినిమా అక్టోబర్‌లో విడుదలవుతుందని అన్నారే?
- నాగార్జునలాంటి సీనియర్ పర్సన్‌కు తెలుసు. ప్రెషర్ పెడితేనే త్వరగా పని పూర్తవుతుందని, అందుకే అయన ప్రెషర్ పెట్టారు. పెళ్లి చేయాలంటే ఎన్ని ఆటుపోట్లు ఉంటాయో..సినిమా చేయాలంటే అంతకన్నా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడా ఆలస్యం కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి మన చేతిలో ఉండవు. కాబట్టి మనం ప్రొడక్ట్‌ని వీలైనంత త్వరగా ఇచ్చేస్తే మనకు అన్నీ అనుకున్న టైంలో జరిగిపోతాయి. ఈ సినిమా విషయంలో మేం అన్నీ అనుకున్న టైంలోనే పూర్తి చేశాం. సినిమాను ఇన్‌టైమ్‌లో సినిమాను పూర్తి చేయాలని యూనిట్ అందరికీ చెప్పారు. ఒక యాంకర్ స్థాయి నుండి ఈస్థాయికి వచ్చానంటే అందుకు కారణం నా టైమ్‌సెన్స్, హార్డ్‌వర్క్, సహనం. పెద్దవాళ్లు ఏం చెప్పినా మనకు ఆశీర్వాదంగానే భావించాలి. ఇక వర్క్‌లో ఒత్తిడి లేకుండా ఏదీ కాదు. నేను టీవీ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు స్క్రిప్ట్ వర్క్, యాంకరింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ ఇలా అన్నీ వ్యవహారాలు చూసుకున్నాను. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ప్రెషర్ హ్యాండిల్ కొత్తగా అనిపించలేదు. అందుకే అందరి సలహాలు తీసుకున్నాను. ఎక్కడైనా నెగటివ్‌గా ఆలోచిస్తే, ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్‌పై పడుతుంది. నాగార్జునగారు ఏం చెప్పినా నా మంచికే అనుకున్నాను. ఎందుకంటే డైరెక్టర్‌గా ఇది నాకు మూడో సినిమా అయితే, ఆయనకు 30 ఏళ్ల అనుభవముంది.
'రాజుగారిగది'లో మెసేజ్ ఇచ్చారు కదా..ఇందులో కూడా మెసేజ్ ఇస్తున్నారా?
- రాజుగారిగది చిత్రంలోలాగానే 'రాజుగారిగది 2'లో కూడా మెసేజ్ ఉంటుంది. మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించాలనే మెసేజ్ ఉంది. తప్పకుండా ఆ మెసేజ్ అదరికీ నచ్చుతుంది.
'రాజుగారి గది' సిరీస్ కంటిన్యూ అవుతుందా?
- బాలీవుడ్‌లో ధూమ్ సినిమా సిరీస్ ఎలా సక్సెస్‌గా వస్తుందో..అలా రాజుగారి గది సిరీస్ రాజుగారిగది 2తో ఆగకుండా సక్సెస్‌ను బేస్ చేసుకుని రాజుగారిగది 3, 4.. సినిమాలు వస్తాయి.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
- రాజుగారి గది 3 చేస్తానా? లేదా కొత్త సబ్జెక్ట్‌తో సినిమా చేస్తానా? అని ఇంకా అనుకోలేదు. వెంకటేష్‌గారు..సినిమా చేద్దామంటే చేస్తాను. లేదా నన్ను ఇంకెవరైనా అప్రోచ్ అయితే వారితో అయినా సినిమా చేస్తాను. ఈ సక్సెస్‌ను తదుపరి నిర్ణయం ఉంటుంది. దాదాపు పివిపిగారి బ్యానర్‌లో నెక్స్‌ట్ మూవీ ఉంటుందని అనుకుంటున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments