Tollywood: నేనొచ్చేశా, బీ రెడీ అంటోన్న కరోనా.. టాలీవుడ్లో మొదలైన టెన్షన్?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కోవిడ్ సమయంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది చిత్ర పరిశ్రమ. లాక్డౌన్, ఇతర ఆంక్షల కారణంగా ఎక్కడికక్కడ షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనాకు బలయ్యారు. మధ్యలో నిబంధనలు ఎత్తివేసినప్పటికీ థియేటర్లలో ఆక్యూపెన్సీ విషయంలో మాత్రం ప్రభుత్వాలు ససేమిరా అన్నాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన లాక్డౌన్ , వ్యాక్సినేషన్ అమలు చేసి కరోనాను అదుపులోకి తెచ్చింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పట్టి.. జనం థియేటర్లలోకి అడుగుపెడుతున్నారు.
చైనాలో పరిస్ధితితో కేంద్రం అలర్ట్ :
ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ గుబులు రేపుతోంది. జీరో కోవిడ్ పాలసీకి సంబంధించిన నిబంధనలు ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అక్కడ ఈ స్థాయిలో కేసుల విస్పోటనానికి ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంటే కారణం. ప్రస్తుతం ఈ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని వెల్లడించింది. అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది.
సంక్రాంతి క్యూలో బడా సినిమాలు :
అంతా బాగానే వుంది కానీ.. కేంద్రం నిర్ణయాలు , ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ ఇప్పుడు సినీ పరిశ్రమను కలవరపాటుకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించడం ఎక్కడికి దారి తీస్తుందోనని సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా టాలీవుడ్ ఈ విషయంలో కంగారు పడుతోంది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్ సినీ పరిశ్రమకు అతి ముఖ్యమైనది దీనిని టార్గెట్ చేసుకునే మేకర్స్ సినిమాలను తెరకెక్కిస్తారు. ఎన్ని సినిమాలు రిలీజైనా ఆ సమయంలో ఆదరిస్తారు ప్రేక్షకులు. ఈసారి కూడా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం వంటి సినిమాలు క్యూలో వున్నాయి. వీటికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థియేటర్ల అగ్రిమెంట్స్, అడ్వాన్సులు వంటి కార్యక్రమాలు ఇప్పటికే ఊపందుకున్నాయి.
వచ్చే పదిరోజులు అత్యంత కీలకం:
ఇలాంటి సమయంలో ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ భయపెడుతోంది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే వున్నప్పటికీ.. పండుగల సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుండే అవకాశం వుండటం, సెకండ్ వేవ్ సమయంలో దేశంలో చోటు చేసుకున్న పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని కేంద్రం ముందే అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయలు అత్యున్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ఇవాళ కరోనా డ్రై రన్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. వచ్చే వారం పది రోజుల్లోని పరిస్ధితులను బట్టి కేంద్రం నిర్ణయం ఆధారపడే అవకాశం వుంది. ఏది ఏమైనా ఈ మహమ్మారి మన దేశంపై విరుచుకుపడకుండా వుంటే అదే పది వేలని సినీ పరిశ్రమ దేవుడికి దండం పెట్టుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments