పాక్‌లో బయటపడిన పురాతన హిందూ దేవాలయం.. ప్రత్యేకతలివే..

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

పాకిస్థాన్‌లో కొన్ని వందల ఏళ్లనాటి అతి పురాతన హిందూ దేవాలయం ఒకటి తవ్వకాల్లో బయల్పడింది. వాయువ్య పాకిస్థాన్‌లోని స్వాత్‌ జిల్లాలోని బారీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద పాక్‌, ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లోనే అతి పురాతన హిందూ దేవాలయం బయటపడింది. దీనిని 1300 ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖకు చెందిన ఫజల్‌ ఖలీక్‌ చెప్పారు.

ఈ దేవాలయం విష్ణుమూర్తికి చెందినదని.. దాదాపు 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించి ఉంటారని ఫజల్‌ ఖలీక్‌ చెప్పారు. ఆలయ సమీపంలో కొలను, వాచ్‌టవర్‌, కంటోన్మెంట్‌ ఆనవాళ్లను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రీస్తుశకం 850 -1026 మధ్యలో హిందూ షాహీస్‌ వంశస్తులు కాబూల్‌ లోయ, గాంధారా ప్రాంతాలను పాలించారు వీరే ఆ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. తూర్పు అఫ్ఘనిస్థాన్‌, గాంధార, వాయువ్య భారతదేశాన్ని కాబుల్‌ లోయగా వారి పాలనా కాలంలో పిలిచేవారు.

భగవంతుడి దర్శనానికి ముందు భక్తులు ఈ కోనేరులో స్నానమాచరించేవారని తెలుస్తోంది. తాజాగా బయల్పడిన ఆలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. నిజానికి స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కింద‌టి పురావ‌స్తు ప్ర‌దేశాలు అనేకం ఉన్నాయి. అయితే హిందూ షాహీల నాటి జాడలు కనిపించడం మాత్రం ఇదే ప్రథమం. మరో విశేషమేంటంటే.. గాంధార నాగరికతకు చెందిన ఆలయం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని ఇటలీ పురావస్తు శాఖ అధినేత డాక్టర్‌ లుకా గాంధా వెల్లడించారు.