Okka Kshanam Review
ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ చిత్రాలకే తెలుగు ప్రేక్షకులు ఓటు వేసి సక్సెస్ చేస్తున్నారు. అందుకే యువ కథానాయకులంతా కొత్త కథా చిత్రాల్లో నటించడానికే ఆసక్తిని చూపుతున్నారు. అలాంటి ప్రయత్నమే చేశాడు హీరో అల్లు శిరీష్. ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో సినిమా చేసి సక్సెస్ సాధించిన దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వంలో `ఒక్క క్షణం` అనే థ్రిల్లర్ సినిమా చేశాడు. సమాంతర జీవితాలు అనే థియరీని ఆధారంగా చేసుకుని రూపొందిన `ఒక్క క్షణం` చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి ఓ లుక్కేద్దాం...
కథ:
శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే అనుకోని ఓ ఘటన వల్ల వారి కాపురంలో కలతలు రేగుతాయి. స్వాతి చనిపోతుంది. ఆమె చనిపోవడం వల్ల శ్రీనివాస్ జైలు పాలవుతాడు. వాళ్ల జీవితాన్ని ఎదురింట్లో ఉండి గమనిస్తూ ఉంటుంది జ్యోత్స్న (సురభి). ఆమెతో ప్రేమలో పడతాడు జీవా (అల్లు శిరీష్). జీవా కుటుంబం కూడా జ్యోత్స్నను ఇష్టపడుతుంది. అయితే జ్యోత్స్నకు, స్వాతికి ఓ కామన్ పాయింట్ ఉంటుంది. వారిద్దరి జీవితాలు ప్యారలల్‌గా ఉంటాయనే విషయం తెలుస్తుంది. అప్పటివరకు బిందాస్‌గా ఉన్న జ్యోత్స్నకు తెలియని ఆందోళన మొదలవుతుంది. స్వాతి చనిపోయినట్టే తను కూడా కన్నుమూయాల్సి వస్తుందేమోననే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్‌తో ఆమె ఏం చేసింది? ఆమెను కాపాడుకోవడానికి జీవా చేసిన పనులేంటి? ఇంతకీ విధి బలీయమైనదా? సంకల్పం గొప్పదా? అనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమా `ఒక్క క్షణం`. అసలు `ఒక్క క్షణం` అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారన్నది కూడా ఆసక్తికరమే.
ప్లస్ పాయింట్స్:
ఇప్పటిదాకా తెలుగు స్క్రీన్ మీద రాని కథ ఇది. ఇరువురి ఆలోచనలు ఒకే రకంగా ఉండే సినిమాలను చూశాం కానీ, అంతకు మించి ఒకేరకమైన జీవితాలను గురించి చెప్పే కథలను మనం చూడలేదు. ప్యారలల్ లైఫ్‌కి సంబంధించి చూపించిన ఉదాహరణలు బావున్నాయి. ప్యారలల్ లైఫ్ కి మించి, సంకల్పం గొప్పదని చెప్పడం బావుంది. అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సురభి, శీరత్ గ్లామర్ దుస్తుల్లో నటించడానికి అసలు ఎక్కడా వెనకాడలేదు. ప్రవీణ్ బావ పాత్రలో కొత్తగా కనిపించారు. దాసరి అరుణ్ కాసేపే కనిపించినా, అతని పాత్రకు న్యాయం చేశాడు. బాలీవుడ్ విలన్లతో పోలిస్తే అరుణ్‌కుమార్ విలన్‌గా చక్కగా పనికొస్తాడు. కెమెరా పనితనం, లొకేషన్లు, బ్యాక్‌గ్రౌండ్, ఆర్ట్ డైరక్షన్ బావున్నాయి.
మైనస్ పాయింట్స్:
ప్యారలల్ పాయింట్ అనే పదం తప్పితే, సినిమాలో నిజంగా ఎగ్జయిట్ చేసిన అంశాలు ఏమీ లేవు. ఒకరి జీవితంలో జరిగిన విషయాలను మరొకరి జీవితంలో జరిగినట్టు చూపించడం వల్ల సీన్స్ రిపీటెడ్‌గా చూడాల్సి వస్తుంది. దాంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు అవుతుంది. ఇంటర్వెల్ ఇంకా ఎందుకు రావట్లేదా? అని ప్రేక్షకుడు సీటులో అసహనంగా కదలడాన్ని గమనించవచ్చు. సెకండాఫ్‌లోనూ ఆసక్తికరమైన అంశాలు లేవు. ప్రీ క్లైమాక్స్ లో స్వాతి చావుకు కారణాలు చూపించే సమయంలో మాత్రం కాసింత ఆసక్తిగా అనిపిస్తుంది. పాటల్లోనూ, రీరికార్డింగ్‌లోనూ కనిపించే ఎమోషన్ సన్నివేశాల్లో కనిపించదు.
సమీక్ష:
కాన్సెప్ట్ సినిమాలు హిట్ అవుతున్న రోజులివి. సూర్యుడికి భయపడే వ్యక్తి, బలహీనమైన క్షణంలో మనిషిలోని ప్రవేశించే ఆత్మ.. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదే నమ్మకంతో వి.ఐ.ఆనంద్ ప్యారలల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా `ఒక్క క్షణం`. ఒకే రకమైన రెండు జీవితాలు.. వాటిలో ఒకటి కళ్ల ముందు జరగడం, మరొకటి దాన్ని ఫాలో అవుతుండటం ఇక్కడ ప్రత్యేకత. జరగబోయే విషయం ముందే తెలుసుకున్న ఓ జంట పడే మానసిక ఆవేదన. కొన్ని సన్నివేశాలను ఆసక్తికరంగా మలచారు దర్శకుడు. అయితే ఎటొచ్చీ సన్నివేశాలు రిపీట్ కావడం, కొన్ని చోట్ల మరీ పేలవంగా ఉండటం, ప్రవీణ్‌లాంటి ఆర్టిస్టు పక్కనున్నా, కామెడీ పంచ్‌లు కరవవడం వల్ల కాస్త బోర్‌గా అనిపించింది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా జోరందుకుంది. హాస్పిటల్ ఓనర్‌గా దాసరి అరుణ్ ప్రవేశించినప్పటి నుంచి సినిమా రసకందాయంలో పడింది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కాస్త స్పీడందుకున్నాయి. సంకల్పం గొప్పదని చెప్పే డైలాగు బావుంది. నమ్మకమే మనిషిని నడిపించాలనే పాజిటివ్ పాయింట్‌ను ఆనంద్ చక్కగా డీల్ చేశారు.
బాటమ్‌లైన్: కొత్తదనం కోరే వారికి 'ఒక్క క్షణం'
Okka Kshanam Movie Review in English
- Read in English