వాస్తవ సంఘటనలకు తెర రూపమే ఒక మనసు - డైరెక్టర్ రామరాజు
Send us your feedback to audioarticles@vaarta.com
మల్లెల తీరం దర్శకుడు రామరాజు తెరకెక్కించిన తాజా చిత్రం ఒక మనసు. ఈ చిత్రంలో నాగ శౌర్య, నిహారిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఒక మనసు చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మనసు దర్శకుడు రామరాజు తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఒక మనసు స్వచ్ఛమైన ప్రేమకథ అంటున్నారు...ఈ కథను ఎంచుకోవడానికి కారణం ఏమిటి..?
స్వచ్ఛమైన ప్రేమకథను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే...ఈ కథ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. అలాగే ఈ కథ అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో చేసాను. నేను చిన్నప్పటి నుంచి ప్రేమకథా చిత్రాలు చూసి పెరిగాను. ఎన్ని చిత్రాలు వచ్చినా ఎప్పటికీ గుర్తుండే చిత్రాలు అంటే ప్రేమకథా చిత్రాలే. ఒకప్పుడు మనిషిని డబ్బు ప్రభావితం చేసేది కానీ...ఇప్పుడు రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవంగా జరుగుతున్నదాన్నే హ్యుమన్ డ్రామాగా ఈ చిత్రంలో చూపించాను.
ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫస్ట్ నిహారికనే అనుకున్నారా..లేక వేరే హీరోయిన్స్ ని కూడా కాంటాక్ట్ చేసారా..?
కథ రెడీ చేసిన తర్వాత కమర్షియల్ మూవీ స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాను. ఈ క్యారెక్టర్ కి సమంత అయితే బాగుంటుంది అనుకుని సమంతకి కథ చెప్పడం...ఆమెకు కథ నచ్చడం కూడా జరిగింది. కానీ..డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. ఆతర్వాత రెజీనాకు కథ చెప్పాను. రెజీనా కూడా అంతే.. కథ నచ్చింది కానీ డేట్స్ ఖాళీ లేవు. దీంతో కొత్తవాళ్లతో చేద్దాం అనుకున్నాను. సరిగ్గా ఆ టైమ్ లోనే మధురా శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ చేసి నిహారిక అయితే మీ కథకు సరిపోతుందా అని అడిగారు. అప్పుడు నేను గూగుల్ లో నిహారిక ఫోటోలు చూస్తే తనలో నా సినిమాలోని సంధ్య క్యారెక్టర్ కనిపించడంతో ఓకే చేసాం.
మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నిహారికను డైరెక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఏమనిపించింది..?
నిహారిక మా సినిమాకి హీరోయిన్ గా కన్ ఫర్మ్ అయ్యింది అని తెలిసినప్పుడు భయం వేసింది. మెగా హీరోయిన్ కదా అబ్జెక్షన్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ..సంధ్య క్యారెక్టర్ కి నిహారిక కరెక్ట్ అనిపించి ధైర్యం చేసాను. ఈ కథ నిహారికకు చాలా బాగా నచ్చింది. ఎంతగా నచ్చింది అంటే...సెట్ లో నిహా అంటే పలికేది కాదు సంధ్య అని పిలిస్తేనే పలికేది.
మల్లెల తీరం తర్వాత గ్యాప్ రావడానికి కారణం ఏమిటి..?
మల్లెల తీరం సినిమా తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకున్నాను. ఆ టైమ్ లో ఇక సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. సినిమా అంటే కళ అనుకునేవాడిని కానీ సినిమా వ్యాపారం అయిపోయింది. ఈ విషయాన్ని అర్ధం చేసుకుని సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. రెగ్యులర్ సినిమాలు చేయడానికి నేను అవసరం లేదు చాలా మంది ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమకథకు చాలా గ్యాప్ వచ్చింది. నిజాయితీగా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈ సినిమా తీసాను.
మీ దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే ఏమిటి..?
కమర్షియల్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో సినిమా చేయడం కాదు. చిన్న బడ్జెట్ తో తీసినా ఆ సినిమాకు డబ్బులు వస్తే అదే అసలైన కమర్షియల్ సినిమా.
తదుపరి చిత్రం ఎవరితో..?
ఇదే నిర్మాణ సంస్థలో నా తదుపరి చిత్రం ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments