మా అందరి కన్నా ఎక్కువ కష్టపడి నిహారిక మంచి పేరు తెచ్చుకుంటుంది అని నా గట్టి నమ్మకం - రామ్ చరణ్
- IndiaGlitz, [Thursday,May 19 2016]
మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నకొణిదల నిహారిక నటించిన తొలి చిత్రం ఒక మనసు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంటగా నటించారు. రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి టీవీ 9 తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ కశ్యప్ ఈ మూవీకి సంగీతం అందించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో ఒక మనసు ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఒక మనసు బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీను నాగబాబుకు అందచేసారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...మధుర శ్రీధర్ మంచి సినిమాలు తీస్తారని తెలుసు. టీవి 9 బ్రేకింగ్ న్యూస్ లో ముందు ఉంటుందని తెలుసు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ గురించి తెలుసు. కానీ..మనకు తెలియంది నిహారిక గురించి. నెంబర్ 1 యాంకర్ గా ప్రూవ్ చేసుకుని ఇప్పుడు హీరోయిన్ గా మన ముందుకు వచ్చింది. ఆల్ ద బెస్ట్ టు నిహారిక. ఈ చిత్ర దర్శకుడు రామరాజు మల్లెల తీరం అనే మంచి సినిమా తీసాడు. ఈ ఒక మనసు కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
గీత రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ...ఒక మనసు అనే సినిమా నిర్మిస్తున్నాను రామరాజు డైరెక్టర్ అని మధుర శ్రీధర్ చెప్పగానే... ఎగిరిగంతేసి నేను రాస్తానని అన్నాను. రామరాజు కథ చెబుతూ లీనమై పోయారు. కథ మొత్తం పూస గుచ్చినట్టు చెప్పారు. ఖచ్చితంగా ఈ కథ అందరికీ నచ్చుతుంది. నేను ఏ పాట రాసినా నాలుగు వెర్షెన్స్ రాస్తాను. కానీ...ఈ సినిమాకి ఒకే ఒక వెర్షన్ రాసాను. అది శ్రీధర్ గార్కి , రామరాజు గార్కి నచ్చడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలోని 9 పాటలు అందరికీ నచ్చుతాయి. ఇది సూపర్ హిట్ ఆల్బమ్. నాగశౌర్య నిహారిక చూడముచ్చటగా ఉన్నారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో మీనా ఎలాగైతే మనల్ని ఆకట్టుకుందో... నిహారిక కూడా ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకుంటుంది. ఒక మనసు ఆడియో, సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ బి.గోపాల్ మాట్లాడుతూ...ఒక మనసు చాలా అందమైన టైటిల్. ఒక రోజు టీ.వీ లో ఒక షో చూస్తున్నాను ఒక అమ్మాయి చాలా బాగా చేస్తుంది. చాలా బాగుంది.. ఎవరు ఈ అమ్మాయి అని నా పక్కన ఉన్న వాళ్లను అడిగితే నాగబాబు గారి అమ్మాయి అని చెప్పారు. అలాగే నాగబాబు గారి షోకి నిహారిక గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో నాగబాబు గారు ఎలా నటిస్తారో చేసి చూపించింది. మంచితనానికి మారు పేరు నాగబాబు. అబ్బాయి వరుణ్ తేజ్ హీరో అయ్యాడు. నిహారిక పెద్ద హీరోయిన్ అయి మంచిపేరు తెచ్చుకుంటుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మెగా బ్రదర్స్ ముద్దుల కూతురు నిహారిక. నాకు చిన్పప్పటి నుంచి బాగా తెలుసు. ఈ ముగ్గురులో ఉన్న బెస్ట్ క్వాలిటీ స్ నిహారికలో ఉన్నాయి. ఒక మనసు సినిమాతో నిహారిక సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘరామ్ కృష్ణంరాజు మాట్లాడుతూ...ఆరోజుల్లో...సావిత్రి వాణిశ్రీ, జమున గార్లను చూస్తే పాజిటివ్ ఫీలింగ్ కలిగేది. నిహారికను చూస్తుంటే కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...నిహారిక అండ్ ఒక మనసు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చెబుతాను బ్రదర్..మీరు ప్రతిసారి పవర్ స్టార్...పవర్ స్టార్ అని అరిచినప్పుడు నేను మాట్లాడుకుండా వెళ్లిపోతున్నాను. దానికి కారణం.. కొంత మంది పవర్ స్టార్ అభిమానులు. మళ్లీ చెబుతున్నాను కొంత మంది పవర్ స్టార్ అభిమానులు. పబ్లిక్ ఫంక్షన్ లో కొంత మంది గ్రూప్ గా ఫామ్ అయి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. దాని వలన ఫంక్షన్ కి ఇబ్బంది కలుగుతుంది. ఫంక్షన్ కి వచ్చేవాళ్లు పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలి అనుకుంటారు. అలాంటి సమయంలో మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ ని అరుస్తుంటే...వాళ్లు ఏం చెప్పాలనుకున్నారో అది మరచిపోయి ఏదో చెప్పేసి వెళ్లిపోతున్నారు. దయచేసి అవతల వ్యక్తి మట్లాడలేనంతగా డిస్ట్రిబ్ చేయవద్దు. ఒక పెద్ద డైరెక్టర్ ఎంతో కష్టపడి సినిమా తీసి...మాట్లాడుతుంటుంటే పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. డైరెక్టర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను చెప్పే విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండచ్చు. కానీ అర్ధం చేసుకోండి.
అలాగే.. బయట హీరోల ఫంక్షన్ కి వెళ్లినప్పుడు కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. ఒక వ్యక్తి మా వాళ్ల ఫంక్షన్ లో మీ వాళ్ల గోల ఏమిటి అని నాతో అన్నారు. దయచేసి ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు. పవన్ కళ్యాణ్ గారు...చాలాసార్లు నేను ఈ స్ధాయిలో ఉండటానికి మా అన్నయ్యే కారణం అని చెప్పారు. అలాంటిది చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడనీయకుండా అరుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అలా చేయడం నాకు నచ్చలేదు. ఈరోజు మనకి ఒక ఫ్లాట్ ఫామ్ ఏర్పరచిన చిరంజీవి గార్ని కూడా మాట్లాడకుండా చేస్తున్నారు. మీరు ఎంత అరచినా నేను పవన్ గురించి మాట్లాడను. పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని సార్లు చెప్పలేదు. ఆయన మీద ఉన్న ఇష్టం ఎన్ని సినిమాల్లో చెప్పలేదు. చిరంజీవి గారు తర్వాత పబ్లిక్ ఫంక్షన్ లో నాకు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. దయచేసి విషయం అర్థం చేసుకోండి. నేను ఈమధ్య ఇంటర్ వ్యూలో కళ్యాణ్ గారు గురించి అడిగినప్పుడు చెప్పలేదు...కాంట్రవర్సీ ఎందుకు అని ఎవైడ్ చేసాను కానీ..ఎవైడ్ చేయడం వలన ఇంత కాంట్రవర్సీ వస్తుందని ఊహించలేదు. ఈ సమయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. టైమ్ బాగుండి మూడు హిట్ లు కొట్టాడు కదా..అందుకే పవర్ స్టార్ గురించి మాట్లాడడం లేదు అని అపార్ధం చేసుకుంటారు. నేను పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా వెళ్లిపోయినప్పుడు మీరు హార్ట్ అయి ఉంటారు. కానీ..నేను మిమ్మల్ని హార్ట్ చేసిన దానికంటే వంద రెట్లు హార్ట్ చేసారు మమ్మల్ని. మీ అల్లరిని అదుపులో పెట్టుకోండి. ఈ విషయం గురించి మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. దయచేసి నాఫ్యాన్స్ పవన్ కళ్యాన్ గారి ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ సోషల్ మీడియాలో కామెంట్స్ ఆపండి. నా వలన చిరంజీవి గార్కి మచ్చ రావడం నాకు ఇష్టం లేదు. కొంత మంది ఫ్యాన్స్ చిన్ని విషయాన్ని పెద్దది చేసేసారు. అభిమానులు అపార్ధం చేసుకున్నారని బాధగా ఉంది. అయిపోయింది ఏదే అయిపోయింది ఇక వదిలేద్దాం అన్నారు.
టీవీ 9 రవిప్రకాష్ మాట్లాడుతూ...సినిమాని పూర్తి స్ధాయిలో ప్రేమించే వ్యక్తి రామరాజు. తెలుగులో వైవిధ్యమైన చిత్ర నిర్మాణం రామరాజు వలన సాధ్యమవుతుందని మేము నమ్ముతున్నాం. ఆయనతో కలసి టీవీ 9 పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిహారిక తెలుగు ఇంటర్నెట్ వరల్డ్ ను రూల్ చేస్తుంది. ఒక మనసు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ...మెగా ఫ్యామిలీలో ఈరోజు ముఖ్యమైన రోజు. మన అమ్మాయిలను హీరోయిన్స్ గా ఇంట్రడ్యూస్ చేయం. అందుకే తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా చాలా అరుదుగా ఉంటారు. నాగబాబు ధైర్యం చేసి కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. నిహారిక హీరోయిన్ అవుతుంది అనే విషయం తెలిసే సరికి సరైనోడు స్టార్ట్ అయిపోయింది లేదంటే నిహారికనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునేవాళ్లం అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ...సునీల్ కశ్యప్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. నా లోఫర్ సినిమాకి తనే మ్యూజిక్ అందించాడు. రామరాజు లాంటి మంచి డైరెక్టర్ ద్వారా నిహారిక హీరోయిన్ గా పరిచయం కావడం సంతోషంగా ఉంది. చిన్నప్పుడు డాక్టర్ అవుతాను..ఐఎఎస్ ఆఫీసర్ అవుతాను అని చెప్పేది. కానీ..తెలుగు ఇండస్ట్రీలో చేరింది.తనకి ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదేమో అని మొదట్లో అనిపించింది. అయితే..తన కాన్ఫిడెన్స్ చూసాకా కరెక్ట్ అనిపించింది. ఒక మనసు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ...ఈ సినిమాకి నన్నుసంగీత దర్శకుడుగా ఎంచుకున్నందుకు రామరాజు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఒక మనసు ఆడియో, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ రామరాజు మాట్లాడుతూ...ఒక మనసు అనుభవం కంటే అనుభూతి అని చెప్పచ్చు. అనుభవాలను పంచుకోవచ్చు కానీ..అనుభూతులను పంచుకోలేం. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరి కష్టం ఈ సినిమా. మల్లెల తీరం తర్వాత సినిమాలు చేయకూడదు అనుకున్నాను. అయితే నేను ఈ సినిమా చేయడానికి కారణం చంద్రమౌళి గారు. అరకులో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ క్రైసిస్ వచ్చింది. మధ్యలోనే సినిమాని ఆపేద్దాం అనుకున్నాను. ఆ సమయంలో నన్ను ప్రొత్సహించే సినిమా పూర్తయ్యేలా చేసాడు బ్రహ్మారెడ్డి. శౌర్య, నిహారిక, నేను కలిసి తయారు చేసుకున్న సినిమా ఇది. శ్రీధర్ గారు నన్ను ఒక కొడుకులా చూసుకున్నారు. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ అందించాడు. నిహారిక మరో సావిత్రి గారు అవ్వాలనేదే నా కోరిక అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ...నిహారికను ఈ సినిమా కోసం హీరోయిన్ గా సెలెక్ట్ చేసినందుకు డైరెక్టర్ రామరాజు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నాగబాబు గారి అబ్బాయి వరుణ్ ఎంత అందగాడో తెలుసు. నిహారికలో అందంతో పాటు అభినయం కూడా ఉంది. ఇక నాగశౌర్య స్వచ్ఛమైన తెలుగు అబ్బాయి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అలాంటి కో స్టార్ దొరకడం నిహారిక అదృష్టం. ఈ సినిమా అన్నిరకాలుగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మా అందరికీ ఫ్లాట్ ఫామ్ నాన్నగారు ఇచ్చినా మేమందరం కష్టపడుతున్నాం. మా కన్నా ఎక్కువుగా నిహారిక కష్టపడుతుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది అని గట్టి నమ్మకం అన్నారు.
నాగ బాబు మాట్లాడుతూ...హీరోలు ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా రావడం అంటే ఎవరూ జీర్ణించుకోలేరు. కానీ..చరణ్, అర్జున్, వరుణ్, తేజు..ఇలా అందరూ తనని సపోర్ట్ చేయడం గర్వంగా ఉంది. హీరోలుగా ఇండస్ట్రీలోకి వస్తానంటే ఓకే అంటారు..అదే హీరోయిన్ గా వస్తానంటే ఎందుకు నో అంటారు అని నిహారిక ప్రశ్నించింది. ఆ ఒక్క మాటతో నా నోరు మూయించింది. ఆడపిల్లల ఆశలను అణిచివేయకండి..వాళ్లకు అవకాశం ఇద్దాం అన్నారు.
నాగ శౌర్య మాట్లాడుతూ...నా లైఫ్ లో గుర్తుండిపోయే లిరిక్స్ ఇచ్చిన రామజోగయ్యశాస్త్రి గారు, భాస్కరభట్ల గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. సావిత్రి, సౌందర్య, అనుష్క లా ఈ జనరేషన్లో నిహారిక మంచి పేరు తెచ్చుకుంటుంది. కమల్ హాసన్ సాగర సంగమం, నాగార్జున గీతాంజలి లా ఒక మనసు చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు.
నిహారిక మాట్లాడుతూ...నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పెదనాన్న, చిన్నాన్న పాటలు వినేదాన్ని. ఈ సినిమాకి రామజోగయ్యశాస్త్రి గారు, భాస్కరభట్ల అద్భుతమైన లిరిక్స్ అందించారు.కొంత మంది మాట్లాడుతుంటుంటే..అలా వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంటుంది. రామరాజు గారు కథ చెబుతున్నప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను.నా ఫస్ట్ మూవీకి రామరాజు గారు దర్శకుడుగా దొరకడం నా అదృష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.నాగ శౌర్య గుడ్ ఏక్టర్. నేను ఈ సినిమాలో బాగా నటించానంటే శౌర్య ఇచ్చిన సపోర్టే కారణం. అమ్మ ప్రేమ ఎంత స్వఛ్చంగా ఉంటుందో...మా సినిమా కూడా అంతే స్వఛ్చంగా ఉంటుంది అన్నారు.