LPG Connection : సామాన్యుడిపై మరో భారం.. గ్యాస్ కనెక్షన్ డిపాజిట్ భారీగా పెంపు, ఎంతంటే..?
- IndiaGlitz, [Wednesday,June 15 2022]
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో అవసరమైన వంట గ్యాస్‌కు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీనికి తోడు పలుమార్లు భారీగా సిలిండర్ ధరలు పెంచింది కేంద్రం. తాజాగా చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
గతంలో రూ.1,450 ఇప్పుడు రూ.2,200 :
గ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని కేంద్రం భారీగా పెంచింది. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తం ప్రస్తుతం రూ. 1450గా ఉంది. అయితే దీన్ని ఏకంగా రూ. 2,200కు పెంచారు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ పొందాలని భావిస్తే.. ఇంకా ఎక్కువే కట్టాల్సి ఉంటుంది. అదే 5 కేజీల సిలిండర్ విషయానికి వస్తే.. డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. గతంలంో ఈ డిపాజిట్ మొత్తం రూ. 800గా ఉండేది. అలాగే రెగ్యులేటర్‌కు రూ. 250 చెల్లించాలి. గతంలో దీని కోసం రూ. 150 చెల్లిస్తే సరిపోయేది. పెంచిన ధరలు రేపటి నుంచి (జూన్ 16) నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయం కారణంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్‌కు ఈ రేట్లు వర్తించవని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి.
ఆందోళనలకు సిద్ధమవుతోన్న విపక్షాలు :
ఇప్పటికే గ్యాస్ ధరలు చుక్కలనంటుతుండటంతో పేద ప్రజలు గ్యాస్‌పై వంట చేయాలంటేనే భయపడిపోతున్నారు. గతంలో రూ.550 ఉన్న గ్యాస్ ధర దశల వారీగా రూ.1050కు చేరింది. తాజాగా కొత్త కనెక్షన్ తీసుకునేందుకు డిపాజిట్ కూడా భారీగా పెంచేయడంతో నిరుపేదలు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటేనే వెనుకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పెరిగిన డిపాజిట్‌లపై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.