మన ఇంట్లో ముసలివారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి? అనే దానిపై నేటి యువతకు అవగాహన ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ వారి అనుభవం మనకు ఎంతైనా అవసరం అనేది ఎవరూ కాదలనలేని వాస్తవం. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన చిత్రం `ఓ బేబీ`. కొరియన్ చిత్రం `మిస్‌గ్రానీ`కి ఇది తెలుగు రీమేక్. 70ఏళ్ల బామ పాతికేళ్ల లోపు పడుచుపిల్లగా మారిపోతే ఏంటి? అనే పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో సమంత నటించింది. `యూటర్న్` తర్వాత సమంత నటించిన మరో ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రమిది. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి సక్సెస్ దక్కించుకుంది? అలాగే `అలామొదలైంది`తో సూపర్‌హిట్ అందుకున్న నందినీ రెడ్డికి తదుపరి సరైన సక్సెస్ రానేలేదు. మరి `ఓబేబీ` నందినీ రెడ్డికి హిట్ కొరతను తీర్చిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథ:
బేబక్క (లక్ష్మి) తన స్నేహితుడు చంటి (రాజేంద్రప్రసాద్)తో కలిసి ఓ క్యాంటీన్ నడుపుతుంటుంది. బేబక్క అంటే 70 ఏళ్ల వృద్ధురాలు. ఆమెకన్నా ఐదేళ్లు చిన్నవాడు చంటి. బేబక్క కుమారుడు శేఖరం (రావు రమేష్) కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తుంటాడు. జీవితంలో పెద్ద సింగర్ కావాలన్నది బేబక్క ఆశయం. కానీ భర్త అర్ధాయుష్షుతో పోవడంతో ఆమె ఆశలన్నీ అడియాసలే అవుతాయి. కూలీ, నాలీ చేసి పిల్లాడిని పోషించి పెద్ద చేస్తుంది. అతని భార్య (ప్రగతి)కి బేబక్క నోరంటే భయం. అత్తకి ఎదురుచెప్పలేక, ఎదిగొచ్చిన పిల్లల ముందు తనను అత్త నానా మాటలూ అంటుంటే చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఆ స్ట్రెస్ వల్లనే ఆమెకు మైల్డ్ స్ట్రోక్ కూడా వస్తుంది. అత్తా కోడళ్లను విడిగా పెట్టమని సలహా ఇస్తాడు డాక్టర్. అయితే అటు తల్లికి, ఇటు భార్యకీ చెప్పలేక సతమతమవుతాడు శేఖర్. ఆ సమయంలో అతని కుమార్తె నాన్నమ్మతో విషయం చెప్పేస్తుంది. కొడుకు కుటుంబానికి అడ్డుగా ఉండటం బేబికి నచ్చదు. వారికి దూరమవ్వాలని నిర్ణయించుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో తన మ్యూజిక్ ఫెస్ట్ కి రమ్మని ఆమెను ఆహ్వానిస్తాడు మనవడు రాఖీ (తేజ). అక్కడ ఆమెకు ఓ ఫొటో స్టూడియో కనిపిస్తుంది. అక్కడ ఒకతను పరిచయమై ఆమె చేతిలో ఓ దేవుడి విగ్రహాన్ని పెడతాడు. 70 ఏళ్ల వృద్ధురాలు కాస్తా 24 ఏళ్ల అమ్మాయిగా మారుతుంది. ఆ తర్వాత బేబి జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. అదే పనిగా తనను పెళ్లి చేసుకోమని అడిగిన విక్రమ్ మనసును బేబి ఎలా అర్థం చేసుకుంది? తేజ బ్యాండ్ ట్రూప్‌కి బేబీ ఎలా సాయపడింది? బేబి వయసులో ఉన్నప్పుడు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయా? లేదా? ఇంతకీ ఫొటో స్టూడియోకు వెళ్లిన ఆమెకు ఎవరు పరిచయమయ్యారు. చంటి మరదలు సులోచన అంటే బేబికి ఎందుకు పడదు? బేబి ఒంట్లో నుంచి రక్తం పోతే ఏం జరుగుతుందని చంటి గ్రహించాడు? అసలు బేబి బేబక్కగానే ఉండిపోయిందా? నవ యువ బేబిగా ఉండిపోయిందా? కుటుంబమా? స‌్వార్థమా? దేనికి ప్రాధాన్యం ఇచ్చింది? వంటి అంశాలన్నీ సెకండాఫ్‌లో తెలుస్తాయి.
ప్లస్ పాయింట్లు:
సినిమాలో తొలి క్రెడిట్ సమంతకు ఇవ్వాలి. నాయనమ్మ బేబిగా మారినప్పటి నుంచీ ముసలి వ్యవహారశైలి కాసేపు, తను పోగొట్టుకున్న జీవితం కళ్ల ముందున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలనే తాపత్రయం ఒక వైపు... సమంత వీటిని బాగా బ్యాలన్స్ చేసింది. గోదావరి యాసలో సమంతకు చిన్మయి చెప్పిన డైలాగులు సూపర్. డబ్బింగ్ అంత చక్కగా కుదిరి ఉండకపోతే పాత్రకు అంత పేరు వచ్చేదా? అనుమానమే. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించారు. ఆయనకు పర్ఫెక్ట్ మేకప్ కుదిరింది. సెకండాఫ్‌లో బేబిని కన్విన్స్ చేసే సన్నివేశాలు, ఆగమాగం చేస్తున్న తన కూతురిని నలుగురి ముందు కొట్టే సన్నివేశాలు వంటివన్నీ రక్తి కట్టాయి. స్నేహం, వాత్సల్యం, నమ్మకం, కోపం, పంతం వంటి వాటిని ఆయన చాలా సునాయాసంగా ఎక్స్ ప్రెస్ చేయగలిగారు. లక్ష్మి పాత్రలో జీవించేసింది. రాజేంద్రప్రసాద్ తనయగా సునయన, లక్ష్మి కొడుకుగా రావు రమేష్ చాలా బాగా చేశారు. పెద్దల విలువ చెప్పేటప్పుడు, క్లైమాక్స్ లో తన తల్లి పడ్డ కష్టాన్ని చెప్పేటప్పుడు, శుభ్రంగా తుడిచి ఉన్న చెప్పులను చూసుకున్నప్పుడు రావు రమేష్ పండించిన హావభావాలకు ప్రేక్షకుడు కనెక్ట్ అయితే కన్నీళ్లు రావాల్సిందే. అంత బాగా చేశారు. మిగిలిన నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రగతి పాత్ర కూడా బావుంది. సాంకేతిక నిపుణులు కూడా వారి వారి పరిధి మేరకు బాగానే చేశారు.
మైనస్ పాయింట్లు:
స్టార్టింగ్ సన్నివేశాలు చూడ్డానికి కాస్త సరదాగానే అనిపించినా సినిమా నిడివికి కారణమయ్యాయోమనని అనిపిస్తుంది. అలాగే ఊర్వశికి, లక్ష్మికి మధ్య అస్తమానం జరిగే గొడవలు కూడా మెలోడ్రామాలాగా అనిపిస్తాయి. బేబీ పడుచు పిల్లగా మారే క్రమంలో కనిపించిన దృశ్యాలలో క్లారిటీ లేదు. ఒక వైపు బేబీ తప్పిపోయిందని అంటుంటారు. మరోవైపు ఆమె ఫొటోకు అప్పుడే దండ వేస్తారు. దానికి తోడు బేబీ ఇంటి నుంచి వెళ్లినందుకు సంతోషిస్తూ గెంతులు వేస్తారు. ఈ ఒక్క సీన్ పంటికింద రాయిలాగా అనిపిస్తుంది. పోలీసులు సునయనను ప్రశ్నించే సీను కూడా సన్నివేశాల మధ్య అంతగా పొసిగినట్టు కనిపించదు.
విశ్లేషణ:
ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి రివ్యూలు కాదు, మంచి కాసులు రావాలి. బాక్సాఫీస్ దగ్గర లేడీ సబ్జెక్టులకు స్టామినా పెరగాలని తాపత్రయపడ్డారు సమంత. ఆ కృషి ఆమె మాటల్లోనే కాదు, స్క్రీన్ మీద చేసిన నటనలోనూ కనిపించింది. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాల్లోని నటన ఒక ఎత్తు, ఈ చిత్రం మరో ఎత్తు. ఎన్నాళ్లుగానో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నందిని రెడ్డికి ఈ సినిమా మంచి విందుభోజనంలాంటి సినిమా అయింది. ఆమె ఖాతాలో మంచి సక్సెస్ పడింది. లేడీస్ టైలర్, నుంచి ఆ నలుగురు, ఓనమాలు.. అంటూ ఇప్పటికీ రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో మేలిమి సినిమాలను చెబుతూనే ఉంటాం. ఆ కోవలో ఈ చిత్రం చేరుతుంది. గెటప్పు నుంచి పెర్పార్మెన్స్ వరకు అదరగొట్టేశారు. క్లైమాక్స్ లో నాగచైతన్య ఎంట్రీ అందరికీ స్వీట్ సర్‌ప్రైజ్ నాగశౌర్య తన పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. అడివి శేష్; జగపతిబాబు అతిథి పాత్రలూ సినిమాకు హైలైట్. పాటలు కూడా మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉంటే బావుండేవి. కథానుగుణంగా పాటల కంపోజింగ్ ఉంది. టెక్నికల్ టీమ్ కూడా వారి కృషి మేర అంతా బాగా చేశారు. పెద్దలంటే చెప్పిందే పదిసార్లు చెప్తారు. వారి దగ్గర వాసన వస్తుంది. వాళ్లకు చెవుడున్నా, మనకు చెవుడున్నట్టు పెద్దగా మాట్లాడుతుంటారు... అంటూ వారిని పట్టించుకునేవారు కరవవుతున్నారు. వాటి ఫలితంగానే వృద్ధాశ్రమాలు కూడా తరచూ పెరుగుతున్నాయి. అలాంటి వాటికి బ్రేక్ పడాలంటే, పెద్దలంటే మన ఎదుగుదలకు చేసిన త్యాగధనులని తెలుసుకోవాలంటే అడపాదడపా అయినా ఇలాంటి సినిమాలు రావాలి. అత్త ప్రతి విషయం పది సార్లు పదే పదే చెప్పేది కోడలు నేర్చుకుంటుందనే కానీ, నస పెట్టాలని కాదన్న సంగతి గ్రహించాలి. కొడుకు పదేళ్ల పాటు పలకరించకపోయినా వాడి గుట్టు కడుపులో పెట్టుకుని బతికిన సులోచనలాంటి వారు సమాజంలో కోకొల్లలుగా కనిపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్రనూ నిత్య జీవితంలో మనం ఎక్కడో ఓ చోట చూసే ఉంటాం. కొరియన్ చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ అయినప్పటికీ మనవాళ్లందరూ చూడదగ్గ చిత్రం. అందులోనూ గోదావరి యాసతో, మంచి కామెడీతో, కమర్షియల్ వేల్యూస్‌తో మెప్పించింది. ఒక్కసారైనా థియేటర్లో చూడదగ్గ చిత్రం
బాటమ్ లైన్: వావ్... అనిపించిన 'ఓ బేబీ'
Comments