Rajadhani Files: ఏపీలో 'రాజధాని ఫైల్స్' సినిమా నిలిపివేసిన అధికారులు.. ఎందుకంటే..?
- IndiaGlitz, [Thursday,February 15 2024]
రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమా ప్రదర్శనను ఏపీలో పలు చోట్ల అధికారులు నిలిపివేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే.. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల వేళ వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను తీశారని ఆయన ఆరోపించారు. ఈనెల 5వ తేదీన ట్రైలర్ విడుదల చేశారని అందులో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని వివరించారు.
కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంతమాత్రం సరికాదన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా 'రాజధాని ఫైల్స్' చిత్ర ప్రదర్శనకు సెన్సార్ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని వాదించారు. అయితే నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఈ వాదనలను ఖండించారు. రివిజన్ కమిటీ సూచనల మేరకు ఆయా సన్నివేశాలను తొలగించామని.. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. గతేడాది డిసెంబర్ నెలలో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే.. వైసీపీ నేతలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం వరకు సినిమాను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు రాగానే పలు చోట్ల పోలీసులు, రెవిన్యూ అధికారులు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్లో అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సినిమా ఎందుకు నిలిపివేశారంటూ నిలదీశారు. మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలోనూ సినిమా ప్రదర్శన నిలిపివేతపై అమరావతి రైతులు ధర్నాకు దిగారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరి రేపు సినిమా విడుదలపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.