తెలుగు చలనచిత్ర సీమను టర్న్ తిప్పిన సినిమాల్లో శివ ముందు వరుసలో ఉంటుంది. అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ కలయికలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారంటే కారణం.. నాగ్ యాక్టింగ్‌తో పాటు వర్మ టేకింగ్ కూడా. తర్వాత వర్మతో నాగ్ అంతం, గోవిందా గోవింద సినిమాలు చేసినా.. అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దర్శకుడు వర్మ బయోపిక్‌లు, మాఫియా సినిమాలు తీసుకుంటు వచ్చాడు. వాటిలో కొన్ని మంచి విజయాన్ని కూడా సాధించాయి. ఈ మధ్య వర్మకు హిట్ లేకుండా పోయింది. ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో నాగార్జునను కలిసి ఓ యాక్షన్ మూవీ కథ చెప్పడం.. నాగార్జునకు నచ్చడంతో స్టార్ట్ అయిన సినిమా `ఆఫీసర్`. పాతికేళ్ల తర్వాత నాగ్, వర్మ కలిసి చేసిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అని తెలియాలంటే కథేంటో తెలుసుకుందాం..
కథ:
ఫేక్ ఎన్‌కౌంటర్ చేశాడని.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ నారాయణ పసారిపై హైకోర్టులో కేసు ఫైల్ అవుతుంది. హైకోర్టు అతనిపై విచారణ చేయమని ఆదేశించడంతో ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తారు. దాని ఛీప్‌గా హైదరాబాద్‌కు చెందిన శివాజీ రావ్‌ను నియమిస్తారు. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన శివాజీ ..నారాయణ పసారిని అరెస్ట్ చేస్తాడు. అయితే శివాజీ వద్దనున్న సాక్షిని ఎవరో చంపేయడంతో నారాయణ పసారిపై కేసు వీగిపోతుంది. అతను నిర్దోషిగా విడుదలవుతాడు. బయటకు వచ్చిన నారాయణ ఓ అండర్ వరల్డ్ టీంను ఏర్పాటు చేసి సిటీలో ప్రముఖులను చంపిస్తాడు. దాంతో అందరూ భయపడుతుంటారు. ప్రభుత్వం నారాయణ చీఫ్‌గా ఓ టీంను ఏర్పాటు చేస్తుంది. అదే టీంలో శివాజీ కూడా ఉంటాడు. శివాజీకి అదే సమయంలో నారాయణ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అనుకోకుండా శివాజీకి, అండర్ వరల్డ్ టీంకు సంబంధాలున్నాయనే వార్తలు వస్తాయి. అప్పుడు శివాజీ ఏం చేస్తాడు? నారాయణ గురించి శివాజీకి తెలిసిన నిజాలేంటి? శివాజీ సమస్య నుండి ఎలా బయటపడ్డాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
వర్మ ఎప్పుడో కానీ మంచి సినిమాలు చేయడు. అవి కూడా ఇప్పుడు చేయడం లేదు. తనకున్న వాక్ చాతుర్యం.. వింతడవాదం.. సినీ సెలబ్రిటీలను సోషల్ మీడియాలో తిడుతుండటం, జిఎస్‌టి వంటి షార్ట్ ఫిలింస్ చేయడం వల్ల వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. చాలా ఏళ్లుగా వర్మకు సరైన సక్సెస్ లేదు. ఇలాంటి తరుణంలో వర్మ చెప్పిన కథను నమ్మి నాగార్జున ఆఫీసర్ సినిమా చేశాడు. సినిమా ప్రెస్‌మీట్‌లో కూడా తాను అందరూ మెచ్చుకునేలా ఈ సినిమా తీస్తానని చెప్పాడు. సరిగ్గా సినిమా తీయకుంటే ఎక్కడో తన్నమని కూడా నాగార్జునకు లెటర్ రాశాడు. పోనీ వర్మ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకన్నాడా? అంటే లేదు. వర్మ మంచి టెక్నీషియన్. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇది ఆఫీసర్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. ఇక సినిమాకు అసలు పిల్లర్ ఎవరో చెప్పనక్కర్లేదు.. నాగార్జున. వర్మపై నమ్మకంతో నాగ్ చేసిన సినిమా ఇది. వర్మ ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. సాధారణంగా మాఫియా సినిమాలు తీసిన వర్మ వాటిలో రెండు గ్యాంగుల మధ్య గొడవలు చూపేవాడు. ఈసారి ఆఫీసర్ అనే టైటిల్ పెట్టి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ మధ్య గొడవను చిత్రీకరించాడంతే. ఫస్టాఫ్‌లో ఇన్వెస్టిగేషన్.. అంటూ కథ పరావాలేదనిపించినా..సెకండాఫ్ రొటీన్ క్రైమ్ డ్రామాగా సినిమాను ముగించాడు వర్మ. నారాయణ పసారి అనే క్యారెక్టర్ చేసిన నటుడు బాగా నటించాడు. అజయ్, షాయాజీ షిండే వంటి నటీనటులు పాత్రల పరిధి మేర టనటించారు. పూర్ క్యారెక్టరైజేషన్, బోరింగ్ సెకండాఫ్, నిర్మాణ విలువలు బాగా లేకపోవడం.. వర్మ తన పాత సినిమాల్లోని కథనే ఇటు అటు మార్చి చేసిన సినిమా ఇది. వర్మ వీరాభిమానులకు తప్ప మరెవ్వరికీ నచ్చదు.
బోటమ్ లైన్: ఆఫీసర్.. వర్మ రొటీన్ మూవీ
Comments