Download App

Nuvvu Thopu Raa Review

సుధాక‌ర్ కోమాకుల హీరోగా బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో యునైటడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.జె.కె.ప్రొడక్ష‌న్స్ (యు.ఎస్‌.ఎ) వారి స‌హ‌కారంతో హ‌రినాథ్ బాబు.బి ద‌ర్శ‌క‌త్వంలో డి.శ్రీకాంత్ నిర్మించిన చిత్రం `నువ్వు తోపురా`. గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా విడుద‌లైంది. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌` త‌ర్వాత స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సుధాక‌ర్ కోమాకులకు ఈ సినిమా చాలా కీల‌కం. దానికి త‌గ్గ‌ట్టే ఆయ‌న సినిమాపై మ‌రింత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా చూసిన వాళ్లు కూడా కాన్ఫిడెంట్‌గా హిట్ అంటారా.. ప్లీజ్ గో త్రూ..

క‌థ‌:

ఆనందంగా సాగుతున్న సూరి (సుధాక‌ర్ కోమాకుల‌) జీవితంలో చిన్నప్పుడు ఓ విషాదం చోటుచేసుకుంటుంది. ఓ యాక్సిడెంట్‌లో అత‌ని తండ్రి చ‌నిపోతాడు. అప్ప‌టిదాకా తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని అత‌ని త‌ల్లి (నిరోషా) తీసుకుంటుంది. అటు ఉద్యోగానికి, ఇటు ఇంటికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేక ఆమె స‌త‌మ‌త‌మ‌వుతుంటుంది. ఆ స‌మ‌యంలోనే సూరికి, త‌ల్లికి మ‌ధ్య ఎక్కువ దూరం పెరుగుతుంది. త‌న‌క‌న్నా త‌ల్లికి చెల్లెలంటేనే ఇష్ట‌మ‌ని సూరి ఫిక్స్ అవుతాడు. ఆవారాగా తిరుగుతాడు. స‌రూర్‌న‌గ‌ర్‌లో మిగిలిన ఫ్రెండ్స్ తో క‌లిసి జీవితాన్ని న‌చ్చిన‌ట్టు గడుపుతూ చ‌దువుమీద కూడా పెద్ద‌గా దృష్టి పెట్ట‌డు. బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్‌లోనే వ‌దిలేస్తాడు. అలాంటి అత‌నికి ర‌మ్య ఎదుర‌వుతుంది. ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాక చ‌దువు మీద దృష్టి పెట్ట‌మ‌ని చెబుతుంది. అమెరికాలో స్థిర‌ప‌డే ఆలోచ‌న‌ను పంచుకుంటుంది. ఆమె కోసం అమెరికా వెళ్లాల‌నుకున్న అత‌ను, త‌న‌లో ఉన్న డ‌ప్పు కొట్టే క‌ళ ఆధారంగా అమెరికాకు చేరుకుంటాడు. అక్క‌డ అత‌నికి ఎదురైన అనుభ‌వాలు ఎలాంటివి? ప‌రిచ‌య‌మైన మ‌నుషుల్లో మంచివారు ఎంద‌రు? క‌ప‌టంగా న‌టించేవాళ్లు ఎందుకు?  వాళ్ల వ‌ల్ల అత‌ను తెలుసుకున్న‌దేంటి? అత‌నికి మంచి జ‌రిగిందా?  లేదా? త‌ల్లితో పెరిగిన దూరం త‌గ్గిందా?  చెల్లెలికి అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు అత‌ను ఏం చేశాడు?  వంటివ‌న్నీ తెలుసుకోవాలంటే సెకండాఫ్ చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్లు:

సుధాక‌ర్ కోమాకుల తెలంగాణ మాట్లాడే తీరు చూశాక అత‌ను తెలంగాణ వాడు కాదంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. వైజాగ్‌లో పుట్టి పెరిగినా అత‌న్ని చూస్తే స‌రూర్‌న‌గ‌ర్ గ‌ల్లీల్లో నుంచి హీరో అయ్యాడా? అన్నంత ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అంత స‌హ‌జంగా న‌టించాడు. అత‌నికి రింగుల జుట్టు లుక్కు కూడా సూట్ అయింది. నిత్యాశెట్టి త‌న పాత్ర ప‌రిధిమేర బాగానే న‌టించింది. సొంత కొడుకే  త‌న‌ను అర్థం చేసుకోలేద‌ని న‌లిగిపోయే పాత్ర‌లో నిరోషా చ‌క్క‌గా న‌టించింది. ర‌వివ‌ర్మ స్టైలిష్ విల‌న్ పాత్ర‌కు ప‌ర్ఫెక్ట్ మ్యాచ్‌. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు వాడిన తెలంగాణ జాన‌ప‌ద గీతాలు, తీట‌, దూల అంటూ విదేశాల్లో ఉన్న తెలుగు సంస్థ‌ల‌ను ప‌రిచ‌యం చేసిన తీరు, అక్క‌డ‌క్క‌డా మెరుపుల్లా మెప్పించిన డైలాగులు, హీరోకు, ఫ్రెండ్స్ కు మ‌ధ్య సాగే కొన్ని సీన్లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్లు:

నిడివి ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌. ఎంత సేపు ఎదురుచూసినా రాని ఇంట‌ర్వెల్‌తో ప్రేక్ష‌కుడు విసుగెత్తుతాడు. ఎవ‌రినైనా కొట్ట‌డానికి ముందు హీరో మెడ‌ను తిప్పే మేన‌రిజ‌మ్‌, అత‌న్ని సైకోలాగా చూపించేలా చేసింది. స్క్రీన్‌ప్లేలోనూ చాలా అప్స్ అండ్ డౌన్స్ క‌నిపిస్తాయి. సినిమా బావున్న‌ట్టే ఉందే.. అనిపించిన ప‌క్క క్ష‌ణ‌మే `ఈ సీన్ ఇక్క‌డెందుకు` అన్న‌ట్టు కొన్ని చోట్ల మ‌రీ నిదానంగా సినిమా సాగింది. హీరోయిన్ హీరో నుంచి విడిపోవ‌డానికి కానీ, కొడుకు-త‌ల్లికి మ‌ధ్య దూరం పెర‌గ‌డానికి కానీ కార‌ణాలు చెప్పారేగానీ, అవి అంత‌గా క‌న్విన్సింగ్‌గా అనిపించ‌వు. ఎడిట‌ర్ క‌త్తెర మ‌రికాస్త ప‌దునుగా ఉండాల్సింది. చెల్లెలు పాత్ర కూడా నామ్‌కే పెట్టిన‌ట్టు ఉంది. నేప‌థ్య సంగీతం పెద్దేం బాగ‌లేదు.

విశ్లేష‌ణ‌:

నువ్వు తోపురా అని అనిపించుకోవాలంటే క‌థ‌లో ద‌మ్ముండాలి. స్క్రీన్‌ప్లే అంత‌కు మించి షార్ప్ గా ఉండాలి. పాట‌లు, ఫైట్లు, మాట‌లు, చేసే ఫీట్లు అన్నీ ఎక్స్ ట్రార్డిన‌రీగా కుద‌రాలి. వంటింట్లో అన్నీ వేసి చూడు, న‌న్ను వేసి చూడు అని అంటుంద‌ట ఉప్పు. అలా ఎన్ని చేసినా, చివ‌రికి ఎడిట‌ర్ చేతిలో క‌త్తెర ప‌దును కూడా ముఖ్య‌మే.  ఈ సినిమాకు ఎంపిక చేసుకున్న క‌థ బావుంది. దానికోసం ఎంపిక చేసుకున్న లొకేష‌న్లు ఇంకా బావున్నాయి. క‌థ‌నంతా భుజాన వేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న హీరో బావున్నాడు. ఎటొచ్చీ బాగోలేనిది ద‌ర్శ‌క‌త్వ‌మే. క‌థ‌ను గ్రిప్పింగ్‌గా చెప్ప‌లేక‌పోయాడు. మిగిలిన వాళ్ల చేత స‌రైన ప‌నిని రాబ‌ట్టుకోలేక‌పోయాడన్న‌ది వాస్త‌వం. 

బాటమ్ లైన్‌:  నువ్వు తోపు కాదురా

Read 'Nuvvu Thopu Raa' Review in English

Rating : 1.8 / 5.0