తార‌క్‌, త్రివిక్ర‌మ్‌.. ఓ ఫ్యామిలీ స‌బ్జెక్ట్‌

  • IndiaGlitz, [Sunday,January 28 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కుటుంబ నేపథ్యంతో తెర‌కెక్కనుంద‌ని తెలిసింది. ఈ త‌ర‌హా చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్ర‌మ్ సిద్ధహస్తుడు. ఇక ఎన్టీఆర్ కూడా కొన్ని ఫ్యామిలీ ఒరియెంటెడ్ మూవీస్‌లో ఒదిగిపోయారు.

అలాంటి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో కుటుంబ క‌థా చిత్ర‌మంటే.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి మంచి వినోదం గ్యారంటీ అన్న‌మాట‌. కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న ఈ చిత్రానికి తమిళ సంచలనం అనిరుథ్ స్వరాలను సమకూరుస్తున్నారు. కాగా, ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ర‌చించిన ఓ పాపుల‌ర్‌ నవలని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయమై రచయిత్రితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఫిబ్రవరి కల్లా ఆ పనులను పూర్తి చేసుకుని.. మార్చి నుంచి సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. గతంలో 'బృందావనం' సినిమాలో కొత్తగా కనిపించి అభిమానులతో పాటు ప్రేక్షకులని కూడా అబ్బురపరచిన ఎన్టీఆర్...ఈ చిత్రంలో కూడా కొత్తగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కథానాయిక, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌రలోనే వెల్ల‌డి కానున్నాయి.