ఎన్టీఆర్ ఏడోసారి ఆ ప‌ని చేయ‌నున్నారా?

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో ఓ పాట పాడించమని తమన్‌కు నంద‌మూరి అభిమానుల నుంచి చాలా రిక్వెస్ట్స్‌ వస్తున్నాయ‌ట‌.

అందుకు తమన్ కూడా ఓకే చెప్తున్నారు. ఇంత‌కుముందు తమన్ సంగీత సారథ్యంలో 'రభస' చిత్రం కోసం "రాకాసి రాకాసి" అంటూ గొంతు సవరించుకున్నారు ఎన్టీఆర్. అంతేగాకుండా.. కన్నడ సినిమా 'చక్రవ్యూహ'లో తమన్ స్వరపరచిన "గేలియ గేలియ" పాటను కూడా పాడారు యంగ్ టైగర్. ఈ పాటకుగాను తార‌క్‌కు సింగింగ్ సెన్సేష‌న్ స్టార్‌ అవార్డు రావడం కూడా విశేషం.

కాగా, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో సినిమాకి సంగీతమందించడాన్ని తన డ్రీమ్‌గా చెప్పుకొస్తున్న తమన్.. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ గళాన్ని వినిపించడానికి సిద్ధమ‌వుతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అదే గ‌నుక జ‌రిగితే.. కెరీర్ మొత్త‌మ్మీద ఇప్ప‌టివ‌ర‌కు ఆరు పాటలు పాడేసిన ఈ టాలెంటెడ్ హీరోకి ఈ చిత్రం కోసం పాడే పాట ఏడోది అవుతుంది.

ఇప్ప‌టికే.. ఈ సినిమాలో పాటలన్నీ ఆకట్టుకుంటాయని ముందుగానే మాట కూడా ఇచ్చేసారు తమన్. ప‌నిలో ప‌నిగా మూడు "టి"(తారక్, త్రివిక్రమ్, తమన్)ల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకి మరో "టి"("ట్రస్ట్")ని జోడించమంటున్నారు స‌ద‌రు యువ సంగీత సంచ‌ల‌నం.