అదే మీరిచ్చే విలువైన బ‌హుమ‌తి..అభిమానులకు తార‌క్‌ రిక్వెస్ట్

తార‌క్ అభిమానులు ఆయ‌న పుట్టిన‌రోజున రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమోను చూడటానికి ఆతృత‌గా ఎదురుచూడ‌సాగారు. అయితే రాజ‌మౌళి అండ్ టీమ్ అభిమానుల‌కు తాము తార‌క్ వీడియో ప్రోమోను విడుద‌ల చేయ‌డం లేదంటూ షాకిచ్చింది. ఇక తార‌క్ అభిమానులు ఊరుకుంటారా? నెట్టింట్లో తిట్ల పురాణం మొద‌లు పెట్టారు. అయితే అభిమానుల ఆగ్ర‌హాన్ని, ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న తార‌క్ నేరుగా రంగంలోకి దిగారు. అభిమానుల‌ను ఉద్దేశిస్తూ.. అస‌లు తామెందుకు వీడియో ప్రోమో విడుద‌ల చేయ‌లేక‌పోయామో చెబుతూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

‘‘ప్రియ‌మైన అభిమాన సోద‌రుల‌కు విన్న‌పం

ఈ విప‌త్తు స‌మ‌యంలో మీరు మీ కుటుంబ స‌భ్యులు క్షేమంగా ఉన్నార‌ని భావిస్తున్నాను. అంద‌రం క‌లిసి పోరాడితే ఈ స‌మ‌స్య నుండి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తాం అని న‌మ్ముతున్నాను. ప్ర‌తి ఏటా నా పుట్టిన‌రోజున మీరు చూపించే ప్రేమ‌, చేసే కార్య‌క్ర‌మాలు ఓ ఆశీర్వ‌చ‌నంగా భావిస్తాను. ఈ ఏడాదిన మీరు ఇంటి ప‌ట్టునే ఉంటూ, అధికారుల సూచ‌న‌ల‌ను పాటిస్తూ, భౌతిక దూరానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని నా విన్న‌పం. ఇదే నాకు మీరు ఇచ్చే విలువైన బ‌హుమ‌తి. అలాగే, ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఈ సంద‌ర్భంగా ఎటువంటి ఫ‌స్ట్ లుక్ లేదా టీజర్ విడుద‌ల కావ‌డం లేదు అనే విష‌యం మిమ్మ‌ల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని నేను అర్థం చేసుకోగ‌ల‌ను. ఫ‌స్ట్ లుక్ లేదా టీజ‌ర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాల‌ని చిత్ర బృందం ఎంత‌గా క‌ష్ట‌ప‌డింది నాకు తెలుసు. కానీ ఒక ప్ర‌చార చిత్రం మీ ముందు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు క‌లిసి శ్ర‌మించాలి. అధికారిక ఆంక్ష‌ల వ‌ల‌న అది కుద‌ర‌లేదు. రాజ‌మౌళిగారి ద‌ర్శ‌క‌త్వంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచ‌ల‌నం క‌లిగిస్తుంది అన్న న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రం త‌ప్ప‌క మిమ్మ‌ల్ని అల‌రిస్తుంది.
నా వినపాన్ని మ‌న్నిస్తార‌ని ఆశిస్తున్నా’’ అన్నారు తారక్.