మగాడి చేతిలో అసలైన ఆయుధం ఆడదే - ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ తండ్రి పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 27 సినిమాల్లో తండ్రికి దహన సంస్కారాలు చేయని ఆయన `అరవింద సమేత వీరరాఘవ`లో చేశారు. నిజజీవితంలోనూ ఆయనకు అదే జరిగింది. ఆ బాధ నుంచి కోలుకుంటున్న ఆయన `అరవింద సమేత` ప్రచార పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సినిమా గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఆయన చెప్పిన విషయాలు...
అరవింద సమేత వీరరాఘవ.. టైటిల్ చాలా పెద్దగా ఉంది కదండీ..?
కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది ఈ సినిమాలో. కంటెంట్‌కి తగ్గ టైటిల్ పెట్టాం. మామూలుగా మనం గుళ్లకు వెళ్లినప్పుడు లక్ష్మీ సమేత నారసింహస్వామి ఆలయమని, సీతాసమేత రాములవారు అని ఉంటుంది. దేవుళ్లు కూడా ఆడవాళ్ల పేర్లను ముందు పెట్టుకున్నారు. ఎవరైనా పెళ్లికి పిలిచినప్పుడు కూడా సతీసమేతంగా రమ్మని పిలుస్తారు. వాటికి మనం అతీతులం కాదు. అరవింద సమేత అనే సినిమా మహిళలకు ప్రాధాన్యమిస్తుంది. పురుషుడి జీవితంలో మహిళకున్న ప్రాధాన్యతను చెబుతూనే, హింసను ఎలా ఆపాలో చెప్పే సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’.
త్రివిక్రమ్‌గారు టైటిల్ చెప్పినప్పుడు ఏమైనా డిస్కషన్ జరిగిందా.. మీ మధ్య?
లేదండీ. నాకు తెలిసి ఇది చాలా జెన్యూన్ టైటిల్. నాకు ఆయన 14 ఏళ్లుగా తెలుసు. ఎలాంటి సినిమా చేద్దామా అని డిస్కషన్ చేసుకున్నప్పుడు హిట్ సినిమా చేయాలనే ప్రెజర్ పెట్టుకోలేదు. హిట్ సినిమా చేసేతీరాలనే ప్రెజర్‌ను నేను ఎప్పుడో పక్కనపెట్టాను. సినిమా ఫలితాలు కాదు, సినిమా జర్నీ.. సినిమా చేస్తున్న క్రమాన్ని ఆస్వాదించడం ముఖ్యమని అర్థం చేసుకున్నా. కొన్నిసార్లు జర్నీ బ్యాడ్‌గా ఉంటుంది. కానీ సినిమా విడుదలయ్యాక ఫలితాలు మాత్రం చాలా బావుంటాయి. అంతమాత్రాన నేను ఫలితాలను ఆస్వాదించలేను. ఆ ప్రయాణంలో జరిగిన ఒడుదొడుకులను నేను మర్చిపోలేను. క్షమించేయలేను. కొన్నిసార్లు జర్నీ అద్భుతంగా ఉంటుంది. కానీ రిజల్ట్ బ్యాడ్‌గా ఉంటుంది. అయినా నేను ఆ ఫలితాన్ని ఆస్వాదించగలుగుతాం. నాకూ, త్రివిక్రమ్‌గారికి ఎప్పుడూ ఫలితాల గురించి ఒత్తిడి లేదు. మంచి ప్రయాణం చేయాలనే ఒత్తిడి మాత్రం ఉంది. మేం ఎంతగానో ఆస్వాదించి చేసిన ప్రాజెక్ట్ ఇది. అరవింద సమేత వీరరాఘవ అనేది నాకు చాలా నచ్చింది. మిగిలిన వారు ఎలా రిజీవ్ చేసుకుంటారని నేనెప్పుడూ ఆలోచించలేదు.
చాన్నాళ్ల తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చేశారా?
ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. నేను సైతం అని ఎవరికి వారు వాళ్ల వాళ్ల ధోరణిలో ఓ పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మా సినిమా ఇంకో పరిష్కారమార్గాన్ని సూచించింది.
ఇలాంటి సినిమాల్లో హీరో తన అభివ్యక్తిని వ్యక్తం చేయడానికి హింస అవసరమేనంటారా?
లేదండీ. అలాంటిదేమీ లేదు. నవరసాల్లో రౌద్రం అనేది ఒక రసం అంతే. అంతేగానీ హింస తప్పకుండా ఉండాలనేం లేదు. కానీ ఓ కథను రాస్తున్నప్పుడు మెసేజ్ ఇద్దామని మాత్రమే రాయం. మనం రాసే కథలో అంతర్లీనంగా ఓ సందేశం ఉంటే, అది సమాజానికి ఉపయోగపడుతుందని అనుకుంటే, అప్పుడు తప్పు లేదు. హింస అనేది ఏళ్లతరబడి వింటున్న ఓ విషయం.
12 ఏళ్లు త్రివిక్రమ్‌గారితో సినిమా చేయడానికి ఆగారు. ఆ వెయిటింగ్‌కి తగ్గ కథ దొరికిందా?
అదేనండీ నేను చెబుతున్నది. సినిమా హిట్టా, ఫ్లాపా అనే డిస్కషన్ లేదిక్కడ. మేం మంచి సినిమా చేశాం. మంచి ప్రయత్నం చేయాలన్నదే మా సంకల్పం. సూపర్‌హిట్ సినిమాలు చేసిన వారిదగ్గర కెళ్లి ‘సూపర్ హిట్ సినిమాలు ఎలా చేయాలి’ అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేరు. దానికి సంబంధించి ఒక ప్యాటర్న్, ఒక మెథడ్ అనేది ఉండదు. జెన్యూనిటీ అనేది చాలా ఇష్టం.
సినిమా తీసేటప్పుడు అంత ఫెరోషియస్‌గా అనిపించిన విషయం ఏంటి?
ఇది అంత ఫెరోషియస్ సినిమా కాదు. ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఇది ఒకరికి అనుభవంలోకి రావాలి. అప్పుడే చాలా ఎక్కువగా అర్థమవుతుంది. 100 అడుగుల్లో నీళ్లు పడుతుంటే 99 దాకా ట్రై చేసి ఆపేసేవారిని ఏమంటారు. ఆ ఒక్కడుగు కూడా చేస్తే బావుంటుందిగా... అని ఆఖరున ఓ డైలాగ్ ఉంటుంది. ఆ ప్రయత్నం ముఖ్యమన్నమాట.
త్రివిక్రమ్‌గారితో జర్నీ ఎలా ఉంటుంది?
చాలా బావుంటుందండీ. మేమిద్దరం నమ్మే విషయం ఒకటే. దేన్నీ మనం పుష్ చేయకూడదు. అది అలా జరగాల్సిందే. మనం పుష్ చేస్తే అది స్ట్రగుల్‌గానే ఉంటుంది. అలా కాకుండా దాన్ని జరగనివ్వాలి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే... ప్రతిదీ ఎక్కడో డిజైన్ అయ్యే ఉంటుంది. దాని ప్రకారం దాని వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తాం. అ ప్రయాణం కష్టంగా ఉంటుందా? ఎంత వరకు సాగుతుంది అనేది మనకు తెలియదు.
రైటర్‌గా ఎప్పటి నుంచి తెలుసండీ.. త్రివిక్రమ్‌గారు..?
చాన్నాళ్ల ముందేనండీ. ఎన్నే ఏళ్లుగా తెలుసు. అయినా మా కలయిక ఇప్పటికి ఇలా రాసి ఉంది.
ఎమోషనల్‌గా ఆయనతో చాలా కనెక్ట్ అయినట్టున్నారు?
నా అభిప్రాయం ప్రకారం దర్శకుడు, హీరో భార్యాభర్తల్లాంటివారు. హీరోకి, నటుడికి తొలి ప్రేక్షకుడు దర్శకుడే. ఎందుకంటే అప్పటిదాకా దర్శకుడు అనుకున్న కథకి తొలి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేది నటుడే. దర్శకుడి కథకు తొలి ఫేస్ ఇచ్చేది నటుడు. నటించేటప్పుడు ఓ నటుడు మొట్టమొదటిగా సంతృప్తిపరచాల్సింది దర్శకుడినే. ఆ రకంగా నాతో పనిచేసిన దర్శకులు అందరితో నాకు చాలా మంచి స్పందన ఉంది. త్రివిక్రమ్ పర్సనల్‌గా నాకు మంచి ఫ్రెండ్. చాలా మంచి డైరక్టర్. ఇంకా చాలా అంశాల్లో మంచివాడు.
అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌గారికి హిట్ కొట్టాలనే ప్రెజర్ ఉందేమో?
ప్రెజర్ అందరికీ ఉంటుంది. ఒక సినిమా ఆడనంతమాత్రాన కంప్లీట్‌గా ఒక మనిషినే అనడమనే సిద్ధాంతాన్ని నేను నమ్మను. ఇదంతా ఒక జర్నీ. మన ప్రయత్నాల్లో భాగాలే ఇవన్నీ. అలా చూసుకుంటే నాక్కూడా కొన్ని ఫెయిల్యూర్లున్నాయి. ఈరోజు ఆయనకు ఎంత ప్రెజర్ ఉంటుందో, నాక్కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. ప్రెజర్ అనేది కామన్. కాకపోతే ఆ ప్రెజర్‌ని ఎంత పాజిటివ్‌గా తీసుకున్నామనేదే ముఖ్యం.
ఆడియో వేడుకలో త్రివిక్రమ్‌గారు పెద్దగా మాట్లాడకపోవడానికి వెనుక ‘అజ్ఞాతవాసి’ ఆడలేదన్న ప్రెజర్ ఉందా?
దానికి సంబంధించినది అని నేను అనుకోను. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు మా గురించి. నా గురించి, కల్యాణ్ అన్న గురించి. గత నెల రోజులుగా మేం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అన్నమాటలవి.
జరిగిన దాన్నుంచి బయటపడి మీలా మీరు ఉండగలుగుతున్నారా?
అది చాలా కష్టం. అలాంటివాటికి ప్రిపేర్ అయి ఉంటే అది వేరుగా ఉంటుంది. అనూహ్యంగా జరిగినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అసలు మా కుటుంబం ఇలాంటివాటిని అసలు ఊహించదు. మా నాన్న మాకు ఎప్పుడూ చెబుతుండేవారు. ‘ఇక్కడ ఎవరూ, దేనికీ అతీతులు కాదు. మనం క్షణికంగా బతుకుతున్నాం. చాలా క్షణికమైన జీవితం ఇది. మా నాన్న జీవితాన్ని చాలా చూశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాం. పిల్లలున్నారు. అమ్మ, పెద్దమ్మ ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచించాలి.
నిజ జీవితంలో జరిగిన ఘటనే.. ఈ సినిమాలోనూ ఉందట కదా?
ఇది నా 28వ సినిమా. గత చిత్రాల్లో ఒక్కసారి కూడా నాన్న చితికి నిప్పుపెట్టిన సన్నివేశాలు లేవు. కానీ ఇందులో మా నిజజీవితంలో ఏదైతే ఉందో, ఇందులోనూ అదే ఉంది.
ప్రతి ఆడియో వేడుకలోనూ జాగ్రత్తగా వెళ్లండి.. అని చెప్పే మీ కుటుంబానికే ఇలా జరగడం అందరినీ కలిచివేసింది.. అదే చెప్పాను కదా.. మనం ఎవరం అతీతులం కాదు.
ఫ్యాన్స్ ‘ఎన్టీఆర్ సినిమాల్లో ఇంకేదో ఉండాలి’ అని అనుకుంటుంటారు కదా.. ఆ ‘ఇంకేదో..’ ఇందులో ఉంటుందా?
ఆ ‘ఇంకేదో’ అనేది ఏంటో నాకే తెలియదు. ఇదేదో జోక్‌గా అనడం లేదు. ఆ ‘ఇంకేదో’ విషయంపై నాకే క్లారిటీ లేదు. ‘నేను ఇది’ అని ఒక మనిషిని ఒక చట్రంలో ఎలా బిగించగలుగుతామో నాకు తెలియదు. ‘టెంపర్’ చేస్తున్నప్పుడు అలాంటి సినిమా చేస్తానని నాకు తెలియదు. చేశా. అది కుదిరింది. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చేశాను. ‘జై లవకుశ’, ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటివి చేస్తాననీ అనుకోలేదు. ఇప్పుడు జరిగాయి. ‘ఇంకేదో’ అంటూ ఓ చట్రంలో మనిషిని బిగించేయడానికి నేను ఇష్టపడను. కాకపోతే ‘ఇంకేదో... ఇంకేదో’ అనుకుంటూనే ఉంటాం మనం. మనిషి ఆశాజీవి. ఆశకి హద్దు అనేది ఉండదు. జస్ట్ గో విత ద ఫ్లో. ఈ సినిమాలో ప్రతి పాత్రా చాలా బావుంటుంది. ఆయన కేరక్టర్లు రాసిన తీరు కూడా బావుంది. ఇందులో డ్యాన్సులు లేవు. పాటలు కథను చెప్పాలేకానీ, ఒక ఐటమ్ కాకూడదని నా ఫీలింగ్. ఒకప్పుడు ఇలాగే కథని తెలిపేవి. ఆ తర్వాత అవి ఐటమ్స్ అయ్యాయి. అందరూ వాటినే ఫాలో అయ్యారు. మరలా కథను తెలిపే పాటలు వస్తున్నాయి. అంటే మనం మూలాలకు వెళ్తున్నాం. కథను జెన్యూన్‌గా, నమ్మకంగా చెప్పే సినిమాల రోజులకు మరలా వెళ్తున్నాం. ఇంట్లో కూర్చుని మన పిల్లలకు మన మూలాల్ని ఎలా నేర్పుతున్నామో, అలా మన సినిమాల్లోనూ మూలాలకు వెళ్తున్నాం. ఒకప్పుడు మూడు, మూడున్నర గంటలూ కథలు చెప్పేవాళ్లం. ఆ తర్వాత మరలా అది తగ్గిపోయింది. మరలా ఇప్పుడు కథలను చెబుతున్నాం. ‘అరవింద సమేత వీరరాఘవ’లోనూ పాటల్లో స్టోరీ ఉంటుంది.
టిపికల్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎలా ఉంటుంది?
నాకు ఇప్పటికీ టిపికల్ ఎన్టీఆర్ సినిమా అంటే ఏంటో అర్థం కాదు. అవి 10... ఫైట్సా? అది కాదుగా. ప్రతిసారీ ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నానుగా. ఒక సినిమా సక్సెస్ అనేది మాస్ ఒపీనియన్‌ని బట్టి ఉంటుంది. అంతేగానీ, వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టికాదు.
సోషల్ మీడియా డిక్టేట్ చేస్తోందని అనుకుంటున్నారా?
అది అభివృద్ధి. దాన్ని మనం అంగీకరించే తీరాలి. ఎంత ఎఫెక్ట్ చేస్తుందనేది చూడాలి. అది ఓవర్‌నైట్‌లో వచ్చింది కాదు. ప్రేక్షకులు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ అభివృద్ధి వచ్చింది. దాన్ని మనం ఇక్కడ కూర్చుని కావాలనో, వద్దనో అనుకోకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి.
కానీ అనవసరమైన విషయాలను సోషల్ మీడియా ఎక్కువ స్పందిస్తుందనే వాదన..
దాన్ని డీల్ చేయాల్సిందే. మనం నిమిత్తమాత్రులం. సోషల్‌మీడియా అనేది ఎగ్జాగరేటెడ్ రియల్ వర్డ్ అని ఈ మధ్య ఎవరో అన్నారు.
పెనిమిటి పాట వినగానే ఏమనిపించింది?
అసలు ఇంత కో ఇన్సిడెన్స్ ఏంటి? నాన్న చనిపోయాక నేను షాకయ్యాను. ఈ సాంగ్‌కు షూటింగ్ చేసేటప్పుడు మా అమ్మను గుర్తుచేసుకున్నా. మా అమ్మఇంకా దాన్నుంచి బయటకు రాలేదు. పర్సనల్ లెవల్లో మాకు ఇది కనెక్ట్ అయింది. మేం రిలేట్ అవుతున్నాం. ఇది మేం మాత్రమే కాదు. ఇంకా చాలా మంది రిలేట్ అవుతారు. ‘పెనిమిటి’ అనే పాటకు ప్రతి మగాడు, ప్రతి స్త్రీ రిలేట్ అవుతారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ పెనిమిటి అనే పాట. ఆ పాటలో ఓ అబ్బాయికి సంబంధించి అమ్మాయి మనసును ఇంకో అబ్బాయితో పాడించడం అనేది త్రివిక్రమ్‌కే చెల్లింది. అదీ ఆయన క్రియేటివ్. నేను ఇక్కడ కూర్చుని నాకు డ్యాన్స్ నెంబర్లు కావాలని అడిగితే ఇవాళ పెనిమిటి పాట వచ్చేది కాదుగా. అరవిందలో నాకు పెనిమిటి పాట చాలా గొప్పగా అనిపిస్తోంది. సినిమా ఆడినా, ఆడకపోయినా, నాకూ, మా అమ్మకు ఆ పాట చాలా కనెక్ట్ అయింది.
రికార్డింగ్ చేసేముందు మీకు వినిపించారా?
విన్నానండీ. నాలుగు నెలలకు ముందు నేను విన్న పాట ఇది.
చినబాబుగారి సంస్థలో చేయడం ఎలా ఉంది?
చాలా ఆనందంగా ఉంది. సినిమా పట్ల ఓ బాధ్యత ఉన్న వాళ్లతో పనిచేశా. ఈ టీమ్ అంతా అలాగే ఉంది.
ఇగో శాటిస్‌ఫేక్షన్, పీస్ అనేది రివెంజ్‌కి పరిష్కారమా?
కాదండీ. అది ఇగో శాటిస్‌ఫేక్షన్, పీస్ అనేవి కావు. కాకపోతే ఏంటనేది నేను చెప్పను. టైటిల్ వినండి. ‘అరవింద సమేత వీరరాఘవ’ అని వింటే ఏం అర్థమవుతోంది.. ఓ మగాడి చేతిలో ఉండాల్సిన ఆయుధం ఆడదే. కత్తికన్నా పదునైన ఆయుధం ఆడదే.
ఈ సినిమా చేశాక మీలో ఎలాంటి మార్పు వచ్చింది?
నాకు ఈ సినిమా కథను చెప్పినప్పుడే నాలో మార్పు వచ్చేసింది. అందుకే ఈ కథను ఎంపిక చేసుకున్నా. నేను మారి ఉంటా. ఇన్నేళ్లుగా ఇన్ని పాత్రలు చేసిన తర్వాత నేను మంచి భర్తగా మారి ఉండవచ్చు. మంచి తండ్రి అయి ఉండవచ్చు. మంచి వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని ఉండవచ్చు. అందుకు నేను చేసిన పాత్రల సాయం ఉండవచ్చు.
ఈ సినిమా వల్ల ప్రజల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నారా?
తప్పకుండా ప్రభావం ఉంటుంది. కానీ మార్పు గురించి నేను చెప్పలేను. ఎందుకంటే మార్పు అనేది ఒక్క పూటలో రాదు. ఎన్నో వ్యయప్రయాసల తర్వాతే అది క్రమేణ సాధ్యమవుతుందేమో. మార్పు అనేది రావాలి.
సిక్స్ ప్యాక్ కోసం చాలా కసరత్తులు చేసినట్టున్నారు?
అందరూ చేసినట్టే చేశాను. మంచి ట్రైనర్ దొరికారు. అందుకే చేయగలిగా. ‘జై లవకుశ’ తర్వాత చాలా లావయ్యాను. దాదాపు 88.5 వరకు వెళ్లా. చూడగానే వణుకువచ్చేసింది. అప్పుడు త్రివిక్రమ్‌గారు నన్ను ఫిట్‌గా ఉండమని అడిగారు. ఫిట్‌గా ఉండటం అంటే ఏంటో అర్థం కాలేదు. అప్పుడు ఇంకాస్త చేయాలనుకున్నా. నా కోసం.. దానివల్ల లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఫిట్‌గా ఉండటం అనేది కేవలం కొన్నాళ్లకు సంబంధించినది కాదు. జీవితానికి సంబంధించినది. దీనివల్ల మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆనందంగా ఉంటారు. అంతెందుకు మా ఆవిడ డెలివరీ తర్వాత చాలా కష్టపడి వర్కవుట్లు చేస్తోంది. ‘ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు’ అని అడిగా. ‘నువ్వుమాత్రం ఫిట్‌గా ఉండాలి. నేనుండ కూడదా. నేనూ చేస్తా’ అని చేస్తోంది.
మీరేమో పుస్తకాలు చదవరు? త్రివిక్రమ్ బాగా చదువుతారు? పుస్తక పఠనం ఏమైనా పరిచయం చేశారా?
నేను పుస్తకాలు అస్సలు చదవనండీ. కానీ వింటాను. త్రివిక్రమ్ అనర్గళంగా మాట్లాడుతుంటే నేను వింటూ ఉంటా.
అస్సలు మీరు పెట్టుకున్న గోల్ ఏంటి?
గోల్ పెట్టుకుంటే అప్పటికప్పడు మారుతుంటుంది. చిన్నప్పుడు స్కూల్‌కి పంపినప్పుడు ‘అబ్బా స్కూల్ పెడతారేంట్రా బాబు. అని ఇంటికెళ్లిపోవడమే గోల్‌గా పెట్టుకున్నా. అది మారిపోయింది. పదో తరగతికి వచ్చేసరికి పాస్ అయితే చాలనుకునేవాణ్ణి.. అదీ మారిపోయింది. అక్కడి నుంచీ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ కోరుకున్నా. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక్క సక్సెస్ ఇవ్వు దేవుడా’ అనుకొన్నా. ఇలా ఒక్కో గోల్ మారుతూ వచ్చింది. ఒక్క సినిమా మాత్రం అమ్మను ఆనందపరచడానికి చేశా. ఆ తర్వాత ప్రతి రోజు, ప్రతి ఉదయం, 28 సినిమాలు నాకు బోనస్సే. జీవితం ఎప్పుడూ ఇంకేంటి ఇంకేంటి అంటూనే ఉంటుంది.
కథల ఎంపికలో ఒత్తిడిగా ఫీలవుతారా?
అయ్యేవాడిని. కానీ ఇప్పుడు కాదు. మన మీద ఎవరూ ప్రుజర్ పెట్టరు. మనకు మనమే ఏదో అనుకుని ఒత్తిడిగా భావిస్తాం. జీవితంలో ప్రెజర్ తీసేస్తేనే హ్యాపీగా ఉంటాం. సినిమా హిట్టైనా, ఫ్లాప్ అయినా ఆనందపడేది, బాధపడేది రెండు మూడు గంటలో లేదా ఒక రోజో ఉంటుంది అంతే. ఆ తర్వాత వాట్ నెక్ట్స్ అంటూ వెళ్లిపోవడమే. కానీ బయటున్న అభిమానులకు మాత్రం సినిమా ఫ్లాప్ అయితే ఇంట్లో నుంచీ బయటకు రాలేరు. నేను ఏ నిర్ణయం అయినా ఆన్ ద స్పాట్ తీసుకుంటా. ఒక నిర్ణయం తీసుకోవడానికి గంటల తరబడి ఆలోచించను. సినిమా సినిమాకు ఈక్వేషన్లు మారిపోతుంటాయి. అందుకే నేను పైప్‌లైన్‌లో సినిమాలు పెట్టుకోను. పాన్ ఇండియా సినిమా చెయ్యాలంటే దానికి తగ్గ కథ కావాలి. అలాంటి కథ ఏదైనా వస్తే తప్పకుండా భాగం అవుతా. ప్రస్తుతానికైతే.. రాజమౌళి, చరణ్, నేనూ కలిసి చేస్తున్న సినిమా ఒకటుంది. ఆ తర్వాత అశ్వినీదతగారి బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది. తమిళ దర్శకుడు అట్లీతో ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు.
రామ్‌చరణ్, మీరూ స్నేహితులైనా ఇద్దరూ కలిసి నటించడం వెనక సామాజికవర్గాలు, లెక్కలు వేరుగా ఉంటాయి కదా?
ఇంకా సామాజిక వర్గాలేంటండీ. ఆ మాట వినడానికి విసుగ్గా ఉంది. వినివినీ బోర్ కొట్టింది. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ కన్నా మేమిద్దరం ఇలాంటి ఓ సినిమా చేస్తే ఓ కొత్త ఒరవడి మొదలవుతుందని ఆశ.
మహేశ్, రాంచరణ్, మీరు కలిసి నటించే అవకాశం ఉందా?
మాకు అలా చెయ్యడానికి ఎలాంటి ఇబ్బంది లేదండీ. కాకపోతే ముగ్గురు హీరోలను డీల్ చేసే కెప్టెన్ కావాలి కదా! మేం కలిసినప్పుడూ మాట్లాడుకుంటాం.
‘బిగ్‌బాస్2’ మిస్ అయ్యారా? మీ యాంకరింగ్‌లో ఎనర్జీని నాని అందుకోలేకపోయాడనే మాట వినబడుతోంది?
షో మిస్ కాలేదు. అలాగని చూడనూలేదు. నేను హోస్టింగ్ బాగుందంటే మాత్రం చాలా హ్యాపీ. ‘బిగ్‌బాస్’ లాంటి షోలు చేస్తే అందులో మొదట మనం ఏంటో మనకు బాగా తెలుస్తుంది. జనాలకి వారి విషయాలకన్నా పక్కవాళ్ల జీవితంలోకి తొంగి చూడటం చాలా ఇష్టం. అక్కడ 10 మంది సభ్యుల ప్రవర్తనను చూడగలం. బిగ్‌బాస్ సీజన్3తో చేస్తానో లేదో నాకు తెలీదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments