NTR Mahanayakudu Review
తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రగణ్యులు. దక్షిణాదివారంటే మద్రాసీలమనే భావన ఎక్కువగా ఉన్న రోజుల్లో తెలుగువాళ్లంటే వారికొక చరిత్ర, సంస్కృతి ఉన్నదంటూ .. వారికి ఉనికిని చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, సుయోధనుడు.. సహా అన్యాయాలను ఎదిరించిన వెండితెర కథానాయకుడు. అంతే కాకుండా ఆయన ఓ రాజకీయ పార్టీని పెట్టి 8 నెలల్లో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. ఎందరితో స్ఫూరిగానిలిచిన ఆయన జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించడమంటే నిజంగా సాహసమే.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నామని అనౌన్స్ చేయగానే సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. అసలు ఆయన సినిమా రంగంలో నెంబర్ వన్ స్టార్. తర్వాత రాజకీయ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి ఈయన బయోపిక్‌లో ఏ అంశాలుంటాయనే దానిపై ఉత్కంఠతకు తెర దించుతూ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని 'యన్.టి.ఆర్ కథానాయకుడు'గా తెరకెక్కిస్తే.. రాజకీయ సంచలనాలను 'యన్.టి.ఆర్ మహానాయకుడు'గా తెరకెక్కించారు. కథానాయకుడు విడుదలైంది. కాగా.. నేడు 'యన్.టి.ఆర్ మహానాయకుడు' విడుదలైంది. అసలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటిని అధిగమించి విజేతగా ఎలా నిలిచారు? తెలుగుదేశంలో అసలు ఆగస్ట్ సంక్షోభానికి కారణమేంటి? దాన్ని ఎన్టీఆర్ ఎలా అధిగమించారు? రాజకీయంగా ఎన్టీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
కథ:
తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో కథానాయకుడు ముగిసింది. తెలుగుదేశం పార్టీని గుర్తుని, జెండాను, ఎజెండాను తయారు చేయడం, ప్రకటించడంతో అసలు కథ అక్కడ నుండే మొదలవుతుంది. వేదికలు, పర్మిషన్స్ తీసుకోవాలంటే సమయం పడుతుంది. కానీ ఎన్నికలకు అంత సమయం లేకపోవడంతో ఎన్టీఆర్ చైతన్యరథాన్ని సిద్ధం చేసి ప్రజల్లోకి వెళతారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యవస్థలోని అవినీతిని రూపుమాపడానికి కొన్ని డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంతో పాలక వర్గంలోనే అసంతృప్తి నెలకొంటుంది. ఈలోపు తన భార్య బసవ తారకంకు క్యాన్సర్ ఉందని తెలియడంతో అమెరికా వెళతారు రామారావు, బసవ తారకం దంపతులు. అమెరికాలో ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. ఈలోపు నాదెండ్ల భాస్కర్‌రావు ఎమ్మెల్యేలు అసంతృప్తితో రాసి, సంతకాలు పెట్టిన లేఖను అవిశ్వాస లేఖగా మార్చేస్తాడు. దాంతో ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటాడు. అసలు విషయం తెలిసి ఎన్టీఆర్ గవర్నర్ దగ్గరకు వెళ్లినా ఫలితం ఉండదు. దాంతో నాటకీయ పరిస్థితుల మధ్య ఢిల్లీ చేరుకుని అక్కడ ఇందిరా గాంధీ రాజకీయాన్ని ఎండగడతాడు. మళ్లీ ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారనేదే కథ. ఈ కథ బసవ తారకం కోణంలో సాగుతుంది కాబట్టి.. ఆమె శివైక్యం చెందడంతో సినిమా ముగుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- బాలకృష్ణ, విద్యాబాలన్, రానా ఇతర నటీనటులు
- సన్నివేశాలు చుట్టూ ఉన్నఎమోషన్స్
- పొలిటిటిక్ డ్రామా
మైనస్ పాయింట్స్:
- పూర్తి స్థాయి కథను చెప్పలేకపోవడం
- సినిమా అంతా పూర్తి రాజకీయ కోణంలో సాగడంతో యూత్‌కు కనెక్ట్ అవుతుందా అనేదే ఆలోచించాల్సిన అంశం
విశ్లేషణ:
ఓ స్టార్ హీరో రాజకీయాల్లోకి రావాలనుకోవడం సాధారణమైన విషయమే. ఎన్టీఆర్ కంటే ముందుగానే చాలా మంది సినీ తారలు రాజకీయాల్లో ఉన్నారు. అయితే తెలుగువాడి ఉనికిని చాటే క్రమంలో ఓ పార్టీని పెట్టి.. తొమ్మిది నెలల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఆయన ఎంత కృషి చేసుంటారనేదే సినిమాలో కీలకంగా మారింది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిలా చక్కగా సూట్ అయ్యారు. అసలు పార్టీ జెండా వెనుక ఉన్న అర్థం చెప్పడం.. చైతన్యరథంలో జనం మధ్యలోనే ఉంటూ వారికి చేరువ కావడం .. పెద్ద స్టార్‌ని కాబట్టి విలాసంగానే ఉంటానని కాకుండా రోడ్డు పక్కనే స్నానాలు చేయడం.. మార్గమధ్యంలోని పల్లెల్లో నిద్రపోవడం వంటి పనులు చేశారు. వాటిని ఈ సినిమాలో చూపించారు.
నిజంగానే ఓ స్టార్ కు ఇంత ఆదరణ ఉండేదా? అనిపించేలా సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. ఇక ముఖ్యమంత్రి తర్వాత ఉద్యోగుల వయసు తగ్గించి వారి కోపానికి గురి కావడం.. తెలుగుగంగ ప్రాజెక్ట్ రూపొందించడం.. అవినీతి చేసిన తన సభ్యులపైనే అవినీతి శాఖతో దాడులు చేయించడం వంటి సన్నివేశాలు చక్కగా ఉన్నాయి. అలాగే సంక్షోభం ఎలా జరిగింది. ఆ సమయంలో జరిగిన నాటకీయ పరిస్థితులను బాగా చూపెట్టారు. చంద్రబాబు పాత్రలో చేసిన రానా.. తెలుగుదేశంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? పార్టీ ఉన్నతికి ఎలా దోహదపడ్డారు. రాజకీయంగా మామకి ఎలా సపోర్ట్ చేశారనే అంశాలను చూపించే ప్రయత్నం చేశారు. ఇక సంక్షోభ సమయంలో ఎమ్మేల్యేలను చంద్రబాబు పక్కకి పోనీయకుండా చూసుకోవడం... ఒకటైతే, మరోవైపు ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్లి ఇందిరా పాలనను ఎండగట్టే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
నాదెండ్ల భాస్కరరావు పాత్రలో సచిన్ ఖేడేకర్ చక్కగా సరిపోయారు. ఇక వై.ఎస్.ఆర్ పాత్రధారిని కూడా చూపించారు. ఎన్టీఆర్ బల నిరూపణ చేసి మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో పాటు.. ఈ కథ బసవ తారకం వైపు నుండి ఉంటుంది కాబట్టి.. ఆమె పాత్ర కన్నుమూయడంతో సినిమా ముగుస్తుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు క్రిష్ బాగా ఎలివేట్ చేశారు. విద్యాబాలన్ పాత్ర పరిధి ఈ పార్ట్‌లో చాలా ఉంది. నీకు నాకూ రెండు ఇష్టాలు ఉంటాయా? బావా అంటూ ఆమె చెప్పే డైలాగ్, ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన చాలా బావుంది. ఇక రానా, చంద్రబాబు పాత్రలో ఒదిగిపోయారు. సన్నివేశాలకు అనుగుణంగా మంచి డైలాగ్స్ కూడా కుదిరాయి. నేపథ్య సంగీతం బావుంది. అయితే ఇలాంటి పూర్తిస్థాయి రాజకీయ చిత్రం యువతకు ఆకట్టుకుంటుందా? అంటే ఆలోచించాల్సిన విషయమే అవుతుంది మరి.
బోటమ్ లైన్: యన్.టి.ఆర్ మహానాయకుడు.. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఓ భాగం .. ఓ కోణం
- Read in English