Download App

NTR Kathanayakudu Review

ద‌క్షిణాదివారంటే మ‌ద్రాసీల‌మ‌నే భావ‌న ఎక్కువ‌గా ఉన్న రోజుల్లో తెలుగువాళ్లంటే వారికొక చ‌రిత్ర‌, సంస్కృతి ఉన్నదంటూ .. వారికి ఉనికిని చాటిన వ్య‌క్తి నంద‌మూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావ‌ణాసురుడు, సుయోధ‌నుడు.. స‌హా అన్యాయాల‌ను ఎదిరించిన వెండితెర  క‌థానాయ‌కుడు. అంతే కాకుండా ఆయ‌న ఓ రాజ‌కీయ పార్టీని పెట్టి 8 నెల‌ల్లో ముఖ్య‌మంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. ఎంద‌రితో స్ఫూరిగానిలిచిన ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డ‌మంటే నిజంగా సాహ‌స‌మే. ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఆయ‌న బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నామ‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమా ఎలా ఉంటుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అస‌లు ఆయ‌న సినిమా రంగంలో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌. త‌ర్వాత రాజ‌కీయ రంగంలోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. మ‌రి ఈయ‌న బ‌యోపిక్‌లో ఏ అంశాలుంటాయ‌నే దానిపై ఉత్కంఠ‌త‌కు తెర దించుతూ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`గా తెర‌కెక్కిస్తే.. రాజ‌కీయ సంచ‌ల‌నాల‌ను `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు`గా తెర‌కెక్కించారు. మ‌రి ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి తెలియ‌ని విష‌యాల‌ను చూపించారా?.. ఆయ‌న సినీ కెరీర్ ప్రారంభ ద‌శ‌లో ఎదుర్కొన్న స‌వాళ్లు ఎలాంటివి? ఇలాంటివ‌న్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

క‌థ‌:

ఆడ‌యార్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స చేయించుకుంటున్న బ‌స‌వ తార‌క‌మ్మ‌(విద్యాబాల‌న్‌)ను క‌ల‌వ‌డానికి ఆమె కుమార్తెలు, కుమారుడు హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్ రామ్‌) వ‌స్తారు. డాక్ట‌ర్స్  బ‌స‌వ‌తార‌క‌మ్మ బ్ర‌త‌కడం క‌ష్ట‌మేన‌ని అంటారు. ఆ విష‌యాన్ని ఆమెకు చెప్ప‌కుండా కుటుంబ స‌భ్యులు ఆమెను వెళ్లి క‌లుస్తారు. అక్క‌డ ఫోటో ఆల్బ‌మ్‌ను చూడ‌టం ద్వారా ఆమె గ‌తంలోకి క‌థ వెళుతుంది. విజ‌య‌వాడ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప‌నిచేసే నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ‌) అక్క‌డ లంచాల కోసం రైతుల‌ను ఇత‌రుల‌ను ఇబ్బంది పెడుతున్న ప‌ద్ద‌తులు న‌చ్చ‌క ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. అక్క‌డ నుండి మ‌ద్రాస్ బ‌య‌లుదేరుతాడు. ఆయ‌న భార్య బ‌స‌వ తార‌క‌మ్మ.. భ‌ర్త మాట‌కు ఎదురు చెప్పదు. మ‌ద్రార‌స్‌లో ఎల్‌.వి.ప్ర‌సాద్‌ను క‌లుసుకుని సినిమాలో అవ‌కాశం లేద‌ని తెలుసుకుంటాడు. అయితే అక్క‌డి నుండి ద‌ర్శ‌కుడు బి.ఎ.సుబ్బారావు క‌లుసుకుంటాడు. సినిమా చేయడానికి ఆల‌స్య‌మ‌వుతుంది. ఆ క‌మ్రంలో రామారావు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌ను కూడా క‌లుస్తారు. కానీ సినిమా చేసే అవ‌కాశం రాదు. ఈలోపు ఎల్‌.వి.ప్ర‌సాద్`మ‌న‌దేశం` సినిమాలో పోలీస్ వేషం వేసి మెప్పు పొందుతాడు. తిండి లేకుండా ప‌స్తుల‌తో ఇబ్బంది ప‌డుతుంటే రామారావు సోద‌రుడు త్రివిక్ర‌మ్‌రావు(ద‌గ్గుబాటి రాజా) అన్న‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. అదే స‌మ‌యంలో విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ నుండి రామారావుకు నాలుగు సినిమాలు చేసే అవ‌కాశం వ‌స్తుంది. రామారావు అగ్రిమెంట్ మీద సంత‌కం పెడ‌తాడు. ఆ సినిమాల్లో పాతాళ భైర‌వి, మాయాబ‌జార్‌లు సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో రామారావు తొలి ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ అవుతాడు. అక్క‌డ నుండి న‌టుడిగా వెనుదిరిగే అవ‌కాశ‌మే ఉండ‌దు.  మ‌ధ్య‌లో కృష్ణ‌, శోభ‌న్‌బాబులాంటి కుర్ర హీరోలు వ‌చ్చినా ఎన్టీఆర్ కొత్త‌దనం ఉన్న సాంఘిక క‌థ‌ల‌తో పాటు పౌరాణిక సినిమాలు కూడా చేసి అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదుగుతారు. ఆయ‌న‌కు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు(సుమంత్‌)తో మంచి అనుబంధం ఏర్ప‌డుతుంది. ఇదే క్ర‌మంలో దివిసీమ ఘ‌ట‌న ఆయ‌న్ను ఎంతో క‌లిచి వేస్తుంది. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు చూసి రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటాడు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు నాదెండ్ల భాస్క‌ర్‌రావు(స‌చిన్ ఖేడేక‌ర్‌) జ‌త క‌లుస్తాడు. దాంతో ఆయ‌న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?  అస‌లు ఎన్టీఆర్ పార్టీని పెట్ట‌డం వెనుకున్న ఎమోష‌న‌ల్ విష‌యాలేంటి? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

ఇండియ‌న్ సినిమాలో మ‌రే సినిమాలో న‌టించ‌నంత మంది న‌టీన‌ట వ‌ర్గం య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు సినిమాలో న‌టించారు. ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంలో ఉన్న న‌టీన‌టులంద‌రినీ.. ముఖ్యుల‌ను ఈ సినిమాలో త‌గిన పాత్ర‌ధారుల‌తో రీప్లేస్ చేశారు. అలాగే  స్వ‌ర్గీయ ఎన్టీఆర్ భార్య బ‌స‌వ తార‌క‌మ్మ పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్‌, త‌న‌యుడు హ‌రికృష్ణ‌గా క‌ల్యాణ్‌రామ్‌, అల్లుడు చంద్ర‌బాబు నాయుడుగా రానా, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుగా భ‌ర‌త్, అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగా సుమంత్‌, ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మేన్ పీతాంబ‌రంగా సాయిమాధ‌వ్ బుర్రా, చ‌క్ర‌పాణిగా ముర‌ళీశ‌ర్మ‌, బి.నాగిరెడ్డి ప్ర‌కాశ్‌రాజ్‌, దాస‌రి పాత్ర‌లో చంద్ర సిద్ధార్థ్‌, ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే సావిత్రిగా నిత్యామీనన్‌, హ‌న్సిక‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, ప్ర‌ణీత‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించారు. ఇలా అంద‌రూ వారివారి పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించారు. ఇక నందమూరి బాల‌కృష్ణ.. ఎన్టీఆర్ పాత్ర‌లో ఒదిగిపోయారు. అన్ని గెటప్స్ వేసి ఆయా పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించ‌డ‌మంటే గొప్ప విషయం. బాల‌కృష్ణ ఓ సాహ‌సంగానే సినిమా చేశాడు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎం.ఎం.కీర‌వాణి పాట‌లు, నేప‌థ్య సంగీతం బావున్నాయి. బంటు రీతి కొలువు ఇయ్య‌వ‌య్యా సామి.. పాట‌తో పాటు..వెండితెర దొర సాంగ్ ఎమోష‌ల్ ట‌చ్‌తో చ‌క్క‌గా సాగింది. అలాగే  దివిసీమ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్‌, పేద ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్న‌ప్పుడు అక్క‌డ వ‌చ్చే స‌న్నివేశాలు, ఎమోష‌న‌ల్ పాయింట్ ఆక‌ట్టుకున్నాయి.

జ‌నం క‌న్నీళ్ల‌తో క‌డుపు నింపుకోవ‌డం బావుండ‌దు సార్‌..

ఎవ‌డు సంపాదిస్తే వాడే ఇంటికి య‌జమాని, లంచం తీసుకుంటే ఆ ఇంటికి ఎంతో మంది య‌జ‌మానులుంటారు..

కాలాన్ని గెలిచే అవ‌కాశం ఒక్క‌సారే వ‌స్తుంది.. అది మ‌నం చనిపోయిన‌ప్పుడే ఉండాలి..

నేను రాజ‌కీయాల గురించి ఆలోచిండం లేదు.. ప్ర‌జ‌ల గురించి ఆలోచిస్తున్నాన‌ని అన‌డం..ఇలా చాలా సంభాష‌ణ‌లు స‌న్నివేశాల ప‌రంగా మెప్పిస్తాయి.

మైన‌స్ పాయింట్స్‌:

వ‌య‌సులో ఉన్న ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ కాస్త న‌ప్ప‌లేదు.. సినిమా నిడివి మ‌రీ ఎక్కువ‌గా అనిపించింది. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ ఆ విష‌యంలో కాస్త శ్ర‌ద్ధ తీసుకుని ఉంటే బావుండేద‌నిపించింది..

స‌మీక్ష‌:

ఎన్టీఆర్ హీరో కాక ముందు ఎలా ఉండేవారో చాలా మందికి తెలియ‌దు. ముఖ్యంగా ఈ త‌రంలో చాలా మంది యువ‌త‌కు ఆయ‌న గురించి తెలిసే అవ‌కాశాలు త‌క్కువే. అలాంటి వారికి తెలుగు జాతి గొప్ప‌తనాన్ని ఢిల్లీకి.. ప్ర‌పంచానికి చాటిన ఓ వ్య‌క్తి జీవితాన్ని అందించిన ప్ర‌య‌త్నం అభినంద‌నీయం. ఎక్క‌డా క‌థ‌ను డైవ‌ర్ట్ చేయ‌కుండా నేరుగా క‌థ‌లోకి వెళ్లిపోతూ ఏడువేల మంది ప‌రీక్ష రాస్తే వ‌చ్చిన ఉద్యోగాన్ని వ‌దులుకున్న వ్య‌క్తి సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ప‌డ్డ ఇబ్బందులు.. అదే క్ర‌మంలో ప్ర‌జ‌లు గురించి ఆయ‌న ఆలోచించిన తీరు బావుంది. సినిమావాళ్లు ఎంతో సంపాదిస్తారు క‌దా! మ‌రి జోలె ప‌ట్ట‌డం ఎందుకు? అనే ప్ర‌శ్న మ‌దిలో చాలామందికి వ‌చ్చి ఉండొచ్చు. ప్ర‌తి ఒక్క‌రికీ సాయ‌ప‌డ‌టం అనేది ధ‌ర్మం. ఆ ధ‌ర్మాన్ని చెప్ప‌డ‌మే క‌ళాకారుల ప‌ని అంటూ ఎంతో తెలివిగా స‌న్నివేశాన్ని ర‌క్తిక‌ట్టించారు ద‌ర్శ‌కుడు క్రిష్‌. బాల‌కృష్ణ ఎక్క‌డా లైన్ దాట‌కుండా బ్యాలెన్స్‌డ్‌గా యాక్ట్ చేస్తే.. స‌న్నివేశాల‌ను అంత అందంగా తీర్చిదిద్దిన దర్శ‌కుడు అభినంద‌నీయుడు. ముఖ్యంగా ఇన్ని గెట‌ప్స్‌తో ఉన్న సినిమాను ఎమోష‌న‌ల్ పార్ట్ డ్రాప్ కానీయ‌కుండా చూడటం గొప్ప విష‌యం. ఉదాహ‌ర‌ణ‌కు కొడుకు చనిపోయినా.. ఎన్టీఆర్ త‌న వ‌ల్ల నిర్మాత‌కు న‌ష్టం రాకూడ‌ద‌ని ఆలోచించే స‌న్నివేశంఆయ‌న క‌మిట్‌మెంట్‌తో పాటు ఎమోష‌న‌ల్‌గా మెప్పిస్తుంది. అలాగే నిత్యామీన‌న్‌కు సంపాద‌న గురించి ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌లు వివ‌రించే సంద‌ర్భాలు బావున్నాయి. రాయ‌ల‌సీమ కోసం జోలె ప‌ట్టి సాయ‌ప‌డే సంద‌ర్భం..తుఫాను కార‌ణంగా దివిసీమ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వారి కోసం ఓ మ‌నిషిగా బాధ‌ప‌డుతూ ఏదైనా చేయాలనుకోవ‌డం. న‌న్నుదేవుడ్ని చేసిన ప్ర‌జ‌ల కోసం నేను మ‌నిషిగా మారుతాన‌ని భార్య‌తో ఎన్టీఆర్ చెప్పే స‌న్నివేశం.. య‌మ‌గోల త‌ర్వాత కూతుర్లు ఆయ‌న్ను విమ‌ర్శించే స‌న్నివేశం.. వేట‌గాడు చిత్రంలో ఆకుచాటు పిందె త‌డిసే పాట చూసి భార్య ఆయ‌నతో వ్యంగ్యంగా మాట్లాడిన‌ప్పుడు ఒకప్పుడు వ‌ర్షం చూస్తే ఆనంద‌మేసేది. కానీ ఇప్పుడు వ‌ర్షం చూస్తే ప్ర‌జ‌ల క‌న్నీళ్లు గుర్తుకు వ‌స్తున్నాయని చెప్పే సీన్స్‌.. చివ‌ర‌ల్లో పార్టీ ఎందుకు పెడుతున్నాన‌ని ప్ర‌క‌టించే సంద‌ర్భం ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే స‌న్నివేశాలే..

బోట‌మ్ లైన్‌.. `య‌న్‌.టి.ఆర్` .. తెలుగు ప్ర‌స్థానం `క‌థానాయ‌కుడు`

Read 'NTR Kathanayakudu' Movie Review in English

Rating : 3.0 / 5.0