ఫాదర్, సన్ రిలేషన్ని సరికొత్తగా చూపించే సింపుల్ స్టోరీ నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో...ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన నాన్నకు ప్రేమతో...ఎన్టీఆర్ 25వ సినిమా కావడం విశేషం. ఈ భారీ క్రేజీ మూవీని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా నాన్నకు ప్రేమతో...చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నాన్నకు ప్రేమతో...గురించి ఎన్టీఆర్ ఇంటర్ వ్యూ మీకోసం...
13న నాన్నకు ప్రేమతో..రిలీజ్ అవుతుంది..టెన్షన్ పడుతున్నారా..?
గత కొన్ని రోజులుగా రాత్రిపగలు అనే తేడా లేకుండా వర్క్ చేసాం. రిలీజ్ డేట్ దగ్గరకి వచ్చింది కాబట్టి టెన్షన్ ఉంటుంది. అయితే రిజల్ట్ కోసం టెన్షన్ కాదు...మా టీమ్ అంతా ఎవరికి వారు బెస్ట్ ఇవ్వాలని టెన్షన్ పడ్డాం.
సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా...ఇలా పోటీపడడం ఎంత వరకు కరెక్ట్..?
పోటీ ఎంత వరకు కరెక్ట్ అంటే..రికార్డులు ద్రుష్టిలో పెట్టుకుంటే ఇలాంటి మాటలు వస్తాయని నా అభిప్రాయం. గతంలో ఒక సినిమా సంవత్సరం ఆడేది. మా జనరేషన్ లో 175 డేస్ ఆతర్వాత 100 డేస్, 50 డేస్, 25 డేస్ ఆడేవి. ఇప్పుడు రెండు వారాలు మాత్రమే. ఎన్ని రోజులు ఆడింది అనేది కాదు ముఖ్యం ఎంత కలెక్ట్ చేసింది అనేదే ఇప్పుడు ముఖ్యం. అయినా సినిమా బాగుంటే 4 సినిమాలు కాదు ఇంకా ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినా చూస్తారు. అదుర్స్ టైంలో అనుకుంట.... అదుర్స్, నమో వెంకటేశ, శంభో శివ శంభో..ఈ మూడు సినిమాలు రిలీజ్ అయి విజయం సాధించాయి.అలాగే వన్ మంత్ గ్యాప్ లో ఏడు సినిమాలు రిలీజై సక్సెస్ సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుచేత సంక్రాంతికి రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలు సక్సెస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
25వ సినిమాని సుకుమార్ తో చేయాలని ముందే ప్లాన్ చేసారా..?
అలాంటిది ఏమీ లేదు. అసలు...ఇది 25వ సినిమా అని కూడా గుర్తులేదు. సుకుమార్ తో సినిమా చేయాలి అదే నాకు ఓ ఛాలెంజ్ అనుకున్నాను. అయితే ఇది 25వ సినిమా అని తెలిసినప్పుడు గూగుల్ లో చూస్తే..బాల రామాయణం, చిన్నప్పుడు చేసిన సినిమాలు అన్నీ కలపి ఇది 30...31వ సినిమా అన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు ఇది 25వ సినిమా అని వేయాలా వద్దా..అని ఆలోచించాం. చివరకి హీరోగా చేసిన 25వ సినిమా కాబట్టి పోస్టర్స్ లో వేసాం. ఎప్పుడైతే ఇది 25వ సినిమా అని తెలిసిందో..అప్పటి నుంచి ఇంపార్టెంట్ అయిపోయింది.
సుకుమార్ లో మీకు నచ్చింది ఏమిటి..?
లండన్ లో షూటింగ్ చేయడం అంటే..చాలా కష్టం. చాలా రిష్ట్రక్షన్స్ ఉంటాయి. ఉదయం 5 గంటలకు లేచి ఏడున్నరకు ఫస్ట్ షాట్ తీయాలి. దాని కోసం సుకుమార్ చాలా కష్డపడేవాడు. కేవలం రెండు గంటలు మాత్రమే పడుకునేవాడు. ఇదేమి బాహుబలి సినిమా కాదు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అయినా అంత కష్టపడేవాడు. సుకుమార్ లో ఆ హార్డ్ వర్క్ నాకు బాగా నచ్చింది.
సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ కి కాస్త తిక్క ఉంటుంది. మరి..నాన్నకు ప్రేమతో..లో మీ క్యారెక్టర్ కి కూడా తిక్క ఉంటుందా..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి తిక్క అనేది ఉండదు. కాకపోతే..స్వార్ధం అనేది ఉంటుంది. సింపుల్ ప్లెయిన్ స్టోరి ఇది. పండితులకు, పామరులకు అర్ధం అయ్యేలా ఉంటుంది. సుకుమార్ ఫాదర్ మానసిక సంఘర్షణలోంచి పుట్టిన కథ ఇది.
ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్...ఇలా చాలా ఛేంజ్ కనిపిస్తుంది కారణం..?
బాండీలాంగ్వేజ్, హెయిర్ స్టైలే కాదండీ...వాయిస్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలోను కేర్ తీసుకున్నాం. ఎంతలా అంటే..కళ్లు రెప్పలు వాల్చడం..నుంచి కనుబొమ్మల కదలికల వరకు చాలా జాగ్రత్త తీసుకున్నాం. సుకుమార్ చెబుతుంటే...ఇంత చిన్న చిన్న విషయాలను గుర్తిస్తారా అనుకునేవాడిని. అయితే డబ్బింగ్ చెబుతున్నప్పుడు తెలిసింది. నేను ఎంత కొత్తగా ఉన్నానో.
ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. మరి మాస్ ఆడియోన్స్ ఆకట్టుకునే అంశాలు ఇందులో ఏమి ఉన్నాయి..?
నాకు మాస్, క్లాస్ అని వేరు చేయడం నచ్చదు. ఇక ఫ్యాన్స్ కోసం అంటారా..నా ప్రతి సినిమా ఫ్యాన్స్ కి నచ్చుతుందనే చేస్తాను. కొన్ని సక్సెస్ అవుతాయి. కొన్ని సక్సెస్ కావు. వాళ్లకు ఏం నచ్చుతుందో తెలిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది.
ఫాదర్, సన్ రిలేషన్ పై చాలా సినిమాలు వచ్చాయి కదా..మరి నాన్నకు ప్రేమతో..సినిమాలో ఉన్న కొత్తదనం ఏమిటి..?
నిజమే...మీరన్నట్టు ఫాదర్, సన్ రిలేషన్ పై చాలా సినిమాలు వచ్చాయి. ఇది కొత్త కథ కాదు. కానీ కథనం కొత్తగా ఉంటుంది. తండ్రి కోరికను కొడుకు ఎలా నెరవేర్చాడు అనేది కొత్తగా ఉంటుంది. స్ర్కీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది.
ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ ఎలా ఉంటాయి..?
అన్ని పాటల్లో డాన్స్ అదరగొట్టేయాలి అని అనుకోను. కాకపోతే సినిమాలో ఒక పాట మాత్రం డాన్స్ కోసమే అన్నట్టు చేయాలనిపిస్తుంది. అలా ఈ సినిమాలో ఓ పాటలో మాత్రం డాన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.ఇక ఫైట్స్ విషయానికి వస్తే...కొడితే ఎగిరిపడేలా ఉండదు. ఏదైనా కథలోంచి రావాలి. పీటర్ హెయిన్స్ ఫైట్స్ ను కొత్తగా డిజైన్ చేసారు. ఆడియోన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాలో ప్రతి ఒక్కర్ని టచ్ చేసే ఓ ఎమోషనల్ సీన్ ఉంది అని అంటున్నారు ఆ సీన్ గురించి చెబుతారా..?
ఇప్పుడు ఆ సీన్ గురించి చెప్పను. తెరపైనే చూడాలి. ఆ సీన్ నాకు సుకుమార్ చెబుతుంటే కన్నీరు ఆగలేదు. అక్కడ రాజేంద్రప్రసాద్ గారు ఉంటే వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏడ్చేసాను. అప్పడు మా నాన్న గుర్తుకువచ్చారు. నాకు సీన్ గురించి చెబుతూ సుకుమార్ ఏడ్చేసాడు. మా వెనక కెమెరామెన్ విజయ్ చక్రవర్తి కూడా ఏడ్చేసాడు. అంతలా ఏడిపించిన సీన్ ఏమిటనేది నేను చెప్పడం కన్నా మీరు చూస్తానే బాగుంటుంది.
నాన్నకు ప్రేమతో...పాటల్లో డోంట్ స్టాప్ అనే పాట మీ వ్యక్తిగత జీవితాన్ని ద్రుష్టిలో పెట్టుకుని రాయించారంటున్నారు..?
ఆ పాట కథలో భాగంగానే వస్తుంది తప్ప కావాలని నా వ్యక్తిగత జీవితాన్ని ద్రుష్టిలో పెట్టుకుని రాయించలేదు. పాట రెగ్యులర్ గా ఉండకూడదు కొత్తగా ఉండాలి అని పెట్టాం. అదీ కూడా కథలో భాగంగానే ఉంటుంది. ఇలా ప్రతిదీ కావాలని..ఏదో ద్రుష్టిలో పెట్టుకుని చేసారా అంటే సినిమాలు చేయలేం.
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచన ఉందా..?
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలంటే...దానికి చాలా స్టాఫ్ కావాలి. ఎలాంటి మిస్టేక్ జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా నాకు అన్నయ్య ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉండగా...వేరే ప్రొడక్షన్ హౌస్ ఎందుకు..? అందుచేత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలనే ఆలోచన లేదు.
తెలుగు సినిమా స్టామినా పెరిగింది..మరి మీరు మీ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేసేలా ఏమైనా ఆలోచిస్తున్నారా..?
2015 పెంటాస్టిక్ ఇయర్.. ఇండస్ట్రీ చాలా మారింది. బాహుబలి తో తెలుగు సినిమా మార్కెట్ ఏమిటో మరోసారి నిరూపించింది. శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ సినిమాలు కంటెంట్ ఉంటే సినిమాలు ఏరేంజ్ లో సక్సెస్ అవుతాయో చూపించాయి. అప్పట్లో రామారావు గారు డిఫరెంట్ మూవీస్ చేసారు. చిరంజీవి గారు రుద్రవీణ, నాగార్జున గారు గీతాంజలి, శివ, అన్నమయ్య, శ్రీరామదాసు...ఇలా డిఫరెంట్ మూవీస్ చేసారు. ఇప్పుడు మార్పు వస్తుంది. నా విషయానికి వస్తే..టెంపర్ నాకు ఆక్సిజన్ లాంటిది. ఇక నుంచి కంటెంట్ తో డిఫరెంట్ మూవీస్ చేస్తాను.జనతా గ్యారేజ్ సినిమాతో నా సినిమాని తమిళ్, మలయాళంలో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను.
జనతా గ్యారేజ్ టైటిల్ ఫిక్స్ చేసారా..? లేక వర్కింగ్ టైటిలా..?
జనతా గ్యారేజ్ టైటిల్ ఫిక్స్ చేసాం. ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నాం.
నాగ్ ఊపిరి లో మీరు నటించాలి కదా..మరి మీరు చేయకపోవడానికి కారణం..?
కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేయాలనుకున్నాను. కాకపోతే నాన్నకు ప్రేమతో...ఊపిరి రెండు ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. అందుచేత డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరకపోవడం..అలాగే నాకోసం నాగార్జున గార్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక ఆ సినిమా చేయలేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
జనతా గ్యారేజ్ సినిమా ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభిస్తున్నాం. ఆతర్వాత అన్నయ్య ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుంది. ఏ డైరెక్టర్ తో..? ఎప్పుడు ప్రారంభం అనేది త్వరలో తెలియచేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments