Kantamaneni Uma Maheswari : కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్య.. ధ్రువీకరించిన పోలీసులు

  • IndiaGlitz, [Monday,August 01 2022]

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తొలుత అనారోగ్యం కారణంగా ఆమె చనిపోయినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లుగా పోలీసులు ప్రకటించారు. మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె దీక్షిత కూడా ధృవీకరించారు. మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లిన తన తల్లి.. ఎంతకు బయటకు రాకపోవడంతో తలుపులు బద్ధలుకొట్టి చూశామని ఆమె తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2.30కి పోలీసులకు సమాచారం అందించినట్లు దీక్షిత తెలిపారు. ఉమామహేశ్వరి మరణంపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు.

ఎల్లుండి అంత్యక్రియలు:

ఉమామహేశ్వరికి భర్త శ్రీనివాస్ ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఇటీవలే చిన్న కుమార్తెకు వివాహం చేయగా.. పెద్ద కుమార్తెకు విదేశాల్లో వుంటున్నారు. ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఎల్లుండి ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

నాలుగేళ్ల క్రితం హరికృష్ణ దుర్మరణం:

2018 ఆగస్ట్ 29న ఎన్టీఆర్ కుమారుడు , మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి అన్నగారి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఉమామహేశ్వరి కన్నుమూయడంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.