వైసీపీలోకి ఎన్టీఆర్ కుమార్తె.. ముహూర్తం ఫిక్స్!?

  • IndiaGlitz, [Monday,January 14 2019]

ఇదేంటి టైటిల్ చూడగానే నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా..?. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఉండగా వైసీపీలోకి వెళ్తున్నారా..? ఇప్పటికే మంతనాలన్నీ అయిపోయాయా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 21న వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె కుమారుడు హితేష్ ఇద్దరూ కలిసి పార్టీలో చేరతారా..? ఓ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం ఇస్తానని జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది.

వైఎస్‌‌తో ఉన్న సాన్నిహిత్యంతో..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఓ వెలుగు వెగిన పురందేశ్వరికి ఆయనతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన మరణాంతరం కొద్దిరోజులు కాంగ్రెస్‌‌లో ఉన్న ఆమె తిన్నగా కమలం గూటికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉండటంతో చేసేదేమీ లేక వైసీపీలోకి చేరాలని దగ్గుబాటి ఫ్యామిలీ నిర్ణయించారట. పైగా ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నీ అయిపోయాయ్.. ఇక ప్రత్యామ్నాయం ఉండేది ఒకే ఒక్క వైసీపీ మాత్రమే. మరోవైపు జగన్ నుంచి హామీ రావడంతో చేసేదేమీ పార్టీ మారాల్సిందేనని పురందేశ్వరి భావించారని టాక్. పురంధేశ్వరి రాకతో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న ‘కమ్మ’లను తమవైపు తిప్పుకోవచ్చని వైసీపీ భావించిందని తెలుస్తోంది.

ఇంత జరుగుతున్నా స్పందించరేం..!?
జగన్ పాదయాత్ర చేస్తున్న టైమ్‌‌లోనే పురందేశ్వరి వైసీపీ కండువా కప్పుకుంటారని టాక్ నడిచింది. అయితే నాటి నుంచి నేటి వరకూ టీవీ చానెల్స్ మొదలకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. ఇంత తతంగం నడుస్తున్నా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి చిన్నపాటి స్పందన కూడా రాకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. మౌనం అంగీకారానికి అర్థమని స్పష్టంగా అర్థం చేస్కోవచ్చు. అయితే 2018 చివర్లో టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ మారతారని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేయడంతో చివరకు ఎలాగూ ఫుల్‌స్టాప్ పెట్టగలిగారు. అయితే పురందేశ్వరి మాత్రం ఇలా స్పందించిన దాఖలాల్లేవ్.

రెండు టికెట్లు ఫిక్స్..!?
వైసీపీలో చేరిక విషయమై పార్టీకి చెందిన ఓ కీలక నేత మంతనాలు జరిపారని.. సుమారు వారంకు పైగా టైమ్‌ తీసుకున్న దగ్గుబాటి కుటుంబం లోతుగా ఆలోచించి ఫైనల్‌‌గా పార్టీ మారాలని ఫిక్స్ అయిపోయిందని సమాచారం. దీంతో వైసీపీలో చేరడం లాంఛనంగా మారిందని తెలుస్తోంది. పురందేశ్వరి కుమారుడు హితేష్‌కు పర్చూరు సీటు.. ఆమెకు విశాఖ ఎంపీ సీటు ఫిక్సయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే హితేష్‌కు టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై వైసీపీ ఓ సర్వే కూడా చేయించిందట. వైసీపీ నుంచి పోటీ చేస్తే సానుకూలంగా ఫలితాలు వస్తాయని తేలడంతో మరోమారు మాట్లాడకుండా టికెట్ ఇచ్చేద్దామని ఓ కీలకనేతతో సందేశం పంపారని తెలుస్తోంది.

ఏపీలో బీజేపీ ఖాళీ..!
ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీకి బై బై చెప్పేశారు. ఈ నెల 21న రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్లు స్వయాన ఆయన నోటితోనే చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమకు ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందో ఆ గూటికి వెళ్లడానికి నేతలు సిద్ధమైపోయారు. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన కీలక నేతలు పార్టీ మారిపోవాలని భావించారట. వారిలో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, పురందేశ్వరి తొందరగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే ఇదే జరిగితే ఏపీలో బీజేపీ ఖాళీ అవుతుంది.. ‘ఇంటి ముందు పెట్టు టూలెట్ మాదిరిగా.. ఏపీ బీజేపీకి అభ్యర్థులు.. కావలెను’ అని మాట్లాడుకోవాల్సి వస్తందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఇది అసలు ఆషామాషీ విషయం కాదు..!
ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరి తండ్రి, తండ్రి తర్వాత బావ నడుపుతున్న టీడీపీలోకి వెళ్లకుండా వైసీపీ గూటికి రావడం ఆషామాషా విషయం కాదు. బహిరంగంగా చంద్రబాబుపై పురందేశ్వరి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే అసలు పార్టీలో చేరిక ఉంటుందా..? లేదా ఇవన్నీ పుకార్లేనా అనేది ఒక్కసారి పురందేశ్వరి మీడియాతో మాట్లాడినా.. లేదా ఈ నెల 21 వరకు వేచి చూసినా అప్పుడే ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

More News

సూర్య సినిమా షూటింగ్ పూర్తి

సూర్య క‌థానాయ‌కుడుగా సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఎన్‌.జి.కె`. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై

సైలెన్స్‌... అనుష్కే కాదు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ కూడా...

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని బాహు భాషా చిత్రాన్ని నిర్మించనున్నాయి.

కాజ‌ల్ ఆ ప‌నిచేస్తుందా?

కాజ‌ల్ అగ‌ర్వాల్ దృష్టంతా ఇప్పుడు త‌ను చేయ‌బోయే ఇండియ‌న్ 2పైనే ఉంటుంది.

క‌మ‌ల్ కొడుకుగా శింబు

యూనివ‌ర్ప‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న చివ‌రి చిత్రం `ఇండియ‌న్ 2` కు సిద్ధ‌మ‌య్యారు.

'పెద్ద' ఓట్లు చంద్రబాబుకా.. వైఎస్ జగన్‌‌కా..!?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల నోట వచ్చే హామీలు కోటలు దాటుతున్నాయ్.! ఓ వైపు చంద్రబాబు..