అంగరంగ వైభవంగా ఎన్టీయార్ ప్రారంభోత్సవం

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఎన్టీయార్ బయోపిక్. నందమూరి నటవారసుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ గా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామకృష్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై వారాహి చలన చిత్రం మరియు విబ్రి మీడియా సంయుక్త సమర్పణలో తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.  
ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీయార్ నట ప్రస్థానంలో అత్యంత కీలక చిత్రమైన దానవీరసూర కర్ణ చిత్రంలోని కీలకమైన సన్నివేశాన్ని బాలయ్య అదే గెటప్ లో రీక్రియేట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బాలయ్యపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దేశ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నందమూరి మోహనకృష్ణ స్క్రిప్ట్ ను చిత్రబృందానికి అందించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగుదనానికి నిండుదనాన్ని, తెలుగువారికి ఒక గుర్తింపు, తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటిజెప్పి, తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖచిత్రంలో వెలిగించి, తాను ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగులో తెలుగువారందరికీ అనేక సందేశాలు, మేలు చేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి చరిత్రను సినిమాగా తీయడం అనేది తెలుగువారికి గర్వకారణం. నిజానికి ఉపరాష్ట్రపతిగా నేను ఇటువంటి ప్రారంభోత్సవాలకు రాకూడదు.. కానీ ఎన్టీయార్ మీద అపారమైన గౌరవంతో నేను ఈ వేడుకకు విచ్చేశాను. మార్చి 29 అనేది ఎన్టీయార్ గారికి చాలా ప్రత్యేకమైన రోజు. చరిత్రలో నిలిచిపోవడంతోపాటు ఆ చరిత్రను అందరికీ తెలియజేయడం చాలా ఉత్తమం. తండ్రి జీవనపాత్రను కుమారుడు పోషించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మనుషుల్ని ప్రభావితం చేయగల ఈ సినిమా అనే మాధ్యమం ద్వారా ఎన్టీయార్ చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం కోసం బాలకృష్ణ నడుం కట్టడం ప్రశంసనీయం. రామారావుగారు నటనలో, రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు కానీ.. ఎన్టీయార్ ఆహార్యం చూస్తే చాలనిపిస్తుంది. మనం రామారావుగారికి ట్రిబ్యూట్ ఇవ్వాలంటే అందరూ తెలుగులో మాట్లాడాలి, తెలుగు సంస్కృతిని ఆచరించాలి. నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణకు అభినందనలు. రామారావుగారి అభిమాని కానివాడు తెలుగు చిత్రసీమలో లేడు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సినిమా రూపొందాలని కోరుకొంటున్నాను అన్నారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఎన్నో జన్మల పుణ్యం చేసుకొంటే తప్ప ఎన్టీయార్ గారితో సినిమా తీసే అవకాశం రాదు. ఆయన బయోపిక్ లో నటిస్తున్న బాలయ్య, సినిమా తీస్తున్న తేజ కూడా అదృష్టవంతులే. ఈ సినిమాలో ఒక్క శాట్ అయినా డైరెక్ట్ చేసే అవకాశం నాకు కావాలి అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు లేని సమయంలో తెలుగు, తమిళులు అందరూ మదరాసీలుగాగా పిలవబడుతున్న మనకు.. మేం తెలుగువాళ్లం అని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీయార్. అటువంటి మహత్తరమైన చరిత్ర సృష్టించిన రామారావుగారి చరిత్రను తెరమీదకు తీసుకురావడమే పెద్ద సాహసం. ఆ సాహసం చేయగల దమ్మున్న మనిషి బాలకృష్ణ మాత్రమే. రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమా కోప్రొడ్యూసర్ విష్ణు ఎన్టీయార్ కథ చెప్పినప్పుడు ఈ కథ బాలయ్య తప్ప ఎవరూ చేయలేరన్నాను. ఈనాడు అది నిజం కావడం ఆనందంగా ఉంది అన్నారు.

చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. రామారావుగారికి నేను పెద్ద అభిమానిని, ఆయన బయోపిక్ కి దర్శకత్వం వహించే అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. మొదట నాకీ అవకాశం వచ్చినప్పుడు నేను దీనికి కరెక్ట్ కాదేమో అన్నాను. కానీ విష్ణు మాత్రం మీరే కరెక్ట్, మీరు చేయండి అన్నారు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఎన్టీయార్ గారి సినిమాకి దర్శకత్వం వహించే అద్భుతావకాశం రాదు. ఈ సినిమాని బాగా తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కథ కాదు చరిత్ర, ఆ చరిత్రను ఆరు సినిమాగా తీయొచ్చు. దసరాకి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. మా ఎన్టీయార్ చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసినవారందరికీ పేరుపేరునా కృతజ్నతలు తెలియజేసుకొంటున్నాను. ఈమధ్య ఎవర్ని పడితే వారిని మహానుభావులంటున్నారు. కానీ.. నా దృష్టిలో ఎన్టీయార్ గారు మాత్రమే మహానుభావులు. నిన్న జరిగింది ఈరోజు మర్చిపోయే ఈరోజుల్లో ఎన్టీయార్ జీవిత చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలనుకోవాలని విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి ముందుకు రావడం అనేది అభినందనీయం. అయితే... ఆయన సినిమాలో మా కుటుంబ సభ్యులందరూ ఉండాలనుకొని కొంత సమయం తీసుకొని ఈ చిత్రాన్ని నేడు ప్రారంభించాం. ఆయన జీవితం మొత్తం సినిమాగా తీయాలంటే అయిదారు గంటలు వస్తుంది. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. మార్చి 29న పాతాళభైరవి చిత్రాన్ని రీమాస్టర్ చేసి ప్రింట్స్ పెంచడం, లవకుశ, దేశోద్దారకులు రిలీజ్ అవ్వడమే కాక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడం అదే రోజున ఎన్టీయార్ బయోపిక్ ను నా పరిచయ చిత్రమైన తాతమ్మ కలను నిర్మించిన రామకృష్ణ స్టూడియోస్ లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించడం, ఆ చిత్రంలో నేను నాన్నగారి పాత్ర పోషించడం అనేది విశేషం అన్నారు.

చిత్ర సహనిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. ఎన్టీయార్ బయోపిక్ లో నేను భాగస్వామి కావడం ఎన్నో జన్మల ప్రతిఫలం. ఎన్టీయార్ గారి దానవీరసూర కర్ణ చిత్రంలో మూడు పాత్రలు పోషించడమే కాక ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించి చరిత్ర సృష్టించడమే కాక సాంకేతికత అంతగా అందుబాటులో లేని సమయంలో 44 రోజుల్లో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అదే తరహాలో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చిత్రాన్ని 81 రోజుల్లో పూర్తి చేశారు. కేవలం కథ కోసమే దాదాపు సంవత్సరన్నర కాలం వెచ్చించాం. దసరాకి ఎన్టీయార్ బయోపిక్ తో మీ ముందుకు వస్తున్నాం అన్నారు.

సీనియర్ నటీమణి జమున మాట్లాడుతూ.. అక్బర్ సలీం అనార్కలీ చిత్రంలో సలీం గా నటించిన.. ఆనాటి నుంచి నా మనసులో ఒక పుత్రుడిగా నా హృదయంలో స్థానం సంపాదించుకొన్న మా బాలయ్య బాబు నేడు ఎన్టీయార్ బయోపిక్ లో కీలకపాత్ర పోషించడం అనేది గర్వకారణం. అన్నీ రంగాల్లోనూ విజేతగా నిలిచిన మహానేత, నాయకుడు ఎన్టీయార్ గారి చరిత్రను సినిమాగా తీయాలనుకోవడం అభినందనీయం. నాకు ఇష్టమైన ఏకైక కథానాయకుడు ఎన్టీయార్.. ఎందుకంటే ప్రతి జోనర్ సినిమాకి, ప్రతి తరహా పాత్రకి జీవం పోయగల ఏకైక నటుడు ఆయన మాత్రమే. కథానాయకుడు మాత్రమే కాదు ప్రజల మనసేరిగిన నాయకుడు ఎన్టీయార్.  ఈ వేషంలో బాలయ్యను చూస్తుంటే ఎన్టీయార్ గార్ని చూసినట్లుంది అన్నారు. 

సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. మేజర్ చంద్రకాంత్ టైమ్ లో రామారావుగారికి ఒక్కసారి కలిసే అవకాశం నాకు దొరికింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఎన్టీయార్ చిత్రానికి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. భావితరాలకు ఎన్టీయార్ గారి ఘనతను చాటేందుకు బాలయ్య చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. ఎన్టీయార్ పాత్రను పోషించగల సత్తా ఉన్న ఏకైక నటుడు బాలయ్యబాబు మాత్రమే. ఈ ప్రారంభోత్సవ వేడుకలో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎన్టీయార్ గారి చివరి రోజుల్లో ఆయనతో చాలా దగ్గరగా మెలిగాం మేము. మానవత్వానికి నిదర్శనం బాలయ్యగారు, ఇక నా క్లాస్ మేట్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడంటే నేనే ఎక్కువగా సంతోషించాను అన్నారు.

రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నేను ఎలా బ్రతకాలో, ఎలా నిలబడాలో, ఎలా జీవితానికి ఎదురెల్లాలో ఎన్టీయార్ గారి సినిమాలు చూసి నేర్చుకొన్నాను. ఎన్టీయార్ అనే వ్యక్తి లేకపోతే నేను లేను, ఇవాళ నేను ఇలా నిలబడ్డానంటే కారణం మా అమ్మ, నాన్న, ఎన్టీయార్, సినిమా. ఎన్టీయార్ అనే మూడక్షరాల వెనుక ఒక జాతి, రాష్ట్రం, దేశం నడిచింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి సినిమాకి నేను మాటలు రాస్తున్నాను. ఇది బాలయ్యగారు నాకు ఇచ్చిన వరం. ఈ వరాన్ని నేను సద్వినియోగించుకొంటానని, ప్రతి అక్షరం నా ఆయుస్షు పెంచేలా రాస్తాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో సినిమాలు తెరకెక్కించిన కోడి రామకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్,  పూరీ జగన్నాధ్, కె.ఎస్.రవికుమార్ తోపాటు టి.సుబ్బిరామిరెడ్డి, పరుచూరి వెంకటేశ్వర్రావు, ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్, అనిల్ సుంకర, రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్, సి.కళ్యాణ్, డి.సురేష్ బాబు, ఛార్మీ,  కె.ఎల్.నారాయణ, దగ్గుబాటి పురంధేశ్వరి, కైకల సత్యనారాయణ మరియు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, డిజైనర్: ధని ఏలే. కథ: డాక్టర్ ఎల్.శ్రీనాధ్-విష్ణువర్ధన్ ఇందూరి, కళ: రామకృష్ణ-మౌనిక, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఛాయాగ్రహణం: సంతోష్ తుండియిల్, సంగీతం: కీరవాణి, సహ నిర్మాతలు: సాయి కొర్రపాటి-విష్ణు ఇందూరి, నిర్మాత: నందమూరి బాలకృష్ణ, నిర్మాణం: ఎన్.బి.కె ఫిలిమ్స్, సమర్పణ: వారాహి చలనచిత్రం-విబ్రీ మీడియా, దర్శకత్వం: తేజ. 

More News

ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు పాత్ర ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగ‌తి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

రంగస్థలంకి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అట‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

యంగ్ హీరోతో సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

భిన్నమైన కథలతో.. వైవిధ్యమైన కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట ద‌ర్శ‌కుడు సుకుమార్.

రాజమౌళికి అరుదెన ఆహ్వానం

'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని  పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సినిమా మేకింగ్ రాజమౌళి అండ్ టీంకి ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.

ర‌వితేజ‌కు జంట‌గా...

'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాల‌తో మంచి విజయాల‌నే సొంతం చేసుకుంది.