ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు ప్రజలకు రామాయణం!
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత నటుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన అన్నగారు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీ ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించారు. సినిమా చూసిన పలువురు బాగుందని మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం సినిమాలో పెద్దగా పసలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్నగారి జీవితంలోని ప్రధాన ఘట్టాలను బాగానే చూపించారు.. పర్వాలేదని కితాబిస్తున్నారు. నటించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న బాలయ్య.. తండ్రి జీవితంలోని అన్ని కోణాల్లో ఒదిగిపోయారని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే నిడివి మరీ ఎక్కువగా ఉండటంతో సినీ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాను తిలకించేందుకు టీడీపీ నేతలు, ప్రముఖులు సైతం థియేర్లకు క్యూ కట్టారు. బుధవారం ఉదయం సినిమా చూడటానికి వెళ్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేశినేని మాటల్లోనే...
తెలుగు ప్రజలకు.. చరిత్రలో, సినీ ఇండస్ట్రీలో ఓ రామాయణం లాగా ఎన్టీఆర్ బయోపిక్ కూడా మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. " తెలుగు జాతికే అన్నగారి జీవిత చరిత్ర గర్వకారణం. పేదవారికి కూడు, గుడ్డ, నీడ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టిన కేవలం 9నెలల్లోనే అధికారంలోకి రావడం అన్నగారికే సాధ్యమైంది. బహుశా దేశంలో ఎక్కడా ఇలాంటి పరిణామం జరగలేదు. ఇవాళ్టికి కూడా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన బిడ్డకు కేటీఆర్ అని పేరు పెట్టారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేస్కోవచ్చు. ఇలా ప్రతి తెలుగువాడి గుండెల్లో ఆయన స్థానం సంపాదించడం విశేషం. అలాంటి వ్యక్తి అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ సినిమా రూపంలో ముందుకు తీసుకురావడం తెలుగు ప్రజలకు చరిత్రలో రామాయణంగా మిగిలిపోయే కార్యక్రమం ఇది.." అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎన్టీఆర్ బయోపిక్‌ను రామాయణంతో పోల్చడం బహుశా కేశినేనికే చెల్లుతుందేమో.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments