నా పన్నెండేళ్ల కల నేరవేరింది - యంగ్ టైగర్ ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ హీరోగా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం 'అరవింద సమేత'. వీర రాఘవ ట్యాగ్‌లైన్. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్. అక్టోబర్ 11న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - "12 ఏళ్ల నా కల త్రివిక్రమ్‌గారితో సినిమా చేయాలన్నది. చాలా సార్లు అనుకున్నాం. ఎలా చేస్తే బావుంటుంది అని ఆలోచించేవాళ్లం. ఎప్పుడూ కుదరలేదు. ప్రతిసారీ ఏదో ఒక చిన్న అడ్డంకి వస్తుండేది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయన 'నువ్వే నువ్వే' సినిమా తీయకముందు నుంచీ, నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఇదెందుకు కుదరడం లేదు... కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగల మంచి మిత్రులం అని చాలా సార్లు నేను అనుకున్నా.
నాతో పాటు అభిమాన సోదరులు కూడా అనుకున్నారు.. ఇదెందుకు జరగడం లేదని... నీ జీవితంలో నెల క్రితం జరిగిన ఘటనకు ఇది చాలా ముడి పడి ఉందేమో.. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే.. బహుశా నెల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ వల్లే బహుశా.. జీవితం విలువ నాకు అర్థమైంది. ఈ సినిమా తాత్పర్యం ఒకటే... ఆడిదైన రోజు ఎవరైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపిన వాడే మగాడు, వాడే మొనగాడు. మనం జీవితంలో చాలా మందితో తెలిసో , తెలియకో చాలా బాధలు, చాలా గొడవలు ఉంటాయి.
కానీ జీవితం అంటే.. కొట్టుకోవడం, తిట్టుకోవడం కాదు.. జీవితమంటే బతకడం. ఎలా బతకాలో చెప్పే సినిమా 'అరవింద సమేత.. వీరరాఘవ'. మనిషిగా పుట్టినందుకు ఎలా హుందాగా ఉండాలో, మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో, మనిషిగా పుట్టినందుకు .. మనిషిగా బతకాలో చెప్పేదే 'అరవింద సమేత వీరరాఘవ'. ఈ టైటిల్ పెట్టినప్పుడు టైటిల్ పవర్‌ఫుల్‌గా లేదని చాలా మంది అనుకున్నారు.
ఒక మగాడి పక్కన ఓ ఆడదానికన్నా బలం ఇంకేదీ ఉండదు. ఒక గొప్ప నాతో చేయాలంటే, జీవితం విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఈ రోజు ఆయనతో సినిమా చేయించాడేమో.. చాలా థాంక్స్ స్వామీ (త్రివిక్రమ్). అంటే 12 ఏళ్లు ఆయనలో ఓ స్నేహితుడిని, ఓ దర్శకుడినీ చూశా. ఈ సినిమా పూర్తయ్యేలోపు ఓ ఆత్మబంధువును చూశా. రేప్పొద్దున నాకు ఎలాంటి కష్టం వచ్చినా, నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా, మీ అందరితో పాటు నిలుచునే వాడే మా త్రివిక్రమ్. థాంక్స్ ఎలాట్ స్వామీ.. ఈ సినిమా నా జీవితంలో తప్పకుండా ఓ మైలురాయిలా నిలిచిపోతుందని అభిమాన సోదరుల ముఖంగా చెబుతున్నాను.
ఇప్పటిదాకా ఈ మాటను నేను చెప్పలేదు. ఇది నా 28వ చిత్రం. 27 సినిమాల్లో ఎప్పుడూ చిత్రంలో తండ్రికి చితి అంటించే సీన్‌ను ఏ దర్శకుడూ పెట్టేలేదు. కానీ ఈ సినిమాలో మరి యాదృచ్ఛికమో, మరి అలా జరిగిందో తెలియదు. మనం అనుకునేది ఒకటీ.. పైన వాడు రాసేది ఒకటి అని అంటారు కదా.. ఈ నెల రోజులు నాకో అన్నలాగా, నాకు తండ్రిలాగా, నాకు మిత్రుడిలాగా నాకు తోడుగా ఉన్నారు త్రివిక్రమ్. ఆయనకు చాలా థాంక్స్. కొన్ని బంధాలు కలిసినప్పుడు సక్సెస్‌ఫుల్‌గా వాళ్లు చేసిన ప్రయత్నం ఉంటే, ఆ బంధం కొనసాగుతుందని అంటారు.
ఈ బంధాన్ని మా నాన్నగారు పై నుంచి చూస్తున్నారు. ఈ బంధాన్ని ఆయన సక్సెస్ఫుల్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు తమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరక్టర్ ఎలా చేసేవాడనే ఊహ కూడా నాకు అందడం లేదు. అంటే.. మీ అందరికీ తమన్ కేవలం వాయిద్యాలు వాయించాడని అనిపించవచ్చు. కానీ, తమన్ తన ప్రాణం పెట్టాడు ఈ సినిమాకు. చాలా మంది ఈ సినిమా ఆడియో విడుదల అయినప్పుడు.. ఎన్టీఆర్ మాస్ హీరో కదా.. డ్యాన్సులు ఉండే పాటలు లేవేంటని అన్నారు.
అందరికీ నేను చెప్పేది ఒకటే. డ్యాన్సర్ కన్నా ముందు నేను ఓ నటుడిని. నటనలో భాగమే డ్యాన్స్ తప్ప, డ్యాన్స్ లో భాగం నటన కాదు. అలాంటి ఒక నటుడి కోసం ఆయన రాసిన సినిమాకు పూర్తిగా తమన్ తప్ప, వేరే ఎవడూ న్యాయం చేయలేరని నేను సభా ముఖంగా చెబుతున్నాను. అహర్నిశలూ తను ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. మీ అందరికీ ఏం కావాలో ఆయనకు (త్రివిక్రమ్)కి తెలుసు. ఆయనకు ఏం కావలో తమన్‌కి తెలుసు. అందుకోసం తనెంత తపన పడ్డాడో నాకు తెలుసు. ఈ సినిమాకు సంగీతపరంగా ప్రాణం పోసినందుకు తమన్‌కి థాంక్స్. ఈ సినిమాలో ప్రతి పాటా ఒక సీన్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి పాటా ఓ సందేశాన్ని. చిత్రం యొక్క సన్నివేశాలను తెలుపుతుంది. అలాంటి పాటలను డిజైన్ చేసినందుకు త్రివిక్రమ్‌గారికి, చేసినందుకు తమన్‌కి, రాసినందుకు గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి, నాకు అత్యంత ఇష్టమైన రామజోగయ్యశాస్త్రిగారికి ధన్యవాదాలు.
త్రివిక్రమ్‌కీ, నాకూ మధ్య ఫ్రెండ్షిప్కి ఓ పిల్లర్. ఆ పిల్లర్ మా అరవింద సమేత సినిమా కాదు, వేదిక కాదు.. ఇంకేదో కాదు. రాధాకృష్ణగారు. ఓ సినిమా గురించి ఓ నిర్మాత పడే తాపత్రయాన్ని నేను ఆయనలో చూశాను. నేను డబ్బులు పెట్టేశాను కదా, సినిమా తీసేశాను కదా, దాన్ని అమ్మేశాను కదా.. అని కాకుండా, ఆ ఆలోచనలన్నీ పక్కనపెట్టి సినిమాను ఎలా తీయాలి? సినిమా ఎంత బాగా రావాలి? అని అనలైజ్ చేసే చాలా తక్కువ మంది నిర్మాతల్లో రాధాకృష్ణగారు ఒకరు. ఈ సినిమా చాలా బాగా రావడానికి ఆయన కూడా ఒకరు. సితార, దేవయాని, నాగబాబు, శుభలేఖ సుధాకర్, రావు రమేశ్, పూజా, ఈషా.. ఇలా ప్రతి ఒక్కరికీ థాంక్స్. వాళ్ల ప్రాణం పెట్టి ఈ సినిమాకు పనిచేశారు. ఈసినిమాకు ఇంత ఎనర్జీని తెచ్చినందుకు వాళ్లతో పాటు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మా బాబు... జగపతిబాబు ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర రేపొద్దున సినిమా విడుదలైన తర్వాత అర్థమవుతుంది. జగపతిబాబుగారు లేకపోతే, అరవింద సమేత వీరరాఘవ లేదు. గొప్ప కథానాయకుడిని గురించి చెప్పాలంటే, గొప్ప ప్రతి కథానాయకుడిని చూడాలి. జగపతిబాబును పొద్దున చూస్తే రాత్రి కల్లోకి వచ్చేస్తారని మా సునీల్ చెప్పారు.
నేను బాబుకు చాలా బాగా కనెక్ట్ అయ్యా. కానీ అరవింద సమేత వీరరాఘవ చూసినప్పుడు మా అరవింద సమేతకు మరో పిల్లర్ నవీన్ చంద్ర అని అంటారు. అంత బాగా చేశాడు. నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకుని ఉన్నాను. అంటే వాటిని ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో కూడా తెలియదు. మేమిద్దరం మాట్లాడటం మానేసిన కారణం ఏంటంటే.. ఇలాంటి విషయాల్లో మనిషి బతికున్నప్పుడు విలువ తెలియదు. మనిషి పోయాక విలువ తెలుసుకోవాలంటే, మనిషి మన మధ్య ఉండడు. తన తండ్రికి అంతకన్నా అద్భుతమైన కొడుకు ఉండడు. కొడుక్కి అంత కన్నా అద్భుతమైన తండ్రి ఉండడు.
ఒక భార్యకి అంతకన్నా అద్భుతమైన భర్త ఉండడు. మనవడికి, మనవరాలికి అంతకన్నా అద్భుతమైన తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్ని సార్లో నాకు, మా అన్నకు చెప్పాడో నాకు తెలుసు.. `నాన్నా.. మనమేదో చాలా గొప్పవాళ్లం అని కాదు. ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను. నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని మోసుకెళ్లేది అభిమానులే.
బ్రతికున్నంత వరకు..'నాన్నా అభిమానులు జాగ్రత్త. మనం వాళ్లకు ఏం చేయకపోయినా.. వాళ్లు మనకు ఏం చేస్తున్నారో.. నాకు తెలుసు. నాన్నా.. అభిమానులు జాగ్రత్త' అని చాలా సార్లు అనేవారు. ఈ ఒక్క సినిమాకు ఆయన ఉండి ఉంటే బావుండేది. మనకు ఆయన అవసరం ఎంతుందో కానీ, పైన ఆయనకు (ఎన్టీఆర్)కు ఆయన (హరికృష్ణ) అవసరం ఎంత ఉందో తెలియదు మరి.
చాలా సార్లు ఆడియో వేడుకల్లో తాతగారి బొమ్మను చూసేవాడిని. కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, అభిమానులు అందరి గుండెల్లో, అందరి ముఖాల్లో ఆయన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటనే మీ అందరికీ ఇస్తున్నాను ఈ రోజు. మా జీవితం మీకు (అభిమానులకు) అంకితం. `` అని అన్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``త్రివిక్రమ్‌గారితో తమ్ముడి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రాబోతుందని మీలాగానే నేను కూడా ఎదురుచూశాను. అదే అరవింద సమేత. అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుతమైన నటుడు, అద్భుతమైన దర్శకుడు కలిస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని చిన్న మచ్చుకు ట్రైలర్ చూపిస్తుంది. ట్రైలర్ అదిరిపోయింది. ఒక నెల క్రితం ఓ ఘటన జరిగింది. అది జరిగినప్పుడు చాలా మంది సినిమా అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అవుతుందేమోనని అనుకున్నారు. అది గుర్తుకు వచ్చనప్పుడల్లా నాన్నగారు మాకు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను.
అవేంటంటే.. 1962లో మేకప్ వేసుకు వెళ్లిన మా తాతగారు.. మన అందరి అన్నగారు ఓ అశుభవార్త వినాల్సి వచ్చింది. ఆయన పెద్దకొడుకు.. మా పెద్దనాన్న నందమూరి రామకృష్ణగారు కాలం చెందారని తెలిసింది. అది జరిగినప్పుడు ఏ తండ్రి తట్టుకోలేడు. కానీ.. ఆయన మేకప్ వేసుకుని లొకేషన్లో ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్‌కి నష్టం రాకూడదని రోజంతా షూటింగ్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఏ తండ్రి అయినా చేతికి వచ్చిన కొడుకు కాలం చెందారని తెలిస్తే .. ఉంటారా? కానీ మా తాతగారు అంత గొప్ప వ్యక్తి. అదే వృత్తిధర్మం. 1976 మా ముత్తాతగారు లక్ష్మయ్యచౌదరిగారు కాలం చెందారు.
అప్పుడు కూడా తాతగారు వృత్తికి గౌరవమిచ్చి.. ప్రొడ్యూసర్‌కి విలువ ఇచ్చి ఆరోజు షూటింగ్ పూర్తి చేసుకునే వెళ్లారు. 1982లో మా బాలయ్యబాబాయ్ పెళ్లి, రామకృష్ణ బాబాయ్ పెళ్లి. వాళ్ల పెళ్లి జరుగుతుంటే.. నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రచారంలో ఉండి పెళ్లికి కూడా అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆయన ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. దాన్ని వృత్తిగా భావించారు. ఎవరైనా సొంత కొడుకుల పెళ్లికి వెళ్లకుండా ఉంటారా? అంటే అది ఆయన వర్క్‌కి ఇచ్చిన రెస్పెక్ట్. అలాగే అమ్మకు ఇచ్చిన మాట కోసం వాళ్ల నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్న నాన్నగారు.. ఓ ఆఫీస్ బాయ్‌లా.. ఓ డ్రైవర్‌గా.. చైతన్య రథసారథిగా ఆయన వెన్నంటే ఉండి కొడుకు కర్తవ్యాన్ని నేరవేర్చారు.
ఆగస్ట్ 29 2018, మా ఇంట్లో కూడా బాధాకరమైన ఘటన జరిగింది. అప్పటికి అరవింద సమేత 30 రోజుల షూటింగ్ ఉంది. పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు కానీ.. ప్రొడ్యూసర్ బావుండాలి. మనం ఇచ్చిన మాట నిలబడాలని తమ్ముడు ఐదో రోజునే షూటింగ్ వెళ్లాడు. నాన్‌స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్లో పాల్గొన్నాడు. "నాన్నా.. నువ్వెక్కడి వెళ్లలేదు. మా గుండెల్లోనే ఉన్నావు. నువ్వు నేర్పించిన విషయాలు ప్రొడ్యూసర్ బావుండాలి. వృత్తి పట్ల ఇంట్రెస్ట్ కోల్పోకుండా ఉండాలని చెప్పిన దోవలోనే నేను కానీ.. తమ్ముడి కానీ ఉంటాం. నువ్వు మా మనసుల్లోనే ఉంటావు. స్వర్గానికి ఎక్కడికీ వెళ్లవ్. మా చుట్టూనే ఉంటావ్. ఈ ఫంక్షన్లో అభిమానుల రూపంలో చూస్తూ అనందిస్తున్నావ్"
నా తమ్ముడు ఉండగా సినిమా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను`` అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - "కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కన్నా మాట్లాడకుండా ఉండటం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజు అలాంటి సందర్భం. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల చాలా మంది ఇక్కడికి రాలేకపోయారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చాలని ఆశిస్తున్నా. నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ సినిమా సమయంలో అతి పెద్ద విషాదం జరిగినా, దాన్నుంచి త్వరగా కోలుకుని, జీవితంలోనూ హీరో అని ప్రూవ్ చేసుకున్న నందమూరి తారక రామారావుగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నా ప్రేమ, నా అభినందనలు" అని అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ "నేను గేటు ముందు అభిమానుల మధ్యలో గంటన్నర సేపు ఉన్నా. వాళ్ల మధ్య ఓ ఫ్యాన్‌గా ఉండటం చాలా ఆనందంగా అనిపించింది. వాళ్లేమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. సెల్ఫీలు తీసుకున్నారు. వారిలో ఒకరైతే 'నాకు లోపల తెలిసిన వాళ్లున్నారు సార్. నేను ఫోన్ చేస్తాను. మీరు లోపలికి వెళ్దురుగానీ..` అని అన్నారు. మా అమ్మకు ఫోన్ చేస్తే 'అంత మంది మధ్యలో నిన్ను చూడాలని ఉంది' అని ముచ్చటపడ్డారు. చాలా ముచ్చట్ల మధ్య ఇక్కడికి వచ్చాను. కల్యాణ్ రామ్ స్పీచ్ విని హెవీ అయ్యాను. భైరవ పెనిమిటి పాటను చాలా బాగా పాడాడు. హెవీగా అనిపించింది. 'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టా ఉంటాదో తెలిస్తా...' అనే డైలాగ్ వినండి.
మీకు తెలియకపోతే అరవిందరెడ్డిని సినిమాలో చూసి తెలుసుకోండి. తారక్ సిక్స్ ప్యాక్ బాడీ చూసి మగాడంటే వీడురా బుజ్జీ అని అనిపించాడు. తనతో నాకు ఫస్ట్ ఫైట్‌తో స్టార్ట్ అయింది. ఓ సందర్భంలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు. నేను నా కొడుక్కి చెప్పే డైలాగ్ అది.. 'ఆ పొద్దు వాణ్ణి చూసినప్పుడు చావు చొక్కాలేకుండా తిరగాడినట్టుంది బాల్‌రెడ్డి' అని. చావు చొక్కాలేకుండా తిరగాడటమేంటి... వాట్ ఈజ్ దట్ శీను... టూ మచ్. తారక్ అభిమానులందరూ ఉడుకు రక్తం కాబట్టి, తారక్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి త్వరగా ముగిస్తాను. మా దర్శకుడు త్రివిక్రమ్‌తో పనిచేయాలని ఎప్పటి నుంచో నాకూ ఆశగానే ఉంది. నేను ఈ సినిమాలో ఉండాలనేది తారక్ ఐడియా. తారక్ చెబితే త్రివిక్రమ్ పెట్టుకున్నాడు.
త్రివిక్రమ్ ఈ సినిమాను కచ్చి, కసి, ఉరుకుతున్న రక్తంతో తీశాడు. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టూ అద్భుతంగా తీశారు. మా శీను ఈజ్ బ్యాక్. తను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు. తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలతో తమన్ మీద రెస్పెక్ట్ పెరిగింది. అందరు ఆర్టిస్టులకీ ఆల్ ది బెస్ట్. సునీల్‌కి మంచి పాత్ర ఇచ్చారు. సినిమా ఎట్టాగైనా ఇరగొట్టేస్తుంది. ఈ సినిమాలో చేసిన ట్రావెల్, శీను తీసిన పద్ధతి వేరే రేంజ్లో ఉంది. వినోద్ కెమెరా వర్క్ వేరేగా ఉంది. ఈ ట్రావెల్లో శీను, తారక్ చేసిన అల్లరి, చూపించిన ప్రేమ గ్రేట్. ప్రతి రోజూ సాయంత్రం నా పక్క రూమ్‌లో ఉన్నారు.
వాళ్లు లేకపోయినా నేను వాళ్ల రూమ్‌కి వెళ్లాను. గొడుగు పట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు తారక్ సెట్‌కి. పక్కన ఎవరూ ఉండరు. అంత పెద్ద హీరో అలా ఉండాలి. సునీల్ చెప్పినట్టు తను లేచి కుర్చీ ఇస్తాడు ఎవరికైనా. నేను తారక్ కన్నా చాలా పెద్ద వాడిని. కానీ ప్రతి విషయంలో బాబు తిన్నాడా.. బాబు పడుకున్నాడా.. బాబు కారు వచ్చిందా.. అని నన్ను చిన్న పిల్లాడిలాగా చూసుకున్నాడు తారక్. 11న విడుదలవుతుంది. నాకిష్టమైన నిర్మాతలకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి" అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ - "అన్నయ్య సినిమా అంటే ఆ ప్రేమ, ఆ పనే వేరు.. బృందావనం అయినా, బాద్షా అయినా, రభస అయినా.. ఏదైనా నా ప్రేమను నేను మ్యూజిక్‌తోనే చూపిస్తా. నాకు మాటలు రావు. అందుకే సంగీతంతో చూపిస్తా. అన్నయ్యతో సినిమా చేస్తుంటే నేను నిద్రలో కూడా ఇంకేం బెస్ట్ గా చేయగలను అనే అనుకుంటా. త్రివిక్రమ్‌గారి సినిమా చేయడం అనేది కల నెరవేరినట్టుంది. నేను మ్యూజిక్ చేయలేదు. ఆయన మాటలకు మర్యాద ఇచ్చానంతే.
ఆయన పాటలు, ఆయన మాటలకు నేను గౌరవం ఇచ్చానంతే. ఆయన మాటలతో ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేను. సీతారామయ్యశాస్త్రిగారు, రామజోగయ్యశాస్త్రిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. శివమణి నాకోసం ఇంతదూరం వచ్చారు. చెన్నై నుంచి 30 మంది వయొలిన్స్ ఇక్కడే ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇళయరాజాగారి దగ్గర, రెహమాన్‌గారి దగ్గర పనిచేసేవారిని ఈ సినిమా రీరికార్డింగ్ కోసం తీసుకొచ్చా. నా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. వాళ్లు నాకు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. రేపు ఇదే ఎనర్జీ రీరికార్డింగ్‌లోనూ ఉంటుంది" అని అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - "కొన్నిసినిమాలు అనౌన్స్ మెంట్ అయినప్పటి నుంచీ ఎగ్జయిట్మెంట్ ఉంటుంది. త్రివిక్రమ్‌గారు, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మనకు ఈ సినిమా అనౌన్స్ కావడం చాలా బావుంది. పాటలు వినేకొద్దీ చాలా బావున్నాయి. వినేకొద్దీ వినాలనిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌గారి కాంబినేషన్లో, తమన్ తొలిసారి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. సినిమా రంగంలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు కామన్.
కానీ ఎన్టీఆర్ టెంపర్ నుంచి తన రూట్‌ను మార్చారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్, ఆ తర్వాత మరో సినిమా.. ఇలా సినిమా సినిమాకూ అద్భుతమైన వేరియేషన్ ఇస్తున్నాడు. ఇలా అద్భుతమైన వేరియేషన్స్ చూపిస్తున్న తారక్ సూపర్. గతంలో నందమూరి తారక రామారావుగారు చాలా బాగా ఇలాంటి వేరియేషన్స్ చేసేవారు.
ఇప్పుడు ఎన్టీఆర్ కొనసాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను అమృతతో ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఒకమాట అన్నారు..'బాలు కిందకు పడిందంటే పైకి రావడానికే' అని. త్రివిక్రమ్ చాలా పెద్ద సక్సెస్ఫుల్ డైరక్టర్. ఈ సినిమాతో ఆయన మళ్లీ అన్నీ వేరియేషన్స్ చూపించి, ఇరగ్గొట్టబోతున్నారు. త్రివిక్రమ్‌గారు నాకు బిగినింగ్ డేస్ నుంచి ఇన్స్పిరేషన్. 11న ఈ సినిమా ఇరగదీసేలా ఉండాలి. మనందరికీ ఇరగదీసే సినిమా కావాలి" అని అన్నారు.
శివమణి మాట్లాడుతూ "తమన్ ఫాదర్ పెద్ద డ్రమ్మర్. ఆయన టాలెంట్ కంపోజర్. చాలా జీనియస్. ఈ సినిమాకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గుడ్‌లక్" అని అన్నారు.
సునీల్ మాట్లాడుతూ "నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశా. సినిమా అంతా ఉంటా. జీవితంలో అమ్మా నాన్న మనకి ఓపిగ్గా పెంచి, ఇది మంచి, ఇది చెడు అని చెబుతారు. ఎప్పుడైనా డబ్బులు లేకపోతే అన్నయ్యలు డబ్బులిచ్చి బాగా చూస్తారు. అలా అందరూ బాగా చూసిన తర్వాత, నేను హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకున్నది త్రివిక్రమ్. డబ్బులు, విజ్ఞానం, తెలివి ఇచ్చింది త్రివిక్రమ్. తనకి ఆనందం ఉంటుంది. మన సక్సెస్ మన ఫ్రెండ్స్ కి ఎక్కువ ఆనందాన్నిస్తుంది.
నేను ఎన్ని వేషాలు వేసినా.. నాకు ఫైనల్‌గా మంచి వేషం రాయడానికి త్రివిక్రమ్ ఉన్నాడన్నది నా ధైర్యం. మనకు చాలా సక్సెస్ఫుల్ పీపుల్, పేరున్న వారు కనిపిస్తారు. అయితే మనసుతో మనల్ని దగ్గరకు తీసుకునేవారు తక్కువమంది ఉంటారు. ఆయన షూటింగ్‌కి లేచి వెళ్తూ.. 'ఆ కూర్చో' అని తన కుర్చీ కూడా అవతలికి ఇచ్చేస్తారు ఎన్టీఆర్. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేయాలని కలలు కన్న వారిలో నేను ఒకడిని. ఈ సినిమాలో జగపతిబాబుగారిని చూసి ఇంటికి వచ్చాక, మళ్లీ పడుకుంటే జగపతిబాబుగారు కల్లో కొస్తే భయం వేస్తుంది. అంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది సినిమాలో. నేను డబ్బింగ్లో చాలా వరకు సినిమా చూశా. తప్పకుండా హిట్ అవుతుంది" అని అన్నారు.
ఈషా మాట్లాడుతూ "నాకు చాలా టెన్షన్‌గా ఉంది. గేటు దగ్గర అర్ధగంట నన్ను ఆపేశారు రానివ్వకుండా. ఎన్టీఆర్‌గారి ఫ్యాన్స్ చూశాను. వాళ్లకు నేను పెద్ద ఫ్యాన్‌ని. వాళ్లంటే నాకు ప్రేమ. ఈ సినిమాలో ఒక పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. జూ.ఎన్టీఆర్‌గారి పక్కన చేయడం అంత మామూలైన విషయం కాదు.. అది నాక్కూడా తెలుసు. ఆయన సెట్స్ లో ఉన్నప్పుడు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అది పక్కనున్న నటీనటులకు కూడా పాస్ అవుతుంది. ఈ సినిమాతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషపడ్డారు.
తెలుగమ్మాయికి త్రివిక్రమ్‌గారు అవకాశం ఇచ్చానని. అందరితో తెలుగులో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానిని. ఫ్యాన్స్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. తమన్‌గారు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. అన్ని పాటలు చాలా బాగా నచ్చాయి. అందరి ట్వీట్లు, మెసేజ్‌లు చూశాను. అందరూ ఫస్ట్ డే ఫస్ట్ డే చూసి, తప్పకుండా ఎనర్జీ పొందుతారు. చినబాబుగారికి ధన్యావాదాలు. అక్టోబర్ 11ను ఎవరూ మర్చిపోవద్దు" అని అన్నారు.
సీతారామశాస్త్రి మాట్లాడుతూ - "ఈ సినిమాలో నేను రెండు పాటలు రాశాను.. రామజోగయ్య శాస్త్రి రెండు పాటలు రాశాడు. అందులో తొలిసాంగ్ రం రుధిరం అంటూ ఇన్టెన్స్గా సాగుతుంది. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అద్భుతమైన నటుడు. మెరుపు తీగలా డాన్స్ మాత్రమే చేయడం కాదు.. ఎలాంటి పాత్రనైనా చేయగలనని మరోసారి ఈ చిత్రంతో నిరూపిస్తాడు. తమన్ అద్బుతమైన బాణీలతో పాటు నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ "కొన్ని పాటలు మన పేరు మీద రాసి పెట్టబడి ఉంటాయి. అలాంటి మంచి పాట `పెనిమిటి` పాట. మంచి పాట రాశాననే సంతృప్తి నాకు ఎప్పుడూ ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో అది నాకు ఎప్పుడూ తీరుతూనే ఉంటుంది. నా ప్రియ తమ్ముడు ఎన్టీఆర్, మా ప్రియతముడు త్రివిక్రముడు కలిసి చేస్తున్న ఈ సినిమా ఓ శాంతి సందేశాన్ని అందిస్తున్నట్టు ఉంది. తమన్‌తో ఎప్పుడు కలిసి పనిచేసినా ఎగ్జయిట్మెంట్ అతని కళ్లల్లో నాకు కనిపించింది.మా నిర్మాత చినబాబుకు నేనంటే అభిమానం. ఆయన నిర్మించే ఈ సినిమాలో పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. 11న భూమి బద్ధలు అవుతుందని ఎదురుచూస్తున్నా. మా స్వామీ ఈజ్ టు బ్యాక్ రాక్ అగైన్" అని అన్నారు.
కాలభైరవ మాట్లాడుతూ "నేను తారక్‌కి పెద్ద ఫ్యాన్‌ని. నన్ను అభిమానులు ఎవరూ బీట్ చేయలేరు. తారక్ అన్నకి పాట ఎప్పుడు పాడుతావని చాలా మంది నన్ను అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అది సాధ్యమైంది. ఈ పాటను నేను అభిమానులకు అంకితం చేస్తున్నాను" అని అన్నారు.
భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా అనుకున్నప్పుడే తెలిసింది బడ్జెట్ అవుతుందని. వీళ్లందరి గురించి నాకు తెలుసు. ట్రైలర్ చూస్తుంటే ఇది కదా సినిమా అని అనిపించింది" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com