Pawan Kalyan:ఇప్పుడు తెలంగాణలో పోరాడే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్‌

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలను, గూండాలను ఎదుర్కొంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన టీ అభ్యర్థి సురేందర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని.. అందుకు జనసేన అండగా ఉంటుందన్నారు.

ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటావ్.. మరోసారి బీజేపీతో ఉంటావ్... ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతావ్.. అసలు నీది ఏ ఇజం అని చాలామంది అంటుంటారన్నారు. అయితే తనది హ్యూమనిజమని స్పష్టంచేశారు. సోషలిజం, సనాతన ధర్మం రెండు కలిస్తే జనసేన అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కీర్తించిన దాశరథి కృష్ణమాచార్య గారు ఒకవైపు ఎర్ర జెండా పట్టి మరోవైపు వేదాలను తెలుగులోకి అనువదించిన వ్యక్తి అని.. ఆయనే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ సభలో తాను బీఆర్ఎస్ పార్టీని విమర్శించలేదని అంటున్నారని.. ఆంధ్రాలో లాగా ఇక్కడ పూర్తి స్థాయిలో తాను తిరగలేదని.. అందుకే తాను మాట్లాడలేదని గుర్తుచేశారు. కానీ జనసైనికులు, వీర మహిళలు పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. ఇప్పుడు అడిగే రోజు.. పోరాడే రోజు వచ్చిందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 65 మంది సీఎంలు వస్తే.. 25 మంది బీసీలేనని అన్నారు. తెలంగాణలో జనసేన-బీజేపీ కూటమిని గెలిపించి బీసీ వ్యక్తిని సీఎంగా చేసుకుందామని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గద్దర్‌ను గుర్తు చేసుకుంటూ గద్దరన్న చనిపోయే ముందు తెలంగాణలో యువతకు అండగా ఉండాలని కోరారని.. గద్దరన్న ఆశయం కోసం నిలబడతానని పవన్ కల్యాణ్‌ మాట ఇచ్చారు.