చిన్నారులను బైకుపై తిప్పుతున్నారా.. కొత్త రూల్ తెలుసా..?

  • IndiaGlitz, [Thursday,February 17 2022]

చిన్నారులను బైకులపై ఎక్కించుకుని ఊరంతా తిప్పుతున్నారా.. అయితే ఇకపై ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లల్ని బండిపై తిప్పితే చిక్కుల్లో పడాల్సిందే. రోడ్డు ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులకు భద్రత కల్పించేందుకు వీలుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు వెలువరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ప్రకారం.. ఇకపై నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్‌పై తీసుకెళ్తే వారికి కూడా హెల్మెట్‌ పెట్టాలని కేంద్రం తేల్చిచెప్పింది. అంతేకాదు... బైక్‌ నడిపే వారికి, చిన్నారులకు మధ్య సేఫ్టీ హార్నెస్‌ ( బెల్ట్‌ లాంటిది) ఉండాలని ఆదేశించింది.

తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారులను బైక్‌పై తీసుకెళ్తే.. వారికి క్రాష్‌ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని వెల్లడించింది. బైక్‌పై పిల్లలు ఉన్నప్పుడు స్పీడ్‌ 40 కేఎంపీహెచ్‌కు మించరాదని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2023 ఫిబ్రవరి 15 నుంచి అమల్లో వస్తాయని కేంద్రం పేర్కొంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవర్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. కొత్త మార్గదర్శకాలకు సంబంధించి గతేడాది అక్టోబరులోనే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిపై ప్రజల నుంచి అభ్యంరాలు, సలహాలు, సూచనలు సేకరించిన అనంతరం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

అలాగే నాలుగేళ్ల లోపు చిన్నారులకు సైతం ప్రత్యేకంగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్‌ తయారీదారులను కేంద్రం ఆదేశించింది. అప్పటిదాకా సైకిళ్లపై ఉపయోగించే హెల్మెట్లను పిల్లలకు పెట్టాలని సూచించింది. ఇకపోతే.. ఆర్గోన్‌, నైట్రోజెన్‌, ఆక్సిజన్‌ వంటి ప్రమాదకర వాయువులు లేదా రసాయనాలను రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ డివైజ్‌ను అమర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిపై 30 రోజుల్లోగా ప్రజలు తమ సూచనలు, సలహాలు తెలియజేయాలి అని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.