Election Notification: ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..

  • IndiaGlitz, [Thursday,April 18 2024]

దేశవ్యాప్తంగా నాలుగో విడత స్వారత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడతలో తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుంది. దీంతో ఏపీలోని అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు, తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. సెలవు రోజుల్లో నామినేష్లను స్వీకరించరు. గురువారం మంచి రోజు కావడంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఈనెల 25 వరకు స్వీకరణ చేపట్టి.. 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తదుపరి అభ్యర్థుల మధ్య మే 13న పోలింగ్ నిర్వహించి.. జూన్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది.

నామినేషన్లు వేసేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించనున్నారు. అలాగే నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు, హడావిడి లేకుండా అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేయొచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, అప్పులు, కేసుల వివరాలు ప్రకటించాలి. ఇక ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు ప్రతి అభ్యర్థికి బీఫాం ఇస్తాయి. ఈ బీఫాంను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. స్వతంత్ర్య అభ్యర్థులకు ఎలాంటి బీఫాంలు ఉండవు.

మరోవైపు ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చును నేటి నుంచి పరిగణనలోకి తీసుకోనున్నారు. దీని కోసం నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా అధికారులు అభ్యర్థి ఖర్చును లెక్కిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 40 లక్షల వరకు, ఎంపీ అభ్యర్థి రూ. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వీలుంది. కాగా నాలుగో దశలో భాగంగా ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.