‘కేజీఎఫ్-2’ టీజర్: హీరో, దర్శకనిర్మాతలకు నోటీసులు

‘కేజీఎఫ్-2’ టీజర్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ‘కేజీఎఫ్ 2’ కథ ఎవరి ఊహకూ అందకపోవడం విశేషం. ‘అధీర’ ఎలా బతికున్నాడు? అనేది ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే దానికంటే కూడా ఫేమస్ అవుతోంది. దీంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ నెట్టింట్లో సెన్సేషన్‌గా మారింది.

టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేసేసింది. రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో 25 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక, లైక్స్ విషయంలో అయితే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీనిని బట్టి ‘కేజీఎఫ్ 2’ విషయంలో ప్రేక్షకులు ఎంతటి ఆసక్తిని కనబరుస్తున్నారనే విషయం అర్థమవుతోంది. అయితే ఈ టీజర్ ఇప్పుడు హీరో, దర్శక నిర్మాతలకు నోటీసులు అందేలా చేసింది.

‘కేజీఎఫ్-2’ టీజర్‌కు సంబంధించి తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్, నిర్మాత నోటీసులు అందుకున్నారని సమాచారం. కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ ఈ నోటీసులు పంపించిందట. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశమేనని తెలుస్తోంది. టీజర్ చివర్లో హీరో యశ్ గన్‌తో వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు ‘యాంటీ స్మోకింగ్ వార్నింగ్’ వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమని సమాచారం. మరి ఈ నోటీసులకు వారు ఎలా స్పందిస్తారో చూడాలి.