రజినీ సర్.. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు: కుష్బూ

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందించారు. ఆయన ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలని పేర్కొంటూ కుష్బూ ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల రజినీ రాజకీయ ఆరంగేట్రం గురించి ఇటీవల ఓ లేఖ వైరల్ అయింది. రజినీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని.. ఆయన ఆరోగ్య పరిస్థితి రిత్యా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రజినీ కూడా స్పందించారు. ఆ లేఖ తను రాసింది కాదని.. కానీ తన ఆరోగ్యం గురించి లేఖలో రాసిందంతా కూడా కరెక్టేనని స్పష్టం చేశారు.

రజినీ పేరిట వచ్చిన లేఖలో.. 2011లో ఆయన కిడ్నీ వ్యాధి బారిన పడ్డారని.. దీంతో ఆయన సింగపూర్‌లో వైద్యం చేయించుకున్నారని వెల్లడించారు. అయితే 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో అమెరికాలో చికిత్స తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున.. కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజినీ బయట తిరిగే పరిస్థితి లేదని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని.. కిడ్నీ మార్పిడితో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయిందని.. బహిరంగ సభల్లో పాల్గొనడం వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉందని.. అది ఆయన ప్రాణాలకే ముప్పు అనేది ఆ లేఖ సారాంశం.

తన అనారోగ్యానికి సంబంధించి లేఖలో పేర్కొన్నవన్నీ నిజమేనని రజినీయే స్వయంగా అంగీకరించారు. దీంతో కుష్బూ.. రజినీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ప్రియమైన రజినీకాంత్ సర్. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీరు మాకు అత్యంత విలువైన వ్యక్తి. మీరు మా ట్రెజర్. ఆరోగ్యపరంగానే కాకుండా.. ఇతర విషయాల పరంగా కూడా మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. మీ పట్ల మాకున్న ప్రేమలో ఎటువంటి మార్పూ ఉండదు. మా జీవితాంతం మేము మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.