కోడెలే కాదు చంద్రబాబు కూడా సర్కార్‌ సొమ్ము దాచిపెట్టారు!

  • IndiaGlitz, [Friday,August 23 2019]

గత మూడ్రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను సొంత పనులకు వాడుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత ఆయన స్పందించి అవును.. తన దగ్గరే ఉన్నాయని అవసరమైతే పంపిస్తా లేకుంటే డబ్బులు కట్టిస్తానని కూడా చెప్పారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో.. సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి.. వరదలు, తన ఇల్లు మునిగిపోవడం ఇలా పలు విషయాలపై మాట్లాడారు. అనంతరం అనిల్ మీడియా ముందుకొచ్చి బాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దొంగ నాటకాలు బయటపడకుండా!

‘చంద్రబాబు ఆశీస్సులతోనే కోడెల అసెంబ్లీలో ఫర్నిచర్ దొంగతనానికి పాల్పడ్డారు. బాబు కూడా ప్రభుత్వ సొమ్మును కోడెల మాదిరిగా చాలా చోట్ల దాచి పెట్టారు. దొంగల ముఠా వ్యవహారం బయటపడకుండా చంద్రబాబు ప్రెస్‌మీట్ నాటకం ఆడారు. ఇప్పటికైనా ప్రజలు తనకు ఎందుకు ఓట్లు వేయలేదో సమీక్ష చేసుకుంటే మంచిది. కనీసం శేష జీవితంలో చంద్రబాబు కొంచెమైనా మరానని చెప్పుకోవాలి’ అని అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు

కరువు నాయకుడని తెలిసింది!

‘వరదలపై చంద్రబాబు మాట్లాడతారనుకుంటే రిజర్వాయర్‌లో కట్టుకున్న తన ఇళ్లు మునిగిందని మాట్లాడటం సబబు కాదు. వరదలు ప్రకృతి విపత్తు కాదు మానవ విపత్తు అంటూ... ఇక్కడా కూడా హైటెక్ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా నిండకపోవడంతో ఆయన కరువు నాయకుడని ప్రజలకు తెలిసిపోయింది’ అని అనిల్ చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని ఆయన.. రాయలసీమకు శ్రీశైలం నీళ్లు తరలించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. కృష్ణా డెల్టా రైతులకు ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు రావడం బాబుకు ఇష్టం లేదన్నారు. చంద్రబాబు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనిల్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.