Chiranjeevi: నంది అవార్డులు ఇవ్వకపోవడం బాధించింది: చిరంజీవి

  • IndiaGlitz, [Sunday,February 04 2024]

తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ఇస్తానని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25లక్షల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.

గద్దర్ పేరుతో అవార్డులు ఎంతో సముచితం..

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొంతకాలంగా నంది అవార్డులు గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తనను చాలా నిరుత్సాహపరిచిందని తెలిపారు. కానీ నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు. గద్దర్‌ అవార్డులను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవించిబడుతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పద్మభూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు ఆనందం పద్మవిభూషణ్ అప్పుడు రాలేదన్నారు. కానీ తోటి కళాకారులు, ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలిపినప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యానని తెలిపారు. అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళధ్వనుల ద్వారా లభించిందని.. అది చూసిన తర్వాత ఈ జన్మకు ఇది చాలు అనిపించిందని చిరు భావోద్వేగానికి గురయ్యారు.

దుర్భాషలతో రాజకీయాలు దిగజారిపోతున్నాయి..

ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హుందాగా రాజకీయాలు చేసేవారని కొనియాడారు. దివంగత ప్రధాని వాజ్‌పేయీకు ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. కానీ రాజకీయాల్లో రాను రాను దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలతో దిగజారపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల్లో మార్పు రావాలని వెంకయ్య తనతో చెప్పేవారని.. ఆ మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కానీ ఆ విమర్శల ధాటికి తట్టుకోలేకపోయానని.. అందుకే దూరంగా వచ్చానని తెలిపారు. దుర్భాషలాడే నేతలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయాలపై చిరు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు.

ఇండస్ట్రీకి చిరంజీవి మూడో కన్ను..

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు కళామా తల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే చిరంజీవి గారు మూడే కన్ను అని కొనియాడారు. నేను అవార్డులు పెద్దగా తీసుకోలేదని.. నాకు ఇష్టం ఉండదని.. కానీ ప్రధాని మోదీ ఒత్తిడి చేసి తీసుకోమంటే.. తీసుకున్నానని తెలిపారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని ప్రభుత్వం సన్మానించడం గొప్ప శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

బూతుల నేతలకు బూత్‌లో బుద్ధి చెప్పాలి..

జీవితంలో పట్టుదల ఉంటే ప్రతీ ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. రేవంత్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్నానని..ఎంతో చురుకుదనం, ఉత్సాహం అని వ్యక్తి అన్నారు. ఏదైనా తలుచుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించడని వెంకయ్య ప్రశంసించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని.. బూతులు మాట్లాడే నేతలకు బూత్‌లో సమాధానం చెప్పాలన్నారు.