ఒక్కటంటే ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు ఇక్కడ
- IndiaGlitz, [Friday,April 12 2019]
ఒడిశాలో మావోయిస్టులు మరో సారి తమ ప్రాభల్యాన్ని చాటుకున్నారు. మావోలు ఎన్నికలు బహిష్కరించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాన్ గిరి జిల్లాల్లోని చిత్ర కొండ, మధిల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. మావోయిస్టులకు భయపడి.... ఈ ప్రాంతాల్లో ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే సాహసం చేయలేకపోయారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సురేంద్ర కుమార్ వెల్లడించారు.
ఇక తమ గ్రామం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ కలహండి జిల్లా బెజిపదార్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించి నట్లు వెల్లడించారు. తమ గ్రామంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆ గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన ఎన్నికల్లో 66 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు ఎన్నికల అధికారి.