భద్రాద్రిలో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదు

  • IndiaGlitz, [Saturday,December 19 2020]

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. పండుగంతా భద్రాచలంలోనే ఉన్నట్టుటుంది. అంత వైభవంగా వైకుంఠ ఏకాదశి ఎక్కడా జరగదంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాంటిది ఈసారి కోవిడ్ కారణంగా భక్తులకు ఈ రెండు కార్యక్రమాలను స్వయంగా చూసే అవకాశం లేదు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మాత్రమే చూసే అవకాశం ఉంది. అయితే భక్తులకు మాత్రం దర్శనాలు యథావిధిగా జరగనున్నాయి.

ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.. సీతారాములు కొలువైన భద్రాచలంలోనూ.. అలాగే పర్ణశాల క్షేత్రములలో ఈ నెల 15 నుంచి జనవరి 4 వరకూ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 24న స్వామి వారి తెప్పోత్సవం, 25న ఉత్తర ద్వార దర్శనములను ఆంతరంగికముగా కేవలం వైదిక పెద్దలు, వేదపారాయణదారులు, అర్చక స్వాముల సమక్షంలో మాత్రమే నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.

ఆయా తేదీలలో కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా భక్తులను ఉచిత/శీఘ్ర దర్శనమునకు మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. కాబట్టి.. తెప్పోత్సవము, ఉత్తర ద్వార దర్శనములను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారము ద్వారా వీక్షించవచ్చని భక్తుల భద్రాద్రి ఆలయ కార్యనిర్వాహణాధికారి వెల్లడించారు. అలాగే దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. 10 సంవత్సరాల లోపు పిల్లలను, 65 సంవత్సరాలు పైబడిన పెద్దవారిని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని దర్శనానికి అనుమతించబోమని ఆలయ కమిటి వెల్లడించింది.