23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్: కేసీఆర్
- IndiaGlitz, [Monday,November 16 2020]
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను త్వరగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభంపై మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ తదితర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైందన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం దొరికిందన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ చిన్నచిన్న సమస్యలను అధిగమించిందన్నారు. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నదని కేసీఆర్ వెల్లడించారు.
ప్రస్తుతం సమస్యలన్నీ చక్కబడినందునే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిచుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సమస్యలను ఓ కొలిక్కి తెచ్చేందుకు కొద్ది రోజుల పాటు వేచి ఉన్నామని తెలిపారు. నవంబరు 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ర్టేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులను కేసీఆర్ అభినందించారు.