Nominations: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

  • IndiaGlitz, [Thursday,April 25 2024]

దేశంలో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లోని 96 లోక్‌స‌భ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు వేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో 175 అసెంబ్లీ స్థానాలకు 4, 210 నామినేషన్లు దాఖలు కాగా 25 పార్లమెంట్‌ స్థానాలకు 731 మంది నామినేషన్లు వేశారు. అటు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కంటోన్మెంట్ స్థానానికి 38 మంది నామినేషన్లు వేశారు. అలాగే పార్లమెంట్ స్థానాలకు మొత్తం 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది. ఏప్రిల్ 29 సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 11వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇక మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. కాగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందులలో నామినేషన్‌ వేయగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌స్థానంలో నామినేషన్లు వేశారు.