Nomination:ముగిసిన నామినేషన్ల ఘట్టం.. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.
రాష్ట్రం మొత్తమ్మీద గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 48 మంది, పాలేరు నియోజకవర్గంలో 37, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల పోటీలో నిలబడ్డారు. ఇక అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేట్ నియోజకవర్గాల్లో 7 మంది బరిలో నిలిచారు. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 28న ప్రచారం ముగియనుండగా.. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ పోటీ చేస్తు్న్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలపైనే తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ఉంది. ఎందుకంటే తొలిసారిగా కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. అలాగే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిలబడటం... కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ నువ్వానేనా అన్నట్లు పోరు కొనసాగుతోంది. కేసీఆర్ రెండు స్థానాల్లో గెలుపొందుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. రెండు చోట్ల ఓడిపోతారని కాంగ్రెస్, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు సీట్లలో పోరు రసవత్తరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments