Pawan Kalyan:నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్.. ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని ఆయన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పులు, విరాళాల గురించి పేర్కొన్నారు.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గత ఐదు ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ. 114.76 కోట్లుగా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47.7కోట్లు జీఎస్టీ రూపంలో మరో రూ.28.85కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే తనకు రూ.64.26 కోట్లు అప్పులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ. 17.56 కోట్లు అప్పుగా తీసుకోగా.. ఇతర వ్యక్తుల నుంచి రూ.46.70కోట్లు తీసుకున్నట్లు వివరించారు.
ఇక పవన్ కళ్యాణ్.. వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17.15కోట్లు ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాదబీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3.32కోట్లు విరాళాలు అందచేశారు. ఇందులో..
కేంద్రీయ సైనిక్ బోర్డు- రూ.1 కోటి
పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్- రూ.1 కోటి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి- రూ.50 లక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి- రూ.50 లక్షలు
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్- రూ.30,11,717
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- రూ.2 లక్షలు
నామినేషన్ అనంతరం పవన్ మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడేలా నామినేషన్ వేశానని తెలిపారు. ప్రజలు తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి తెలుగుదేశం- బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. ఈ పొత్తుల వల్ల జనసేనలో బలమైన నేతలకు త్యాగాలు తప్పలేదన్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న టీడీపీ నేత వర్మ తన కోసం సీటు త్యాగం చేశారని గుర్తుచేశారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు సముచిత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తానని మాటిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంతో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments