ఏపీ విద్యా విధానం భేష్.. ఇలాంటి సంస్కరణలే కావాలి , జగన్‌పై నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రశంసలు
- IndiaGlitz, [Friday,September 08 2023]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అభివృద్ధి శూన్యం, పారిశ్రామిక రంగం నాశనం అంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం కొనసాగిస్తోంది. వాస్తవాలను దాచిపెట్టి అభూత కల్పనలు, అసత్య వార్తలను వండి వారుస్తోంది. తెలుగుదేశం నేతలు సైతం జగన్ పాలనపై అదే స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలకు తెరదీస్తున్నారు. అభివృద్ధిని పక్కనబెట్టి సంక్షేమ కార్యక్రమాలకు పప్పు బెల్లాలు పంచినట్లుగా పంచుతున్నారంటూ చంద్రబాబు అండ్ కో గగ్గోలు పెడుతున్నారు. తనకు ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదని.. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అన్నదే తనకు ముఖ్యమన్నట్లుగా జగన్ ముందుకు సాగుతున్నారు. ఆయన పాలనకు తార్కాణంగా అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ను వరిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్‌లో వరుసగా మూడేళ్ల నుంచి ఏపీ దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో వుంటూ వస్తోంది. జగన్ ఏం చేయకుండా ఇదేది సాధ్యం కాదు కదా.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా రంగంపై దృష్టి:
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ విద్యారంగానికి అమితమైన ప్రాధాన్యతనిచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చారు, ఇంగ్లీష్ మీడియంలో విద్య, 8వ తరగతి నుంచే విద్యార్ధులకు ట్యాబ్‌లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, జగనన్న విదేశీ విద్యా పథకం వంటి గతంలో ఎన్నడూ లేని కార్యక్రమాలతో విద్యా రంగానికి ఊపిరిలూదారు. పేదవాడు కూడా కార్పోరేట్ చదువులు చదవాలన్న ఆకాంక్షతో జగన్ ఎంతో శ్రమిస్తున్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేది చదువేనని జగన్ గట్టి నమ్మకం.
ఏపీకొచ్చి అధ్యయనం చేసిన ఇతర రాష్ట్రాలు :
చేసిన మంచి వూరకే పోదని జగన్ ఎప్పుడూ చెబుతూ వుంటారు. అందుకు తగినట్లుగానే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మారిన తీరును, సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి తీసుకుంటున్న చర్యలను అనేక రాష్ట్రాలు, సంస్థలు స్వయంగా వచ్చి చూసి తెలుసుకుంటున్నాయి. కానీ ఇక్కడే వుంటున్న విపక్ష నేతలకు మాత్రం జగన్ సత్తా తెలియరావడం లేదు. తాజాగా ఎల్లో మీడియా ఈర్షపడేలా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు నోబెల్ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్ధికవేత్త మైఖేల్ క్రెమెర్.
ఏపీలో స్కూళ్ల పరిస్ధితులను కళ్లారా చూసిన క్రెమెర్ :
డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన క్రెమెర్ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పాఠశాలలను సందర్శించేందుకు వచ్చారు . ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి ముచ్చటపడ్డారు. విద్యార్థుల మనోవికాసానికి, వారి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని ఆయన కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్ళముందు కనిపిస్తున్న ఓ అద్భుతమైన మార్పుగా క్రెమెర్ అభివర్ణించారు.