సిగ్గో సిగ్గు.. ఇంట్లో ఓటర్లు.. పోలింగ్ బూత్‌లో ఆఫీసర్లు నిద్ర..!
- IndiaGlitz, [Wednesday,December 02 2020]
400 ఏళ్ల ఘన చరిత్ర.. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో నీతులు చెప్పే యువత.. పవర్ పాలిటిక్స్‌పై చర్చించే పెద్దలు.. ఓటు హక్కు గురించి లెక్చర్‌లిచ్చే విద్యావంతులు.. ప్రభుత్వాన్ని కలిసి తమకు కావల్సినవి రాబట్టుకునే సెలబ్రెటీలు.. ఇవేమీ మాకు తెలియదు.. రోజు గడిస్తే చాలనుకునే సామాన్యులు.. నిన్నంతా ఏమైపోయారో తెలియదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి పని అయిపోయిందనుకున్నారా? ఎవరు రాజ్యమేలితే మనకెందుకులే అనుకున్నారా? లెక్చర్‌లిచ్చి అలిసిపోయారా? బయటకు వస్తే కందిపోతామనుకున్నారా? ఈ రోజుకు మద్యం దొరికింది చాలనుకున్నారా? జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి. సమాధానం చెప్పే వారే కరవు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎప్పటిలాగానే ఓటర్లు పెద్దగా స్పందించలేదు. పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను పరిశీలిస్తే ఇదే కాస్త మెరుగైన ఓటింగ్ పర్సంటేజిగా కనిపిస్తోంది. 2009లో జీహెచ్ఎంసీ ఆవిర్భవించింది. 2002 నుంచి ఇప్పటి వరకూ నమోదైన పోలింగ్‌ను బట్టి చూస్తే ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ రప్పించడంలో పార్టీలు కొంతమేర సక్సెస్ అయ్యాయని చెప్పాలి. 2002 ఎంసీహెచ్ ఎన్నికల్లో 41.22, జీహెచ్‌ఎంసీ ఆవిర్భావం తర్వాత 2009లో 42.95, 2016లో 45.27 శాతం మేర పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే స్వల్పంగా పోలింగ్ పెరిగింది.
జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, 149 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ అభ్యర్థికి సీపీఎం గుర్తును కేటాయించడంతో పోలింగ్ జరగలేదు. పోలింగ్ జరిగిన చోటైన ఏమైనా ఫాస్ట్‌గా జరిగిందా? అంటే అదీ లేదు. ఓటర్లు ఇంట్లో నిద్రపోతే.. పోలింగ్ ఆఫీసర్లు బూత్‌లో నిద్ర పోయారు. అంతటి ఘోరంగా నత్తనడకన పోలింగ్ నడిచింది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 74,12,601 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు 27,22,891 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటివరకు 36.72 శాతం పోలింగ్ నమోదైనట్లయింది. పోలింగ్ ఊపందుకుంటుందని ఆశించిన పార్టీలకు నిరాశే ఎదురైంది. ప్రచారం నిర్వహించినంత కాలం జనసంద్రంలా కనిపించిన నగరం.. పోలింగ్ రోజున మాత్రం అసలు నగరంలో జనం ఉన్నారా? లేదా? అనిపించింది.
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా 9 గంటల వరకు 3.9 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. 11 గంటలకు 11.62 శాతం నమోదవడంతో పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా 20.35 శాతమే నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 29.76, సాయంత్రం 5 గంటల వరకు 36.73 మేర పోలింగ్ నమోదైంది. డివిజన్ల పరంగా రామచంద్రాపురంలో అత్యధికంగా 67.71 శాతం పోలింగ్ నమోదైంది. యూసఫ్‌గూడలో అత్యల్పంగా 33.03 శాతం నమోదైంది. సంపన్నులుండే జూబ్లీహిల్స్‌లో 2,10,037 ఓటర్లుండగా.. 74,611 ఓట్లు(35.52) మాత్రమే పోలవడం గమనార్హం. ఉదయం నుంచి ఏ సమయంలోనూ ఓటర్లు పెద్దగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. విద్యావంతులు ఉండే డివిజన్లు, ఐటీ కారిడార్లలోనూ ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.