టీడీపీకి 'నో’.. వైసీపీ, జనసేనతో పొత్తుకు ‘సై’!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ‘పొత్తులు’ పొడుస్తున్నాయి. నిన్నటి వరకూ ఉప్పు-నిప్పులా ఉన్న పార్టీలు సైతం తిన్నగా పొత్తు పెట్టుకునేందుకు ‘సై’అంటున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు అంటూ ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదం ముగియక మునుపే తాజాగా జనసేన లేదా వైసీపీతో తాము పొత్తుకు సిద్ధమేనని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనలా.. ఈయనిలా..!
ఏపీలో ఎవరితోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని సొంతంగానే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్‌చాందీ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చి 24 గంటలు గడవక మునుపే చింతా మోహన్ సడన్ ట్విస్ట్ ఇయ్యడంతో పార్టీలో అసలేం జరుగుతోందో తెలియక జుట్టుపీక్కుంటున్నారట. చెప్పాల్సిందంతా చెప్పేసిన చింతా ఇవన్నీ తన సొంత అభిప్రాయాలని.. ఈ వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆయన సేఫ్ జోన్లో పడ్డారు.
ఆయనేమన్నారు.. అసలేంటి పంచాయితీ!
" ఏపీలో వైసీపీ, జనసేనలతో పొత్తుకు మేం ‘సై’. కానీ టీడీపీతో మాత్రం కలిసే ప్రసక్తే లేదు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది.. అందుకే మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితుల్లేవు" అని చింతా తన మనసులోని మాటను బయటపెట్టారు.
జగన్ సీఎం అయినా ఓకే..!
"జగన్, పవన్‌లలో ఎవరైనా పొత్తుకు ఓకే అంటే.. కాంగ్రెస్ అధిష్టానంతో నేను మాట్లాడుతాను. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైసీపీతో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంది. జగన్‌కు సీఎం పదవి ఇచ్చినా ఫర్వాలేదు. అంతేకాదు పవన్ ఓకే అన్నా జనసేనతోనైనా పొత్తుకు సిద్ధమే. జనసేనాని తమ పార్టీ నేత చిరంజీవి తమ్ముడే కదా.. అందుకే అడుగుతున్నా" అని చింతా సడన్ ట్విస్ట్ ఇచ్చారు.
జగన్ ఏమంటారో..!
జగన్‌తో పొత్తుకు మేం ‘సై’.. ఆయనకు సీఎం పదవి తీసుకున్నా అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేత ఇస్తున్న ఓపెన్ ఆఫర్‌కు వైసీపీ అధినేత స్పందిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీని కాదని.. ఎదిరించి మరీ జగన్ బయటికొచ్చి పార్టీ పెట్టారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లడం.. మళ్లీ 2014 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేసి టీడీపీ-జనసేన-బీజేపీ చేతిలో కేవలం ఒకే ఒక్క శాతం ఓటు బ్యాంకుతో ఓడిపోవడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో తామెవ్వరితోనూ పొత్తు పెట్టుకోమని.. ఎన్ని పార్టీలు కలిసినా వైసీపీ మాత్రం సింగిల్‌గానే పోటీ చేస్తుందని జగన్ ఇప్పటికే స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే చింతా ఓపెన్ ఆఫర్‌పై జగన్ నుంచి గానీ.. వైసీపీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
సేనాని నుంచి రియాక్షన్ ఉంటుందా..!
ఇప్పటికే పవన్‌తో పొత్తు అన్నందుకు టీడీపీ, ఆ పార్టీ నేతలపై ఒంటికాలిపై లేచిన జనసేనాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోను.. పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు అని తెలుగు తమ్ముళ్లకు దిమ్మదిరిగేలా పవన్ పంచ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అని ఒకప్పుడు పవన్ నినదించిన విషయం విదితమే. ఆ తర్వాత చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడం ఇవన్నీ జరిగిపోయాయి. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగిసిన తర్వాత చిరు ఇంత వరకూ క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు.! అయితే కాంగ్రెస్ చింతా తాజా ట్విస్ట్‌లపై పవన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
మొత్తానికి చూస్తే.. ఏపీలో ఎవరితో అయినా సరే పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను బతికించుకోవాలని నేతలు భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే అటు వైసీపీ- టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీలు కొట్టుకోవడంతో మూడో వ్యక్తికి న్యాయం జరిగినట్లుగా ఓట్లన్నీ తమకే పడతాయని కాంగ్రెస్ యత్నాలు చేస్తోంది. దీనికి తోడు అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా సైతం ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని అధిష్టానం చెబుతోంది. అయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి..? మున్ముంథు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో..? ఎన్నికల సీజన్లో ఎవరు ఎవరి గూటికెళ్తారో..? రాజకీయ చదరంగంలో ఎవరు విన్నరో..? ఎవరు రన్నరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout