ఇలాంటి గౌరవం ఏ గురువుకూ దక్కదేమో...

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. గురువు స్థానాన్ని దైవం కంటే ముందు పెట్టారు పెద్దలు. అంతటి ఉన్నతమైన స్థానం గురువుకి ఉంది. అయితే దీనికి కొందరు మాత్రమే సార్థకత చేకూరుస్తారు. ఒక ఉపాధ్యాయుడు వెళుతుంటే స్కూలులోని విద్యార్థులంతా కంటతడి పెట్టిన ఘటనలు ఇప్పటి వరకూ మనం చూశాం. కానీ ఒక ఉపాధ్యాయుడికి ఎలాంటి గౌరవం దక్కిందో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.

అసలు విషయంలోకి వెళితే విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గిరిజన గ్రామంలో తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన ఒక గురువును గ్రామస్తులు తమ గుండెల్లో దాచుకున్నారు. ఆయన బదిలీ అయి సోమవారం వెళ్లిపోతుంటే ఊరు ఊరంతా తరలి వచ్చి వీడ్కోలు పలికింది. ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గౌడ్ నరేంద్ర అనే ఉపాధ్యాయుడు 2011 నుంచి పని చేస్తున్నారు. ఆ పాఠశాలకు భవనం కూడా లేదు. కానీ నరేంద్ర పిల్లలకు చెట్ల నీడలో శిథిలమైన షెడ్డులోనే విద్యను బోధించేవారు.

క్రమక్రమంగా ఆయన గ్రామస్తులకు సైతం దగ్గరయ్యారు. నేడు ఆయన వేరే ఊరుకు బదిలీ అయ్యారు. దీంతో ఆయనకు ఊరంతా కదిలొచ్చి వీడ్కోలు పలికింది. తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పిన ఆ గురువకు కాళ్లు కడిగి పూజలు చేసి డప్పు చప్పుళ్ల మధ్య భుజాలపైకి ఎత్తుకుని ఆడ, మగా తేడా లేకుండా నృత్యాలు చేసి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నరేంద్ర దంపతులను సత్కరించి అత్యంత గౌరవంగా వీడ్కోలు పలికారు. పిల్లల మన్ననలే కాకుండా పెద్దల మన్ననలు సైతం పొందిన నరేంద్రను పలువురు ప్రశంసిస్తున్నారు.